‘చంద్రబాబుగారూ.. ఇంతటి బరితెగింపా?’ | YS Jagan Angry on Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’

Published Sat, Jan 4 2025 10:19 AM | Last Updated on Sat, Jan 4 2025 12:14 PM

YS Jagan Angry on Chandrababu Govt

చంద్రబాబుగారూ.. ఇదేనా మీ పాలన?

మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? 

మీ మోసాలు ఒక్కొటిగా బయటకు..  

వరుసగా కేబినెట్‌ మీటింగ్‌లు జరుగుతున్నా.. పథకాల అమలేదీ?

తల్లికి వందనం, రైతు భరోసా ఎక్కడ?

గుంటూరు, సాక్షి: హామీల అమలులో అలసత్వం.. నిర్లక్ష్యం.. ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న  కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు.  తాజాగా తల్లికి వందనం ఎగవేత కూటమి సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్‌ ఖాతాలో ఆయన సుదీర్ఘంగా ఓ సందేశం ఉంచారు. 

‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?.  అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ  ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు.

.. వరుసగా కేబినెట్‌(Cabinet) సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?. చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయి.  

వైఎస్సార్‌సీపీ(YSRCP) హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. 

ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…?

.. ఇక రైతు భరోసా(Rythu Bharosa) తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో,  రూ.34,378కోట్లు మేము పెట్టాం.  కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? 

రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు.

.. ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు.  

చంద్రబాబుగారూ.. రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది’’ అని పేర్కొన్నారాయన. 

చదవండి👉: బలవంతంగా ఏపీ రాజకీయాలను అందులో ఇరికించారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement