ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఏపీలో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు, తెలంగాణలో కేసీఆర్ పాలన తీరును ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించేవారు. తన ముందు కేసీఆర్ అనుభవం ఏపాటి అన్నట్టు వ్యాఖ్యానిస్తుండేవారు. చివరకు ‘నోటుకు ఓటు’తో ఎమెల్సీని కొనుగోలు చేయబోయి అడ్డంగా బుక్కయ్యారు. ఏపీలో జగన్ సర్కారు ఏర్పాటయ్యాక రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత పెరిగింది. కానీ, ఇటీవల టీఆర్‌ఎస్ మంత్రులు ఏపీ సర్కారుపై నోరు జారుతున్నారు. ఒకవైపు కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ స్థాపించి వెళ్తుంటే, ఆయన మంత్రులు ఏపీతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం వల్ల లాభం ఏమిటి?
తెలంగాణ సీనియర్ మంత్రి టి. హరీష్ రావు ఏపీ గురించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. కొంత పద్ధతిగా ఉండే మనిషే అయినా, ఆయన అనవసరంగా ఏపీ ప్రస్తావన తెచ్చారనిపిస్తుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏపీలో కన్నా తెలంగాణలో బెటర్ గా ఉన్నారనీ, ఏపీలో నిరసన తెలిపితే లోపల వేస్తున్నారనీ ఆయన అన్నారు! దీనిపై వెంటనే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, ఏపీకి వచ్చి ఇక్కడ టీచర్ల స్థితిగతులు చూడాలని సలహా ఇచ్చారు.
ఎందువల్లో తెలియదు కాని ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడప్పుడు టీఆర్‌ఎస్ మంత్రులు కొందరు మాట జారుతున్నారు. అంతకుముందు టర్మ్‌లో ఏపీలో అధికారంలోఉన్న టీడీపీకి, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు మధ్య సఖ్యత ఉండేది కాదు. దానికి ‘ఓటుకు నోటు’ కేసు తోడైంది. అప్పట్లో ప్రభుత్వాలు ఏర్పడిన తొలి రోజుల్లో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తీరును ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానిస్తుండేవారు.
తన అనుభవం ముందు కేసీఆర్ ఏపాటి అని అంటూ తెలంగాణ ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపుతుండేవారు. ఆ తర్వాత తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరిని కొనుగోలు చేయబోయి చంద్రబాబు దొరికిపోయారు. దానిని అవకాశంగా మలచుకుని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి చంద్రబాబును విజయవాడకు పంపించేయడంలో కేసీఆర్ కృతకృత్యులయ్యారు.
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితి చక్కబడింది. ఆయా అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, వాటిని వ్యక్తిగత తగాదాలుగానో, పార్టీల మధ్య గొడవలుగానో మార్చకుండా ఇరువైపులా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ మంత్రులు అప్పడప్పుడు నోరు జారుతున్నారు. ఈ విషయంలో మంత్రి ప్రశాంతరెడ్డి తొలుత ఏపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.
ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ఒక సభలో ఏపీ రోడ్లు బాగోలేదంటూ ఒక వ్యాఖ్య చేసి ఇబ్బంది పడ్డారు. ఆ వ్యాఖ్య చేయగానే సోషల్ మీడియాలో.. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల ఫొటోలను తీసి కేటీఆర్‌కు తెలియచేసే యత్నం చేశారు. తనపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆరోజు రాత్రే కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని విచారం వ్యక్తం చేశారు.
అంతటితో ఆ వివాదం ముగిసింది. ఈ మధ్య ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశంసిస్తూ కష్టకాలంలో కూడా బాగా పనిచేశారని అన్నారు కూడా. అయితే ఇటీవల మంత్రి హరీష్ రావు తిరుపతి వెళ్లిన సందర్భంలో ఏపీలో కరెంటు సప్లయి సరిగా లేదని వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది.
హరీష్ రావు మళ్లీ ఇంకో సందర్భం చూసుకుని ఏపీలో టీచర్లు, ఉద్యోగులపై అణచివేత జరుగుతోందన్న భావన కలిగేలా మాట్లాడారు. అది పూర్తిగా తప్పని చెప్పాలి. ఆయా సంఘాల వారు తమ డిమాండుల కోసం ‘చలో అసెంబ్లీ’ అనో, ‘చలో సెక్రటేరియట్’ అనో.. ఇలా రకరకాల ఆందోళనలు చేస్తుంటారు.
ఆ క్రమంలో పోలీసులు ఎక్కడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా వారి విధి వారు నిర్వర్తిస్తారు. అది ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుంది. ఏపీలోనే ఇలా జరుగుతున్నట్లు, తెలంగాణలో జరగనట్లు ఎలా మాట్లాడతారు?
ఏ రాష్ట్రంలో ఉండే సమస్యలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో పీఆర్‌సీలు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయి. తెలంగాణలో రిటైర్‌మెంట్ వయసు అరవై ఒకటి అయితే, ఏపీలో అరవై రెండు. ఆ మేరకు టీచర్లు, ఉద్యోగులకు ఏడాదిపాటు అదనంగా ఉద్యోగ భద్రత వచ్చింది. ఏపీలో స్కూళ్లను ‘నాడు–నేడు’ కింద బాగు చేస్తున్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా చేయడం ఆరంభించారు.
ఇది మంచి పద్దతి. ఏ రాష్ట్రంలో అయినా ప్రజలకు ఉపయోగపడే విషయాలు జరుగుతుంటే వాటిని ఇతర రాష్ట్రాలు ఆచరించడం స్వాగతించవలసిన విషయం. తెలంగాణలో మిషన్ భగీరథను ఆయా రాష్ట్రాల వారు చూసి వెళ్లారు. కొందరు దానికి అనుగుణంగా వారి రాష్ట్రాల్లో ప్లాన్ చేసుకున్నారు.
ఏపీలో రైతు భరోసా కేంద్రాలు పెట్టిన తర్వాత తెలంగాణలో రైతు వేదికలను ఏర్పాటు చేశారు. ఇలా పోల్చుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి. కనుక హరీష్ రావు వంటి సీనియర్ మంత్రులు సంయమనంతో మాట్లాడడం మంచిది. తెలంగాణ ఉద్యమం ముగిసి చాలా కాలం అయిందని విస్మరించకూడదు.
ఏపీపై కేటీఆర్ ఒక రకంగా మాట్లాడితే హరీష్ రావు భిన్నంగా మాట్లాడడమే కాకుండా, వివరణ కూడా ఇవ్వలేదు. పైగా మరో మంత్రి గంగుల కమలాకర్ మరింత ముందుకు వెళ్లి ఏపీలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనీ, జాతీయ పార్టీ పెడితే ఏపీలో కూడా గెలుస్తామనీ అన్నారు. బహుశా హరీష్‌కు విధేయుడుగా ఆయన మాట్లాడారా అన్న సందేహం వస్తుంది. ఆయన మరో సీరియస్ వ్యాఖ్య కూడా చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డిని తెలంగాణ జోలికి రావద్దనీ, ఒకవేళ వస్తే 2014 ముందటి పరిస్థితులు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు! అంటే ఏమిటి దాని అర్థం? ఏపీలోకి వెళ్లి ఉద్యమాలు చేస్తారా? లేక హైదరాబాద్‌లో, ఇతర జిల్లాల్లో నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్స్‌పై దాడులు చేస్తారా? ఇదేనా ఒక మంత్రి అనవలసిన మాట.
నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్య చేసిన కమలాకర్‌ను బహిరంగంగా మందలించి ఉండాల్సింది. ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ పరిసరాలలో ఉన్నారు. వారిలో వైపీపీ మద్దతుదారులు, జగన్ అభిమానులు గణనీయంగానే ఉంటారు. హరీష్, లేదా కమలాకర్ మాదిరి టీఆర్‌ఎస్ నేతలు ఇలాగే వ్యాఖ్యానిస్తూ పోతే వారిలో వ్యతిరేకత రావచ్చు.
అందువల్ల టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా కూడా ఉపయోగం ఉండదు. గత శాసనసభ ఎన్నికలలో ఆంధ్ర సెటిలర్లు టీఆర్‌ఎస్‌కు బాగా మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆంధ్ర సెటిలర్స్ ప్రాంతాలన్నిటిలో టీఆర్‌ఎస్ గెలిస్తే, తెలంగాణ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రాంతాలలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీ గెలిచింది.
ఈ సంగతి టీఆర్‌ఎస్ నేతలకు తెలియదా? ఇదంతా చూస్తుంటే గతంలో మాదిరి ఆంధ్రా వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారా అన్న ఆలోచన కూడా విశ్లేషణలోకి వస్తుంది. కాని అప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి పరిస్థితి వేరు.
మిగిలిన రాష్ట్రాలలో పరిస్థితులపై మాట్లాడడం వేరు, ఏపీ గురించి మాట్లాడడం వేరు. రెండు రాష్ట్రాలూ తెలుగువారివే. అదీ కాకుండా ఒక రాష్ట్రంగా ఉండి విడివడినవారు. అయినా రెండు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని అంతా కోరుకుంటారు. దానికి రెండువైపులా సహకరించుకోవాలి.
తొలుత ఏపీ మంత్రులు ఇలాంటి అంశాలపై రియాక్ట్ అయ్యేవారు కారు. కొంత సంయమనం పాటించేవారు. కాని హరీష్ రావు వ్యాఖ్యలు శృతి మించడంతో వారు కూడా కొంత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేతలకు ఒక కోపం ఉన్నట్లుంది. తమ నేత కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవడం లేదన్నది వారి ఆక్రోశం కావచ్చు.
అలాగే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టరాదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంటే, ఏపీ ప్రభుత్వం మొత్తం అన్ని జిల్లాలలో దానిని అమలు చేయడానికి ఉపక్రమించింది. ఏపీలో అది విజయవంతంగా సాగుతుండడం, రైతులలో వ్యతిరేకత వ్యక్తం కాకపోతుండడంతో టీఆర్‌ఎస్‌లో అసహనం పెరిగి ఉండవచ్చు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదట బాగానే సహకరించినా, తదుపరి ఏదో ఒక కొర్రీ పెడుతోంది.
ప్రాజెక్టు పూర్తి అయితే భద్రాచలం మునిగిపోతుందని ప్రచారం చేసింది. కేంద్రం ఆ వాదనను ఖండించడంతో రాజకీయం కోసమే టీఆర్‌ఎస్ ఇలాంటివాటిని తెరపైకి తెస్తోందన్న భావన ఏర్పడింది. ఒక వైపు కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పేరుతో జాతీయ పార్టీని స్థాపించి ముందుకు వెళుతుంటే, ఆయన మంత్రులు మాత్రం ఏపీ ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకుని రాజకీయ వివాదాలు సృష్టించే పనిలో ఉన్నారు. దీనివల్ల ఎవరికి లాభం?
- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment