నేడు జరిగే తొలి మంత్రివర్గ భేటీలో ఈ వ్యవస్థపై చర్చకు అవకాశం
వ్యవస్థకు సంబంధించి సమగ్ర వివరాలతో పీపీటీలు సిద్ధంచేసిన ఉన్నతాధికారులు
2019 ఆగస్టు 15న జగన్ ప్రభుత్వం ద్వారా అమల్లోకి వచ్చిన వ్యవస్థ
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పూర్తిస్థాయిలో అమలు చేస్తుందా లేక మార్పులు చేస్తుందా అన్నదానిపై సోమవారం కొంత స్పష్టత వస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వలంటీర్ల వ్యవస్థపై చర్చించే అవకాశం ఉందని, ఈ వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నాయి.
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. గత ఐదేళ్లలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ కూలంకషంగా వివరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు వివిధ రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీలు) సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే సోమవారం సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆ శాఖ అధికారులతో వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.65 లక్షలమంది వలంటీర్లతో 2019 ఆగస్టు 15న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 2019 ఆక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఏకంగా 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసి అప్పటికప్పుడే భర్తీ చేసింది.
ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గౌరవ వేతనంతో పనిచేసే 2.65 లక్షల మంది వలంటీర్లపై మొన్నటి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు లక్షన్నరమంది వలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment