తిక్కలోళ్లు తీర్ధానికి వెళితే.. ఎక్కా, దిగా సరిపోయిందని ఓ సామెత. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు చేస్తున్న పనులు, అంటున్న మాటలు గమనిస్తుంటే ఈ సామెత గుర్తుకు వస్తుంది. తోచి, తోయనమ్మ తోడికొడలు పుట్టింటికి వెళ్లినట్లుగా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలో సమస్యలు ఏవీ లేనట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన సరస్వతి పవర్ కంపెనీకి చెందిన ప్రైవేటు భూములలోకి వెళ్లి గొడవ చేసి వచ్చారు.
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని ప్రజలు బూతులు తిడుతున్నారని చెప్పడం ద్వారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పరువు తీశారు. దీనిపై చంద్రబాబులో అసంతృప్తి ఉన్నా, పవన్ కళ్యాణ్‌ను ఏమీ నేరుగా అనలేకపోయారు. అయినా ఆయన అసహనం ఏదో రకంగా పవన్‌కు తెలిసి ఉంటుంది. దాంతో పవన్ ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు సడన్‌గా పల్నాడులోని సరస్వతి పవర్‌కు చెందిన భూలముల సందర్శనకు వెళ్లి ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. లేదంటే..
డైవర్షన్ రాజకీయాలలో భాగంగా ఇద్దరు కలిసి ఈ యాక్టివిటి సృష్టించారని కొందరు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు తనదైన స్టైల్‌లో ఎమ్.ఆర్.పి.ఎస్ నేత మంద కృష్ణతో పవన్ కల్యాణ్‌కు వార్నింగ్ మెస్సేజ్ ఇప్పించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబును కలిశాకే మందకృష్ణ ఈ అంశం గురించి మాట్లాడారు. మామూలుగా అయితే ఇలా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా, ప్రత్యేకించి తనకు డామేజీ అయ్యేలా ఏ టీడీపీ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా మాట్లాడితే. వెంటనే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిలో ఒక లీక్ వచ్చేది. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని, చర్య తీసుకుంటామని హెచ్చరించారని ప్రచారం జరిగేది. కానీ పవన్ అంతగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించినా చంద్రబాబు స్పందించలేకపోయారు. హోం మంత్రి అనిత నిస్సహాయంగా మిగిలిపోయారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై ఏదో తేడా వస్తే.. చంద్రబాబు పోన్ చేసి క్లాస్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ పవన్ విషయంలో అలా చేయడానికి చంద్రబాబు సాహసించలేకపోయారు. అయినా.. పరోక్షంగా మంద కృష్ణతో క్లాస్ పీకించారు.
పవన్ కల్యాణ్, ప్రైవేటు సంస్థ భూములలోకి వెళ్లడం ఏ రకమైన అధికారమో తెలియదు. నిజంగా ఆ భూముల విషయంలో ఏదైనా తేడా ఉండి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఊరికే వదిలేసేదా? ఆ సంస్థకు నీరు ఇవ్వడం కూడా తప్పే అన్నట్లు పవన్ ప్రసంగించారు. వెయ్యి ఎకరాలలో ఇరవైనాలుగు ఎకరాలు ఏదో తేడా ఉందని ఈయన కనిపెట్టారు. అధికారులు అంతకుముందు పరిశీలనకు వచ్చి అక్కడ ప్రభుత్వ భూమి లేదని చెబితే.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఈయన వచ్చి 24 ఎకరాల అస్సైన్డ్ భూమి, కుంటలు, చెరువులు ఉన్నాయని చెప్పారు. కేవలం స్థానికులను రెచ్చగొట్టి, అక్కడ పరిశ్రమ రాకుండా చేయాలన్న దురుద్దేశంతో పవన్ వెళ్లినట్లు ఉంది తప్ప, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా చేసినట్లు కనిపించదు. అంటే ఇంకెవరైనా పరిశ్రమలు పెడితే ఫర్వాలేదా? జగన్ మాత్రం పెట్టకూడదా?.
ఇక్కడకు సమీపంలోనే ప్రభుత్వం అదానీ, మహా సంస్థలకు భూములు కేటాయించింది. అక్కడకు ఈయన వెళ్లలేదు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే పరిశ్రమలు కొత్తగా పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? నాకు తెలిసి ఒక ప్రైవేటు కంపెనీ భూమిలోకి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్లి ఇలా అరాచకం చేయడం ఇదే మొదటిసారి కావచ్చు.
ఒకవైపు లోకేష్ రెడ్ బుక్ అంటూ కొత్త పారిశ్రామికవేత్తలకు భయానక వాతావరణం సృష్టిస్తుంటే, పవన్ తాను వెనుకబడిపోతానేమో అన్నట్లుగా స్వయంగా రంగంలో దిగి పారిశ్రామిక వాతావరణాన్ని చెడగొట్టే పనిలో ఉన్నారు. ఏపిలో జరుగుతున్న ఘాతుకాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంపైనే కాదు.. ఇలా పవన్ అడ్డగోలుగా ప్రవర్తిస్తే కూడా జనం తిడతారన్న సంగతి గుర్తుంచుకోవాలి. పర్యావరణ మంత్రిని అని చెబుతూ ఖాళీగా ఉన్న భూమలులోకి వెళ్లిన పవన్‌కు కర్నూలు జిల్లా దేవనకొండ వద్ద వేలాది మంది ప్రజలు యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కనిపించడం లేదు.
రాజధాని పేరుతో 33 వేల ఎకరాల పంట భూమిని బీడుగా మార్చినా,అక్కడ పర్యవరణానికి ఇబ్బంది లేదని ఆయన భావిస్తున్నట్లుగా ఉంది. వందల ఎకరాల అస్సైన్డ్ భూమిని టీడీపీ పెద్దలు కొట్టేసినా, అక్కడ పవన్‌కు సంతోషంగానే ఉందని అనుకోవాలా? కృష్ణా నది ఒడ్డున అక్రమ భవనాలు ఉన్నాయి కదా! వాటిలో ఒకదానిలో ముఖ్యమంత్రి కూడా ఉంటున్నారు కదా! వాటిని ఖాళీ చేయించి పర్యావరణాన్ని కాపాడానని పవన్ చెప్పగలిగితే అంతా శభాష్ అంటారు. నిజంగా పవన్‌కు ఆ ధైర్యం ఉందా?.
హోం మంత్రి అనిత ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. ప్రతిపక్షం వారు విమర్శలు చేశారంటే అదొక పద్దతి. కాని ఉప ముఖ్యమంత్రి హోదా లో ఉండి అనితను అవమానించిన తీరు బాగోలేదు. నిజానికి ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయనకు ప్రత్యేకంగా కొమ్ములేమీ ఉండవు. ఆయన కూడా మంత్రులతో సమానమే. తనకు తాను హోం శాఖ ను తీసుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి పరిధిలో ఉండే అధికారమది. ఆ విషయం పవన్ కు తెలియదేమో! కాకపోతే భాగస్వామి పార్టీగా తనకు హోం శాఖ కావాలని అడిగి తీసుకోవచ్చు. అంతేకాదు.హోం శాఖ ఒక్కటే చేతిలో ఉంటే అన్ని పవర్‌లు ఉండవు. లా అండ్ ఆర్డర్ అనేది ప్రత్యేక విభాగం. అది ఎప్పుడూ ముఖ్యమంత్రే ఉంచుకుంటారు.
శాంతి భద్రతలు విఫలమైతే అందుకు ప్రధానంగా ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రులంతా బాధ్యత వహించాలి. ఒక పక్క రెడ్ బుక్ అమలు చేయాలని ,టీడీపీ వారు అరాచకాలు చేసినా చర్య తీసుకోరాదని పోలీసులపై ఒత్తిడి తెచ్చేది వారే. ఇంకో పక్క లా అండ్ఆర్డర్ విఫలం అయిందని చెప్పేది వారే. ఇదంతా నాటకీయంగా ఉంది తప్ప ఇంకొకటి కాదు. కేవలం అనితనే బాధ్యురాలిని చేయకుండా చంద్రబాబు ను కూడా తప్పు పట్టి ఉంటే అప్పుడు పవన్ కల్యాణ్ చిత్తశుద్దితో ఉన్నారని అనుకోవచ్చు. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగితే ఎవరో పోలీసు అధికారి చర్య తీసుకోవడం లేదట. దానికి కులం అడ్డం వస్తోందని చెప్పారట. అది నిజమే అయితే వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేయాలి కదా? ఒకరకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నదో ఈ ఉదాహరణ తెలియచేస్తుంది.
పవన్ కల్యాణ్ తెలిసి చెప్పారో,లేక తెలియకుండా చెప్పారో కాని ఒక్క నిజం మాత్రం వెల్లడించారు.అదేమిటంటే కూటమి ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారని. వంద అబద్దాలను కవర్ చేసుకోవడానికి పవన్ ఈ ఒక్క నిజం చెప్పారా!అన్న సందేహం కలుగుతుంది.ఇంకో మాట కూడా అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో తన ప్రాధాన్యతతగ్గుతోందని, ఆ నేపధ్యంలో ఆయన చంద్రబాబును బెదిరించడానికి ఈ రకంగా మాట్లాడి ఉండవచ్చని అంటున్నారు. కాని వవన్ వ్యాఖ్యలతో పరువు పోయిందన్న భావంతో ఉన్న చంద్రబాబు కు కోపం వచ్చిన సంగతి గమనించి,వెంటనే ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పల్నాడు టూర్ పెట్టుకుని ఇష్యూని డైవర్ట్ చేసే యత్నం చేసి ఉండవచ్చు. కేవలం ఏపీలో జరుగుతున్న నేరాలు-ఘోరాల గురించే కాదు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నందుకు కూడా జనం తిడుతున్నారు. ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి పవన్ యత్నించారు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు పదిహేనువేలు, మహిళా శక్తి కింద ప్రతిఇ స్త్రీకి నెలకు 1500 రూపాయలు ఇస్తామని,నిరుద్యోగ భృతి 1500 ఇస్తామని ..ఇలా అనేక హామీలు ఇచ్చారు కదా..విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు కదా..కానీ ఇప్పుడు దారుణంగా పెంచుతున్నారే. అగ్గిపెట్టెలు,కొవ్వొత్తులకే 23 కోట్లు వ్యయం చేసిన ప్రభుత్వంగా ఇది రికార్డు పొందింది కదా! తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన నెయ్యి వాడారని తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దేవుడికే అపచారం చేశారే! వీటన్నిటిపైన జనం మండిపడుతున్నారు.
గతంలో చంద్రబాబు పాలన ఇంత అధ్వాన్నంగా లేదని, ఇప్పుడే మరీ దరిద్రంగా తయారైందని సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు.వీటితో తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడినా జనం నమ్మరు.ఒక రోజేమో చంద్రబాబు అనుభవం, పాలన అధ్బుతం అని ,మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసి, ఇంకో రోజు తమ పాలన తీరుపై జనం బూతులు తిడుతున్నారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కాబట్టి తింగరోళ్లు తీర్ధానికి వెళితే ఎక్కా,దిగా సరిపోయిందన్న సామెత చెప్పవలసి వచ్చింది.
::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment