పార్టీ పేరు మారుస్తూ తీర్మానం చేసిన అనంతరం సంతకం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో కుమారస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చాలని ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. పార్టీ పేరు మార్పుపై ఈ నెల 5న జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో చేసిన తీర్మానం కాపీతో పాటు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు సీఈసీకి రాసిన లేఖ ప్రతిని సమర్పించింది.
టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డిలు గురువారం ఢిల్లీలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మను కలిశారు.
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడానికి సంబంధించిన వినతిపత్రాన్ని అందించి, దీనిపై చట్టపరంగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ భేటీ అనంతరం వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘ఏ రాజకీయ పార్టీ అయినా తన పేరును, చిరునామాను మార్చిన పక్షంలో వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేయాలని ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29ఏ సబ్ క్లాజ్ 9లో ఉంది.
అందువల్లే సమయం వృథా చేయకుండా తీర్మాన పత్రాన్ని సీఈసీకి సమర్పించాం. ఇప్పటివరకు ఈ పేరుతో ఏవైనా దరఖాస్తులు ఉన్నాయా.. లేదా? అనే అంశాన్ని పరిశీలించిన తర్వాత, చట్ట ప్రకారంగా జరగాల్సిన మార్పు కోసం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుంది..’అని తెలిపారు.
కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కాదు..
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 14వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చితే మునుగోడు ఉప ఎన్నికలో తప్పకుండా బీఆర్‌ఎస్ పేరుపైనే పోటీ చేస్తామని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. ఆలోగా ఒకవేళ పేరు మారకపోతే టీఆర్‌ఎస్ పేరుపైనే బరిలో దిగుతామని వివరించారు.
ఒక పార్టీ పేరు సంక్షిప్తంగా ఉండడం వేరు.. పూర్తిగా ఉండడం వేరు అని ఒక ప్రశ్నకు సమాధానంగా వినోద్‌కుమార్ చెప్పారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీల పేర్లు సంక్షిప్తంగా ఒకే మాదిరి ఉన్నాయని.. అదేం సమస్య కాదని తెలిపారు. పార్టీ పేరు మార్పు జరిగితే చట్ట ప్రకారం వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని, అందుకోసమే వారిని కలిశామని చెప్పారు.
ప్రచారంలో ఉన్న విధంగా నూతన పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కాదని వివరణ ఇచ్చారు. జాతీయ పార్టీగా గుర్తింపు అనేది ప్రస్తుతానికి అవసరం లేదని, ఏ పార్టీ అయినా దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ స్థానాలకూ పోటీ చేయవచ్చని వినోద్‌కుమార్ మరో ప్రశ్నకు జవాబిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్ పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏ జాతీయ రాజకీయ పార్టీ కూడా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసే పరిస్థితి లేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment