Central Election Commission
-
అనుమానాలను నివృత్తి చేస్తాం..రండి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతీ దశలోనూ పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని, ఆధారాలు చూపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ కాంగ్రెస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు/ఏజెంట్ల ప్రమేయం ఉందని వివరించింది. ఓటింగ్ సరళిపై ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదని, పోలింగ్ బూత్‌ల వారీగా అభ్యర్థులందరికీ ఆ డేటాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని నొక్కి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించి రాతపూర్వకంగా బదులిస్తామని ఈసీ స్పష్టం చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు మహాయుతి కూటమిలోని బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లు సాధించగా, మహా వికాస్ అఘాడీ పక్షాలైన కాంగ్రెస్‌కు 16, శివసేన (ఉద్ధవ్)కు 20, ఎన్సీపీ (శరద్) పార్టీకి 10 స్థానాలు దక్కడం తెలిసిందే. -
వారం పాటు ‘ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం’
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధాన్ని అమలు చేయనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు పార్లమెంటరీ స్థానాలు, 48 శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికల సందర్భంగా మీడియా సంస్థలు లేదా మరే ఇతర పద్ధతిలో ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ తెలిపింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 20 వరకు ఎగ్జిట్ పోల్స్ఫై ఆంక్షలు విధించారు. -
బీజేపీ నియంత్రణలో ఈసీ, సీబీఐ, ఈడీ: రాహుల్
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు పెంచారు. శనివారం రాంచీలో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ సభలో ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి సహా అన్ని వైపుల నుంచి రాజ్యాంగంపై ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. వీళ్ల దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కేంద్ర ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ, పాలనాయంత్రాంగం, న్యాయపాలికసహా అన్ని వ్యవస్థలను అధికారంలోని బీజేపీ గుప్పిటపట్టింది. నిధులు, సంస్థలనూ నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖాతాల స్తంభన కారణంగా నగదులేకపోయినా కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో పోరాడింది. కులగణనకు సామాజిక ఎక్స్‌రే తప్పనిసరి. వీటికి మోదీ అడ్డుతగులుతున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు లేకపోయినా సరే మేం అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతాం. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం’’అని రాహుల్ అన్నారు. -
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్‌ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్‌పవార్) – కాంగ్రెస్‌ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్‌షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్‌పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్‌లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్‌ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్‌కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
మోగిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా... షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
మోగిన ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల కోలాహలం ముగిసిన కొద్దిరోజులకే మరో రెండు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలుకానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నికల వేడిని పెంచింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూలు మీడియా సమావేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలతోపాటు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ స్థానాలు, 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల షెడ్యూళ్లను విడుదలచేశారు.వారాంతాల్లో పోలింగ్ నిర్వహిస్తే పట్టణప్రాంత ఓటర్లు సెలవుదినంగా దుర్వినియోగం చేస్తున్నారన్న భావనతో పోలింగ్‌ను కేవలం బుధవారాల్లోనే రెండు రాష్ట్రాల్లో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ తొలి విడతలో 43 స్థానాలకు, రెండో విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.పశ్చిమబెంగాల్లోని బసిర్హాట్ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్నికలపై పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలచేయలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యలోని శివసేన పారీ్టతో బీజేపీ అధికారాన్ని పంచుకున్న విషయం తెల్సిందే. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 సీట్లకుగాను 31 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్–ఎన్సీపీ(ఎస్పీ)–శివసేన(యూబీటీ) కూటమి నుంచి అధికార మహాయుతి కూటమికి గట్టిసవాల్ ఎదురవుతోంది. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం), కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. మహారాష్ట్రలో 288, జార్ఖండ్‌లో 81 మహారాష్ట్రకు సంబంధించి మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 9.64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓట ర్లలో 4.97 కోట్ల మంది పురుషులుకాగా 4.66 కోట్ల మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో 1,00,186 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో 9 ఎస్సీ, 28 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 2.60 కోట్ల మంది ఈసారి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 29,562 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేస్తున్నారు. -
యంత్రమా.. కుతంత్రమా?
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు) పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తల నుంచి సాధారణ ప్రజల వరకూ వ్యక్తం చేస్తున్న అనుమానాలను తాజాగా వెల్లడైన హరియాణా ఎన్నికల ఫలితాలు మరింత పెంచాయి. అత్యధిక ఓటింగ్ శాతంతో అత్యధిక ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకు పరిమితం కాగా ఆ పార్టీ కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి 48 సీట్లు రావడంతో ఈ సందేహాలు మరింత పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హరియాణా ఎన్నికల ఫలితాల అనంతరం ఈ అనుమానాలు బలపడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లకు, లెక్కింపులో వచ్చిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు వోట్ ఫర్ డెమోక్రెసీ (వీఎఫ్‌డీ), అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు ఆధారాలతో సహితంగా బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీ కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలను వ్యక్తం చేయడం విదితమే. ఈసీ మౌనంతో పెరుగుతున్న అనుమానాలు ఈవీఎంలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తొలి నుంచీ మౌనం వహిస్తుండటం అనుమానాలను మరింత పెంచుతోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే అప్లోడ్ చేయాల్సిన ఫారం– 20 వివరాలపై తీవ్ర జాప్యం చేయడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. ఫారం – 20లో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్ల వివరాలు ఉంటాయి. దీని ద్వారా ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసిన ఒక్కో అభ్యరి్థకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి? లెక్కింపులో ఎన్ని ఓట్లు వచ్చాయి? అనేది తెలిసిపోతుంది.సాధారణంగా ఫారం–20ని ఓట్ల లెక్కింపు జరిగిన వారం రోజుల్లోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అయితే ఎన్నికల సంఘం ఈసారి ఈ వివరాలను వెంటనే వెల్లడించలేదు. ఎన్నికల కౌంటింగ్ జరిగిన 108 రోజుల తర్వాత తాపీగా గత నెల 19న నియోజకవర్గాలవారీగా పార్లమెంటు, శాసన సభ స్థానాలకు లెక్కించిన ఓట్ల వివరాలతో ఫారం–20ని ‘సీఈవో ఆంధ్ర’ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఇంత ఆలస్యంగా వెల్లడించడంపై పలు అనుమానాలు ముసురుకుంటున్నాయి. భారీగా పెరిగిన పోలింగ్ శాతం ప్రతి ఎన్నికల్లో పోలింగ్ రోజు ఈసీ ప్రాథమికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తుంది. ఆ తర్వాత రోజు తుది శాతాలను ప్రకటిస్తుంది. అయితే ఈసారి పోలింగ్ తుది శాతాన్ని ప్రకటించేందుకు ఏకంగా నాలుగు రోజుల సమయం తీసుకుంది. అందులోనూ ప్రాథమికంగా పోలైన ఓట్లకు, తుది ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయి. ఇలా తుది శాతాల ప్రకటనకు సుదీర్ఘ సమయం తీసుకోవడం, భారీ తేడాలు రావడంతో అనుమానాలకు బీజం పడింది. మే 13న రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు తొలుత పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. తుది శాతాన్ని నాలుగు రోజులు ఆలస్యంగా మే 17న ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు పోలింగ్ శాతాల మధ్య 12.54 శాతం పెరుగుదల ఉంది. రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఏకంగా 49 లక్షల ఓట్లు అదనంగా పెరిగాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వోట్ ఫర్ డెమొక్రసీ (వీఎఫ్‌డీ) సంస్థ స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా 538 స్థానాల్లో తేడాలు.. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 538 ఎంపీ స్థానాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ తేడాలు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), వీఎఫ్‌డీ సంస్థలు పేర్కొన్నాయి. 362 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించినట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపాయి. 176 లోక్‌సభ స్థానాల్లో 35,093 ఓట్లకుపైగా అదనంగా లెక్కించారని వెల్లడించాయి. పోలైన ఓట్ల ప్రకారం చూస్తే ఏపీలో కూటమికి 14, వైఎస్సార్సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కాలని వీడీఎఫ్ స్పష్టం చేసింది. తమ అధ్యయన నివేదికలను ఎన్నికల సంఘానికి కూడా పంపాయి. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణాలు ఏమిటో వెల్లడించాలని ఏడీఆర్, వీఎఫ్‌డీ సంస్థల ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని అప్పట్లోనే ప్రశ్నించారు. కానీ.. ఎన్నికల సంఘం ఇప్పటికీ దీనిపై స్పందించకపోవడం గమనార్హం. -
అసెంబ్లీ ఓటర్ల జాబితానే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను యథావిధిగా పరిగణనలోకి తీసుకొని వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ముసా యిదా ఓటరులిస్టు తయారు చేయాలని అధికారు లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదే శించారు. ముసాయిదా జాబితాలను వచ్చేనెల 6న గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని సూచించా రు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్ని కల నిర్వహణకు వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణ పురో గతిపై గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ ఈసీ) కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్థసారథి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా) అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), డీపీవో, డీఎల్పీవోలు, అసెంబ్లీ నియో జకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ముసాయిదా ఓటర్ల జాబి తాల ప్రచురణ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకోవాల న్నారు. ఈ ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు జరిగితే వచ్చేనెల 13వ తేదీ వరకు సంబంధిత ఎంపీడీవోలు, డీపీవోలకు రాత పూర్వకంగా తెలియజేయాలని చెప్పారు. సవరించిన తుది ఓటర్ల జాబితాను వచ్చేనెల 21న ప్రచు రించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లు జీపీ ఓటర్ల జాబితాలో చేర్చు కోవాలన్నా, ఎవరైనా ఓటరును జీపీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలున్నా, వారు నిర్దేశించిన ఫారాలలో సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజి స్ట్రేషన్ అధికారికి దరఖాస్తు చేసుకో వాలన్నారు. ఓటరు జాబితా తయారీ తర్వాత, వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితరాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ఎస్ఈసీ తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్‌ను పార్థసారథి ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పీఆర్ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, పీఆర్ ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో, హరియాణాలో ఒక దశలో పోలింగ్.. అక్టోబర్ 4న ఫలితాలు. ఇంకా ఇతర అప్డేట్స్
-
Election Commission of India: మోగింది ఎన్నికల భేరీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆర్టీకల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం తొలిసారిగా ఎన్నికల సందడి ప్రారంభం కాబోతోంది. జమ్మూకశ్మీర్‌తోపాటు హరియాణా శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు దశల్లో, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి ఒక దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో సెపె్టంబర్ 18, సెపె్టంబర్ 25, అక్టోబర్ 1న, హరియాణాలో అక్టోబర్ 1న ఎన్నికలు జరుగుతాయని, రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలియజేశారు. జమ్మూకశ్మీర్‌లో మొదటి దశలో 24 సీట్లకు, రెండో దశలో 26 సీట్లకు, మూడో దశలో 40 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చివరిసారిగా 2014 నవంబర్–డిసెంబర్లో ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను సాధారణంగా ఐదు దశల్లో నిర్వహిస్తుంటారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. దీనిపై విమర్శలు వచ్చాయి. అందుకే జమ్మూకశ్మీర్‌లో తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకుంటున్నామని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈసారి కేవలం మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయబోతున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాల వల్లే.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసినట్లు వివరించారు. 2019లో హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒకే సమయంలో జరిగాయి. ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ శాసనసభ ఎన్నికలు సైతం జరగాల్సి ఉందని, వీటిలో రెండు రాష్ట్రాలకు కలిపి ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, హరియాణాలో పోలింగ్ పూర్తయిన తర్వాత మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. మీడియా సమావేశంలో రాజీవ్ కుమార్‌తోపాటు ఎన్నికల సంఘం కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెపె్టంబర్ 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.ముగ్గురు జెంటిల్మెన్ మళ్లీ వచ్చేశారు ముగ్గురు పెద్దమనుషులు(జెంటిల్మెన్) మళ్లీ వచ్చేశారని మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ చమత్కరించారు. తన సహచర కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధూను విలేకరులకు పరిచయం చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ‘లాపతా జెంటిల్మెన్’ అంటూ ట్రోలింగ్ నడిచింది. ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కనిపించకుండాపోయారని, లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, రాజకీయ నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. జూన్ 3న విలేకరుల సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ... లాపతా జెంటిల్‌మన్లు త్వరలో తిరిగివస్తారని చెప్పారు. తాము ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. -
‘సుప్రీం’ తీర్పులకు ఈసీ వక్రభాష్యం
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)ల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు, సందేహాలు పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ ఎన్నికల సంఘం రూపొందించిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ–ఎస్వోపీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం తీరుపై ప్రజల్లో, పోటీ చేసిన అభ్యర్థుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనకు అవకాశం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు ఎన్నికల సంఘం తిలోదకాలిచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులిపేసుకునే దిశగా ఎన్నికల సంఘం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ బయట పడే అవకాశమే లేదన్నది నిపుణుల మాట. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి పరిశీలిస్తే కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ వెలుగుచూసే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. మాక్ పోలింగ్ కేవలం ఆయా మిషన్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని మాత్రమే రూఢీ చేస్తుందని, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయదని స్పష్టంగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఇదీ... ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఈవీఎంల ట్యాంపరింగ్, మార్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలైన ఓట్లను వీవీ ప్యాట్ల స్లిప్పులతో సరిపోల్చి చూడాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లపరంగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు రాతపూర్వకంగా కోరవచ్చు. అలాంటప్పుడు ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 శాతం ఈవీఎంలను, వీవీ ప్యాట్ల స్లిప్పులను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లు తనిఖీ చేసి పరిశీలన చేసి తీరాలి. పోలింగ్ స్టేషన్లను లేదా సీరియల్ నంబర్లను అభ్యర్థులే ఎంపిక చేసుకోవచ్చు. ఈవీఎంల పరిశీలన కోరిన అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన సమయంలో ఉండొచ్చు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వారం లోపు అభ్యర్థులు ఈవీఎంల పరిశీలన కోరవచ్చు. ఇంజనీర్లతో సంప్రదించిన తరువాత ఈవీఎంల తాలూకు మైక్రో కంట్రోలర్ల ప్రామాణికతను ఎన్నికల అధికారి ధృవీకరించాలి. ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని తేలితే పరిశీలన నిమిత్తం ఆ అభ్యర్థి చెల్లించిన మొత్తాన్ని వాపసు చేయాలి. ఎన్నికల సంఘం చేస్తున్నది ఇదీ... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు, ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లకు పొంతనే లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికులకు అసాధారణ మెజారిటీలు వచ్చాయి. ఇవన్నీ ఈవీఎంల పనితీరుపై సందేహాలు, అనుమానాలు రేకెత్తించాయి. దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలనకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఫీజు సైతం చెల్లించారు. అయితే ఇటీవల ఎన్నికల అధికారులు ఈ ఫీజును వాపసు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఒత్తిళ్లకు వారు లొంగలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడుతుందన్న ఆందోళనతోనే ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తనిఖీ, పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్‌ను తెరపైకి తెచ్చారు. ఏమిటీ మాక్ పోలింగ్..? మాక్ పోలింగ్ అనేది ఎన్నికల సంఘం రొటీన్‌గా నిర్వహించే ఓ ప్రక్రియ. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, సింబల్ లోడింగ్ యూనిట్లు తదితరాలను తనిఖీ చేస్తారు. ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు, పరిశీలనలు ఉంటాయి. పోలింగ్ రోజు ఎలాగైతే ఆయా మిషన్లను ఓటింగ్ కోసం ఉపయోగిస్తారో అదే రీతిలో మాక్ పోలింగ్ సందర్భంగా వాటిని వినియోగిస్తారు. ఒక్కో బటను నొక్కి సక్రమంగా పనిచేస్తుందా? లేదా? అనేది పరిశీలిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్‌ను నొక్కి పని తీరును పరిశీలిస్తారు. అలాగే వీవీ ప్యాట్ల స్లిప్పులు సక్రమంగా వస్తున్నాయా? లేదా? చూస్తారు. అన్ని యూనిట్లు సక్రమంగా కనెక్ట్ అయ్యాయా? లేదా? అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారు. అన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయా? లేదా? అనేది తనిఖీ చేస్తారు. ఎన్నికల సంఘం తీరుపై బాలినేని న్యాయ పోరాటం.. తన నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఓటింగ్ యంత్రాల పరిశీలన, తనిఖీ కోసం దరఖాస్తు చేసుకున్న ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మాక్ పోలింగ్ ఆదేశాలపై న్యాయ పోరాటానికి దిగారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు ఆయన న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ నెల 16న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోర్టును కోరినట్లు చెప్పారు. మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలనను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని అభ్యరి్థంచామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని, అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరామన్నారు. -
సెప్టెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు జరుగనున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దీపేందర్ హుడా వంటి సిట్టింగ్ సభ్యులు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కె.కేశవరావు కాంగ్రెస్‌లోకి మారడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక సీటు, ఒడిశాలో మమతా మొహంతా రాజీనామాతో మరో సీటు ఖాళీ అయింది. ఈ 12 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీగా ఈసీ ప్రకటించింది. 22న నామినేషన్ పత్రాల పరిశీలన, 26న అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, 27న బిహార్, రాజస్తాన్, తెలంగాణ, ఒడిశాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువిచి్చంది. సెపె్టంబర్ 3వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేస్తారని తెలిపింది. -
మళ్లీ ‘టీఆర్ఎస్’! బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పార్టీ పేరును తిరిగి ‘టీఆర్ ఎస్’గా మార్చేందుకు అనురించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీపరంగా అధ్యయనం జరుగుతోంది. పార్టీ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలు వెల్లడిస్తున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తిరిగి టీఆర్ఎస్గా పేరును మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ నుంచి పలు వివరణలు కోరే అవకాశమున్నందున, అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవడంపై దృష్టి సారించింది. ‘టీఆర్ఎస్’పై ఆరేళ్లు ఫ్రీజ్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పుకు బీఆర్ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై పార్టీ చేసే విన్నపాన్ని ఆమోదించే విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ నియమావళిని లోతుగా అధ్యయనం చేసి పార్టీ పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’.. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల అనంతరం పార్టీ పేరును మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ పేరు మార్పునకు ఆమోదముద్ర పడింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరిట పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పోస్ట్‌మార్టమ్‌లో పార్టీ పేరు మార్చడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు నొక్కి చెప్పాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్లా ఓటమి పాలవడంతో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని అధినేత కేసీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన భేటీల్లోనూ పార్టీ నేతలు ఇదే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ పేరు మార్పుతో ‘తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే భావన’ప్రజల్లో నెలకొందని కొందరు అధినేతకు వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. -
వలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పూర్తిస్థాయిలో అమలు చేస్తుందా లేక మార్పులు చేస్తుందా అన్నదానిపై సోమవారం కొంత స్పష్టత వస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వలంటీర్ల వ్యవస్థపై చర్చించే అవకాశం ఉందని, ఈ వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నాయి.చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. గత ఐదేళ్లలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ కూలంకషంగా వివరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు వివిధ రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీలు) సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే సోమవారం సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆ శాఖ అధికారులతో వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.65 లక్షలమంది వలంటీర్లతో 2019 ఆగస్టు 15న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 2019 ఆక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఏకంగా 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసి అప్పటికప్పుడే భర్తీ చేసింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గౌరవ వేతనంతో పనిచేసే 2.65 లక్షల మంది వలంటీర్లపై మొన్నటి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు లక్షన్నరమంది వలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
ఏపీలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యే కోటాలో ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతో పాటు కర్ణాటక, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని ఒక్కో స్థానానికి మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో మూడు స్థానాలకు ఎమ్మెల్సీల రాజీనామా కారణంగా, రెండు స్థానాలకు అనర్హత వేటు కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఏపీలో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడగా, షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. -
ఈవీఎంల గుట్టు విప్పేదెవరు?
సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై ముసురుకుంటున్న అనుమానాలతో ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం సాయంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెక్ దిగ్గజం, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని చాట్ జీపీటీ నిపుణుడైన ఆయన గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు వెలుగులోకి రావడం ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు, పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా తమ ఓట్లన్నీ ఏమయ్యాయంటూ గ్రామాలకు గ్రామాలే నిలదీస్తుండటం గమనార్హం. గెలుపొందిన అభ్యర్థులు సైతం ఊహించని స్థాయిలో మెజారిటీలు రావటంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నా... తాము వేసిన ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తున్నా.. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని యావత్ దేశం నిలదీస్తున్నా... ఇవిగో ఈవీఎం మోసాలంటూ ఆధారాలు చూపిస్తున్నా... కేంద్ర ఎన్నికల సంఘం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకు చావండి’ అనే రీతిలో ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు సంబంధం లేదనే రీతిలో బాధ్యతల నుంచి ఈసీ పలాయనం చిత్తగించడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన అనంతరం అందులో లొసుగులు గుర్తించడంతో వాటిని నిషేధించిన దేశాల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానాన్నే అనుసరిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని సాధారణ ఓటర్లతోపాటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా పరీక్షిస్తే కానీ ఈ రహస్యం వీడదని టెక్ నిపుణులు వాŠయ్‌ఖ్యానిస్తున్నారు. చిప్‌లోనే చిదంబర రహస్యం..! ఈవీఎంలలో ఉపయోగిస్తున్న చిప్‌లపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిజ్ఞానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సూటిగా సమాధానం చెప్పకపోవడం సందేహాలకు బలం చేకూరుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు సవాళ్లు విసురుతున్నా ఈసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈసీ చేసిన ప్రకటన మరిన్ని సందేహాలకు తావిచ్చింది. ఈవీఎంలలలో బ్లూటూత్ టెక్నాలజీ లాంటిది ఉండదు కాబట్టి హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఈసీ ఇటీవల వరకు వాదిస్తూ వచ్చింది. అయితే ఈవీఎంలలో ప్రోగ్రామబుల్ చిప్‌లు ఉపయోగిస్తున్నామని, ఫ్లాష్ మెమరీ వాడకం కూడా ఉంటుందని ఈసీ ఇటీవల తొలిసారిగా అంగీకరించింది. ప్రోగ్రామబుల్ చిప్‌లు, ఫ్లాష్ మెమరీని హ్యాక్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈవీఎంలు భద్రమేనా? అంటే ఈసీ సూటిగా సమాధానం చెప్పడం లేదు. భద్రతా సందేహాస్పదమే ఈవీఎంల భద్రత, నిర్వహణపైనా నీలి నీడలు అలుముకుంటున్నాయి. నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలకు ఈసీ సూటిగా సమాధానాలు చెప్పడం లేదు. ఈవీఎంల నిర్వహణ విషయంలో ఎన్నో భద్రత లోపాలు, ఇతర లొసుగులు ఉన్నట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. 2017 డిసెంబరు నాటికే ఈవీఎంల చోరీ, ధ్వంసం ఉదంతాలు దాదాపు 70 వరకూ చోటు చేసుకున్నట్లు ‘ద వైర్’ ప్రచురించిన కథనం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈవీఎంలను తయారు చేసే ఎల్రక్టానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటన ప్రకారం.. ఈసీఐ కోరిన దాని కంటే 1,97,368 ఈవీఎంలు, 3,55,747 కంట్రోల్ యూనిట్లు ఎక్కువగా తయారయ్యాయి. 2024 ఎన్నికల సందర్భంగా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఈవీఎంలు ప్రైవేట్ వ్యక్తుల వద్ద లభించాయి. ఇక చోరీకి గురైన ఈవీఎంలపై ఈసీ స్పందన విడ్డూరంగా ఉంది. ప్రతి ఈవీఎంకు ప్రత్యేకమైన ఐడీ ఉంటుందని, యంత్రం చోరీకి గురైనా, కనిపించకుండా పోయినా ఆ ఐడీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని పేర్కొంది. తద్వారా ఆ ఈవీఎంలలో నమోదైన ఓట్లు పోలైన ఓట్లలో కలవకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. మరి చోరీకి గురైన యంత్రాల్లో పరికరాలను మార్చినా, ఓటింగ్ నమోదు చేసేందుకు వాడిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ఇతర ఈవీఎంలతో కలిపేస్తే ఏమవుతుంది? అనే ప్రశ్నలకు ఈసీ మౌనం దాల్చడం గమనార్హం. ఈవీఎంలను భద్రపరుస్తున్న ప్రదేశాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉంటే వాటి ఫుటేజీని అందరికీ ఎందుకు అందుబాటులోకి ఉంచడం లేదు? అందులో ఇబ్బంది ఏమిటి? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంల భద్రత వ్యవస్థ ఎంతవరకు పటిష్టం? అనే సందేహాలున్నాయి. స్ట్రాంగ్ రూమ్‌ల సీసీ కెమెరాల ఫుటేజీలను అన్ని పార్టీలకూ అందుబాటులో ఉంచితే పారదర్శకంగా ఉంటుంది. ఈ డిమాండ్‌పై ఈసీ కనీసం స్పందించలేదు. ఒకవైపు ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని నిపుణులు బల్లగుద్ది చెబుతుండగా సందేహాలను నివృత్తి చేయాల్సిన ఈసీ దాగుడుమూతలు ఆడటం అనుమానాలను బలపరుస్తోంది. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? దేశంలో ఏకంగా 20 లక్షల ఈవీఎంలు కనిపించకపోడం మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకోగా వాటిలో 40 లక్షల ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియకు కేటాయించినట్టు ఈసీ వెల్లడించింది. మరి మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయనే ప్రశ్నకు ఇటు ఈసీగానీ అటు కేంద్ర ప్రభుత్వంగానీ జవాబు చెప్పడం లేదు. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గట్టిగా డిమాండ్ చేశారు. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈవీఎంలను మార్చి అక్రమాలకు పాల్పడినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా విభ్రాంతి వ్యక్తమవుతోంది. వైఎస్సార్ సీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు తమకు అత్యంత బలమైన స్థానాల్లో కూడా ఓడిపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీకి ఏమాత్రం బలం లేని నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీల అభ్యర్థులకు అనూహ్య మెజార్టీలు వచ్చాయి. ఇక ఒడిశాలో బీజేపీ ఉనికి అంతంత మాత్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పడ్డ పాట్లన్నీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో.. కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి వాహనంలో ఈవీఎంలు తరలిస్తున్న విషయం ఎన్నికల ముందే బయటపడింది. పిఠాపురం నియోజకవర్గంలో ఈవీఎంలను బస్సులో తరలించారు. ఓ ప్రైవేట్ వాహనంలో సైతం ఈవీఎంలు తరలించినట్లు బయటపడ్డా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే రీతిలో ఈవీఎంలను ప్రైవేట్ వ్యక్తుల పర్యవేక్షణలో తరలించినట్లు తెలుస్తోంది. అవన్నీ కనిపించకుండాపోయిన 20 లక్షల ఈవీఎంలలోనివేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యమైన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయో వెల్లడించాలని వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షల ఈవీఎంతోనే ఎన్నికలు నిర్వహించామని, మిగిలిన 20 లక్షల ఈవీఎంల సంగతి తమకు తెలియదంటూ ఈసీ దాటవేత వైఖరి అనుసరిస్తోంది. ఈసీ, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవీఎంలను నిషేధించాలి: ప్యూర్టోరికోలో ఎన్నికల అక్రమాలపై ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలను నిషేధించాలి. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణ సరికాదు. వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. ఈ భూమ్మీద హ్యాక్ చేయలేనిది ఏదీ లేదు. సంబంధిత వార్త: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు! ఎలాగంటే..ఈవీఎంలు బ్లాక్ బాక్స్‌లు: ఎక్స్‌లో రాహుల్‌గాందీఈవీఎంలు బ్లాక్ బాక్సులు లాంటివి. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వరు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం తీవ్ర ఆందోళనకరం. నిషేధిస్తూ విధాన నిర్ణయాలుప్రపంచంలో మెజార్టీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, వెనిజులా తదితర దేశాల్లో మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొబైల్‌తో ఈవీఎం హ్యాకింగ్‌ఈవీఎంలు ఎంత లోపభూయిష్టమో... వాటిని ఎంత సులువుగా హ్యాక్ చేయవచ్చో బహిర్గతమైంది. ముంబై నుంచి వెలువడే ప్రముఖ దినపత్రిక ‘మిడ్ డే’ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి ఎంపీగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించిన శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ సమీప బంధువు మంగేశ్ పండిల్కర్ తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 4న ముంబైలోని నెస్కో సెంటర్లో నిర్వహించారు. ఎంపీ బంధువు మంగేశ్ పండిల్కర్ ఈ సందర్భంగా తన మొబైల్ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేశారు. ఓటీపీ జనరేట్ చేయడం ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేయడం గమనార్హం. మొదట్లో శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) అభ్యర్థి అమోల్ సంజన కీర్తికర్ కంటే వెనుకబడిన రవీంద్ర వైకర్ అనూహ్యంగా కేవలం 48 ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకువెళ్లడం, అదే ఫోన్ ద్వారా శివసేన (ఏక్నాథ్ షిండే) అభ్యర్థి పలువురితో మంతనాలు జరపడంపై ముంబై పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేశారు. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. అయితే మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేశారన్న మిడ్ డే పత్రిక కథనాన్ని ఎన్నికల కమిషన్ ఖండించింది. -
ఈవీఎం గోల్ మాల్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విషయంలో అనుమానాలు
-
ఈవీఎంలలో గోల్మాల్?!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైనా ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న వివాదాలకు మాత్రం తెర పడటం లేదు. పైగా మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతపైనే నానాటికీ మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థాన్లాలో పోలైన, లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్యలో తేడా నమోదైనట్టు ‘ద వైర్’ వార్తా సంస్థ పేర్కొంది! కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలనే ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది.మొత్తం 543 లోక్‌సభ స్థానాల డేటాను పరిశీలిస్తే డామన్–డయ్యు, లక్షద్విప్, అట్టింగల్ వంటి కొన్నింటిని మినహాయిస్తే అత్యధిక స్థానాల్లో నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య అంతిమంగా లెక్కించిన ఈవీఎం ఓట్లతో సరిపోలడం లేదని వెల్లడించింది. ఏకంగా 140 పై చిలుకు స్థానాల్లో పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొనడం విశేషం! ఇలా 2 నుంచి 3,811 ఓట్ల దాకా అదనంగా లెక్కించినట్టు వెల్లడించింది. ‘‘పలు లోక్‌సభ స్థానాల్లోనేమో లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య మొత్తం ఈవీఎం ఓట్ల కంటే తక్కువగా ఉంది.ఒక లోక్‌సభ స్థానంలో ఏకంగా 16,791 ఓట్లు తక్కువగా లెక్కించారు! ఇలా తగ్గడానికి దారితీసిన కారణాలపై ఈసీ ఇచ్చిన ఇచ్చిన వివరణ పొంతన లేకుండా ఉంది. ఎక్కువ ఓట్లను లెక్కించడం ఎలా సాధ్యమన్న ప్రశ్నపై మాత్రం ఈసీ పూర్తిగా మౌనం దాల్చింది. ఈ మొత్తం ఉదంతంపై వివరణ కోరుతూ ఈసీకి ఈ మెయిల్ పంపితే ఇప్పటిదాకా స్పందన రాలేదు’’ అని తెలిపింది. కథనంలో ద వైర్ ఏం చెప్పిందంటే... ఫలితాల వెల్లడిలో లోక్‌సభ స్థానాలవారీగా లెక్కించిన ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యను ఈసీ విడిగానే పేర్కొంది. అంతేగాక ఈసారి పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్యను కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ సంఖ్యలో ఇక మార్పుచేర్పులకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లతో వీటికి సంబంధం లేదని కూడా చెప్పింది. అలా పలు లోక్‌సభ స్థానాల్లో ఈసీ వెల్లడించిన మొత్తం ఈవీఎం ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా చర్చకు తెర లేచింది.దాంతో అది అసహజమేమీ కాదంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరణ ఇచ్చారు. ‘‘కొన్నిచోట్ల అలా జరుగుతుంటుంది. ఒక్కోసారి ప్రిసైడింగ్ అధికారి పొరపాటున కంట్రోల్ యూనిట్/వీవీప్యాట్ యూనిట్ నుంచి మాక్ పోలింగ్ స్లిప్పులను తొలగించకుండానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఫామ్ 17–సీలో ఓట్ల సంఖ్యను తప్పుగా నమోదు చేస్తారు. దాంతో అవి కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యతో సరిపోలవు. ఈ రెండు సందర్భాల్లోనూ సదరు పోలింగ్ స్టేషన్లలో నమోదయ్యే ఓట్లను చివరిదాకా లెక్కించరు.అలాంటి మొత్తం ఓట్ల సంఖ్య విజేతకు లభించిన మెజారిటీ కంటే తక్కువగా ఉంటే ఇక వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు పోలైన ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన వాటి సంఖ్య తక్కువగానే ఉంటుంది’’ అని పేర్కొన్నారు. నమోదైన ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు లెక్కించడంపై మాత్రం ఈసీ నుంచి స్పందన లేదు. ఒక లోక్‌సభ స్థానంలో విజేతకు కేవలం 48 ఓట్ల మెజారిటీ వచి్చంది. అక్కడ పోలైన ఈవీఎం ఓట్ల కంటే రెండు ఈవీఎం ఓట్లను అదనంగా లెక్కించారు! విజేతకు 1,615 ఓట్ల మెజారిటీ వచ్చిన మరో స్థానంలో 852; 1,884 ఓట్ల మెజారిటీ వచ్చి న ఇంకో చోట 950 ఓట్లు అదనంగా లెక్కించారు.ఇవీ సందేహాలు.. ⇒ నమోదైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఎలా సాధ్యం? ⇒ లెక్కించిన ఈవీఎం ఓట్ల సంఖ్య పోలైన వాటికంటే తగ్గడానికి మాక్ పోలింగ్ డాటాను తొలగించకపోవడమే కారణమన్న నిర్ధారణకు ప్రాతిపదిక ఏమిటి? ⇒ ఇలా ఈవీఎం ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ/తక్కువగా నమోదైన లోక్‌సభ స్థానాలవారీగా ఈసీ స్పష్టమైన వివరణ ఎందుకివ్వడం లేదు? ⇒ ఈ ఎన్నికల్లో మొత్తమ్మీద ఎన్ని ఈవీఎంలను, ఏ కారణాలతో పక్కన పెట్టారో ఈసీ వెల్లడించగలదా?వివరణ ఇవ్వాల్సిందే ప్రశాంత్ భూషణ్ఓట్ల లెక్కింపులో గోల్‌మాల్‌కు సంబంధించి ‘ద వైర్’ కథనంపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ‘‘దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్‌సభ స్థానాల్లో పోలైన మొత్తం ఈవీఎం ఓట్ల కంటే ఎక్కువ ఈవీఎం ఓట్లను లెక్కించారు! అసలేం జరుగుతోంది?’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘ద వైర్’ కథనాన్ని ట్యాగ్ చేశారు. ‘‘అహంకారంతో ప్రవర్తిస్తున్న ఈసీఐ ఈ విషయంలో దేశ ప్రజలకు కచి్చతంగా వివరణ ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై ఈసీ స్పందించాలి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్‌చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు. -
ECI: పోలింగ్ 65.79 శాతం
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 65.79 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్లను ఇంకా ఇందులో కలపని కారణంగా తుది పోలింగ్ శాతంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించడం తెల్సిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 67.40 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికలనాటికి దేశవ్యాప్తంగా 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆనాడు వారిలో 61.50 కోట్ల మంది మాత్రమే ఓటేశారు. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరగడం విశేషం. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విడివిడిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, మొత్తంగా ఓటింగ్ శాతాల సమగ్ర వివరాలు తమకు అందాక అందరికీ అందుబాటులోకి తెస్తామని ఈసీ గురువారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. -
Election Commission of India: నేడే అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు
ఈటానగర్/గ్యాంగ్‌టక్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆదివారం ఉదయం ఆరు గంటల కల్లా ఓట్ల లెక్కింపు మొదలయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. మిగిలిన 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈవీఎంలలో నిక్షిప్తమైన 133 మంది అభ్యర్థుల భవితవ్యం నేటితో తేలనుంది. తక్కువ స్థానాలు కావడంతో ఆదివారం మధ్యాహ్నంకల్లా తుది ఫలితాలు వెల్లడికానున్నాయని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) పవన్‌కుమార్ సైన్ శనివారం చెప్పారు. సిక్కింలోనూ.. సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మరోసారి అధికారం చేపట్టాలని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) ఉవ్విళ్లూరుతుండగా ఎలాగైనా విజయం సాధించాలని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్), బీజేపీ, కాంగ్రెస్, సిటిజెన్ యాక్షన్ పారీ్ట–సిక్కిం ఆశపడుతున్నాయి. ఈసారి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 146 మంది అభ్యర్థులు ఈసారి పోటీపడ్డారు. -
Lok Sabha Election 2024: ఏడో విడతలో 62 శాతం పోలింగ్
న్యూఢిల్లీ/కోల్‌కతా/దుమ్కా: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య పండగగా పేరొందిన భారత సార్వత్రిక ఎన్నికల పర్వం శనివారంతో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ పోలింగ్ శనివారం పూర్తయింది. శనివారం రాత్రి 11.50 గంటలకు అందిన సమాచారం మేరకు 62 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూ లైన్లలో నిల్చున్న వారిని ఓటింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఏడో దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం సహా ఏడు రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మూడోసారి అధికారం చేపట్టాలని ఉవి్వళూరుతున్న ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలోనూ శనివారం పోలింగ్ నిర్వహించారు. పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 73.47 శాతం పోలింగ్ నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ ప్రాంతంలోని మిత్ర ఇన్స్టిట్యూట్ స్కూల్ బూత్‌లో ఓటేశారు. బేరామరీలో బాహాబాహీ పశి్చమబెంగాల్లో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. బసీర్హాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని సందేశ్‌ఖాలీ పరిధిలోని బేరామరీలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. భాంగర్‌లో టీఎంసీ, ఐఎస్ఎఫ్ మద్దతుదారులు ఒకరిపై ఒకరు నాటుబాంబులతో దాడిచేసుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. తర్వాత కొన్ని నాటుబాంబులను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ నుంచి మధ్యాహ్నం రెండుగంటల్లోపు 1,900 ఫిర్యాదులు వచ్చాయని ఈసీ తెలిపింది. ఈవీఎంలు మొరాయించడం, బూత్‌లోకి రాకుండా ఓటర్లు, పోలింగ్ ఏజెంట్లను ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగాయని టీఎంసీ, బీజేపీ తదితర పార్టీలు ఫిర్యాదుచేశాయి. కుటుంబాన్ని మించిన కర్తవ్యం 80 ఏళ్ల తల్లి మరణం ఓవైపు, తప్పక ఓటేయాల్సిన బాధ్యత మరోవైపు ఉన్నా తొలుత ఓటేసి కన్నతల్లికన్నా భరతమాతకు ఎక్కువ గౌరవం ఇచ్చారు ఒక వ్యక్తి. బిహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో దేవ్కులీ గ్రామంలో మిథిలేశ్ యాదవ్ తల్లి శనివారం కన్నుమూశారు. ‘ చనిపోయిన అమ్మ ఎలాగూ తిరిగిరాదు. అంత్యక్రియల్ని కొద్దిసేపు ఆపొచ్చు. కానీ పోలింగ్‌ను ఆపలేం. ఎన్నికలు మళ్లీ ఐదేళ్లదాకా రావు. అందుకే ఓటేశాక అంతిమయాత్ర చేపట్టాలని మా కుటుంబం మొత్తం నిర్ణయించుకున్నాం’ అని మిథిలేశ్ చెప్పారు. ఓటేశాక వెంటనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. -
ఇది ఈసీ వివక్షే
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయం వెలువరిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరుతూ పిటిషనర్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు రిజిస్ట్రీని కోరారు. దీంతో రిజిస్ట్రీ ఈ కేసు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచింది. దానిని పరిశీలించిన ఆయన హౌస్ మోషన్ రూపంలో అత్యవసర విచారణకు అనుమతి మంజూరు చేశారు. దీంతో జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ విజయ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.దేశ వ్యాప్తంగా కాకుండా ఏపీలో మాత్రమే అమలు చేస్తారా?వైఎస్సార్సీపీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, హైకోర్టు సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. పేరు, హోదా వివరాలు, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు వివక్షాపూరితమని సింఘ్వీ తెలిపారు. ఈ ఉత్తర్వులు చాలా కొత్తగా ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులను దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు దేశం మొత్తానికి వర్తిస్తాయని, కానీ విస్మయకరంగా తాజా ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే వర్తింప చేస్తోందని వివరించారు. ఇంత కన్నా అన్యాయం ఏమీ ఉండదన్నారు. తాజా ఉత్తర్వులు ఎన్నికల కమిషన్ స్వీయ నిబంధనలకు విరుద్ధమన్నారు. లేఖలు, సర్కులర్లు, మెమోల ద్వారా చట్టబద్ధ నిబంధనలను మార్చలేరన్నారు. అది పార్లమెంట్ పని అని తెలిపారు. పార్లమెంట్లో ఎలాంటి సవరణ చేయకుండా తాజా ఉత్తర్వులు తీసుకురావడానికి వీల్లేదని, అందువల్ల అవి ఎంత మాత్రం చెల్లుబాటు కావని ఆయన స్పష్టం చేశారు.కౌంటింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎందుకిలా?రాష్ట్రంలో 5.39 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఇవి సరిపోతాయని సింఘ్వీ అన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో రూల్స్ 27ఎఫ్, 54ఏ, 13 ఏ లకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు అమల్లోకి తెచ్చిందన్నారు. అటెస్టేటింగ్ అధికారి పేరు, హోదా వివరాలు లేకుండా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఎవరో ధృవీకరించారో తెలియదని, దీని వల్ల అక్రమాలకు ఆస్కారం ఉంటుందన్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై ఎవరైనా సంతకం చేయవచ్చన్నారు. తప్పుడు, నకిలీ ఓట్లను కూడా ఆమోదించేందుకు తాజా ఉత్తర్వులు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. ఎప్పుడో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే, ఇప్పుడు కౌంటింగ్‌కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఈ తాజా ఉత్తర్వుల వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ తీరు సందేహాస్పదంగా ఉందని తెలిపారు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఇలాంటి ఉత్తర్వుల ద్వారా నిష్పాక్షికతకు అర్థం లేకుండా చేస్తోందన్నారు. ఏకపక్షంగా జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరం ఉంటేనే ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదని, అందువల్ల తమ వ్యాజ్యానికి విచారణార్హత ఉందని వివరించారు.పరిధి దాటి వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘంసీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘామే చెబుతోందని, అలాంటిది 5.39 లక్షల ఓట్ల విషయంలో మాత్రం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో తమ ఆందోళనను గానీ, తామిచ్చిన వినతి పత్రాన్ని గానీ ఎన్నికల సంఘం కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హడావుడిగా తాజా ఉత్తర్వులిచ్చిందన్నారు. అతి కొద్ది రోజుల్లో కౌంటింగ్ జరగబోతుండగా, ఇప్పటికిప్పుడు ఈ ఉత్తర్వులను తీసుకు రావాల్సిన అవసరం ఏముందో ఎన్నికల సంఘం చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంఘం చర్యల్లో నిజాయితీ ఉండి ఉంటే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చి ఉండేదని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివాదంపై ఎన్నికల పిటిషన్లు వేయాలంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని, ఇది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా తన పరిధి దాటి వ్యవహరించిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, బ్యాలెట్ ఫాంపై పేరు, హోదా వివరాలు, సీలు లేకుంటే ఆ ఓటును తిరస్కరించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగుతున్నప్పుడు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని వీరారెడ్డి తెలిపారు.తాజా ఉత్తర్వులు ఆ ఉద్యోగులకే వర్తింపుకేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకే తమ తాజా ఉత్తర్వులు వర్తిస్తాయన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద అటెస్టేటింగ్ అధికారిని సంబంధిత రిటర్నింగ్ అధికారే నియమిస్తారని.. అందువల్ల డిక్లరేషన్ ఫాంపై ఆ అధికారి సంతకం ఉంటే చాలని చెప్పారు. పేరు, హోదా వివరాలు, సీలు ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను మొత్తం నిబంధనలకు అనుగుణంగా వీడియోగ్రఫీ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో పిటిషనర్ అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను సవాలు చేయడానికి వీల్లేదని, ఒకవేళ పిటిషన్లు దాఖలు చేసినా అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెలిపారు. పిటిషనర్ పరోక్షంగా ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని, అందువల్ల వారు ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాల వ్యవహారంలో ఈపీ దాఖలు చేసుకోవాలన్న వాదన సరైందేనని, అయితే పిటిషనర్ తన వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలు పూర్తిగా వేరని వ్యాఖ్యానించింది. ఇదేమీ వ్యక్తిగత కేసు కాదని స్పష్టం చేసింది. అనంతరం వైఎస్సార్సీపీ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల నిర్వహణ నిబంధనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు సబబేనన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్ణయాన్ని వెలువరిస్తామంది. -
సీఈవో గుప్పెట్లో చట్టం
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశి్నంచారు.13 ఏ, 13 బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని, దానికి గెజిటెడ్ ఆఫీసర్ సరి్టఫికెట్ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచి్చందని ప్రశి్నంచారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. -
కుట్రపూరితం! పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్‌తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. దాన్ని ఎండార్స్ చేయడంతో పాటు మరికొంత సడలింపు ఇస్తూ గెజిటెడ్ అధికారి హోదా వివరాలు, సీల్ లేకపోయినా.. కేవలం సంతకం ఉంటే చాలు ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు లేఖ రాయడం వెంట వెంటనే జరిగిపోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో ఉపసంహరించుకోవడం అంటే.. ఆ ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా అంగీకరించినట్లే. ఈ కేసులో టీడీపీ ఇంప్లీడ్ పిటీషన్ వేయడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారాన్ని మరింత గందరగోళ పరచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.సంతకంలో వ్యత్యాసాలుంటే..టీడీపీ వినతికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసి దొంగ ఓట్ల బెడదను సృష్టించిన సీఈవో ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం తందానా అనడం అనుమానాలకు తావిస్తోందని ప్రజాస్వామ్యవాదుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారం లెక్కింపు సమయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని మాజీ ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేవలం సంతకంతో అతను అటెస్టేషన్ అధికారే అని నిర్ధారించడం ఎలా సాధ్యమవుతుందని వీరు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం దొంగ ఓట్లను ప్రోత్సహించే విధంగా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి సలహాదారునిగా వ్యవహరించిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వివరాలు లేకుండా కేవలం సంతకంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఎలా ఆమోదం తెలుపుతారని, అధికారుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉండటం అత్యంత సహజమని వివరించారు. ఈ నేపథ్యంలో స్పెసిమెన్ సంతకంతో సరిపోల్చి చూడటం ఎలా సాధ్యమని రిటైర్డ్ ఆర్డీవో ఒకరు ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంతకాలు అన్నీ కౌంటింగ్ సెంటర్లలోని ఆర్వోలకు పంపిస్తామని, సంతకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వాటితో సరిపోల్చి చూసుకొని నిర్ణయం తీసుకోవాలనడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఇన్ని స్పెసిమెన్ అధికారుల సంతకాలతో వాటిని ఆ సమయంలో సరిపోల్చి చూడటం సాధ్యమయ్యే పనేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఇటువంటి నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలకు మరింత బలంపోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా విజ్ఞాపనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది. ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.