
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఐపీఎస్ అధికారుల సంఘం మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే బదిలీలు జరిగినట్లు సోమవారం ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీసుల నిస్వార్థ సేవలను, ప్రతిష్టను దెబ్బతీసేలా ఎల్లో మీడియా రాసిన కథనాలను తీవ్రంగా ఖండించింది.
పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా తీసుకునే చర్యలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలు తెలుసుకోవచ్చని సూచించింది. పోలీసు అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరైన చర్యకాదని హితవు పలికింది. పదేపదే బాధ్యతారాహిత్య కథనాలు ప్రచురిస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన అవసరాలకు తగ్గట్లుగా ఐపీఎస్ అధికారుల బదిలీ, పోస్టింగులు చేసుకునే అధికారం ఉంటుందని స్పష్టంచేసింది.