‘ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పొతే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పక్కనోడి పనిలో తలదూర్చి, అతన్ని ఇబ్బంది పెట్టి, ఆయన పనిని ఆయన చేయనివ్వకుండా, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా చేస్తే ఫలితాలు తారుమారు అవుతాయి’.. కొరటాల చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. కట్ చేస్తే.. దర్శకుడు శంకర్ కూడా ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
శంకర్ షణ్ముగం.. టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న దర్శకుల్లో ఒకడు. అందులో ఎలాంటి డౌటు అక్కర్లేదు. కానీ, రైటర్ సుజాత(ఎస్.రంగరాజన్) మరణంతో ఆయనకు కుడి భుజం పోయినంత పనైంది. అప్పటిదాకా సెన్సేషన్ బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన.. ఘోరంగా తడబడుతూ వరుస ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. అలాంటి బ్యాడ్ ఫేజ్‌లో విజయ్‌తో సినిమా తప్పింది. ఆపై వెంటనే రాం చరణ్‌తో సినిమా అనౌన్స్ అయ్యింది. గుడ్. శంకర్ సినిమా అంటే కేవలం పాటలకే కోట్లు ఖర్చవుతుంది. మరి అంత భరించే నిర్మాత ఎవరు?. వెంటనే తెరపైకి వెంకట రమణారెడ్డి(దిల్ రాజు) పేరొచ్చింది. వెరీ గుడ్. ఈ మధ్య శంకర్ సినిమాల్లో సుజాత టచ్ లేకపోవడంతో కథలతో పాటు డైలాగుల్లోనూ డెప్త్ లేకుండా పోయింది. అందుకోసం చిరు, బాలయ్య, పీకేలాంటి స్టార్లకు డైలాగులు రాసే సాయి మాధవ్ బుర్రాను తీసుకున్నారు.. వెరీ వెరీ గుడ్. శంకరే స్వయంగా అడిగాడో లేకుంటే శంకర్ మీద నమ్మకం లేకపోవడం వల్లనో మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రాసిన కథతో సినిమా తీసేశారు. ప్చ్.. ఇక్కడ కట్ చేస్తే..
సాధారణంగా తాను ఎంత గ్రాండ్‌గా సినిమా తీసినా రెండు, మూడేళ్లకు మించి టైం తీసుకోడు శంకర్(Director Shankar). అలాంటిది గేమ్ ఛేంజర్ కోసం నాలుగేళ్ల టైం తీసుకున్నారు. 2021 సెప్టెంబర్ టైంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ మొదలైతే.. 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అయితే ఈ గ్యాప్‌లో ఇండియన్-2, ఇండియన్-3లపై కూడా ఆయన పని చేయడం.. అంతకు ముందు 2.0 తర్వాత ఆరేళ్ల గ్యాప్ రావడంతో లెక్క సరిపోయిందనుకుందాం. మరి 2024 సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన గేమ్ ఛేంజర్.. ఎందుకు పోస్ట్‌పోన్ అయినట్లు?. ఎంత పోస్ట్ ప్రొడక్షన్ పనులైనా, ఇతరత్ర కారణాలైనా.. మరీ ఏడాదిపాటు టైం పడుతుందా?. గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడంటూ ఆ మధ్య రేగిన పుకార్లు కొంపదీసి నిజం కాదు కదా?.
.. టీఎఫ్‌ఐ(TFI)లో జరిగే పరిణామాలపై సోషల్‌మీడియాలోనూ, సగటు సినీ అభిమానుల్లోనూ ఓ చర్చ నడుస్తుంటుంది. కథ దగ్గరి నుంచి హీరోయిన్ల ఎంపిక, ఆఖరికి దర్శకత్వంలోనూ కొందరు హీరోలు, పెద్దలు వేలు పెడుతుంటారని!. నిప్పు లేనిదే పొగ రాదు కదా. అయితే గేమ్ ఛేంజర్‌కు అదనంగా ‘రాజకీయ జోక్యం’ తోడైందన్న అనుమానాలు చిత్ర ట్రైలర్ చూశాక కలగకమానదు.
గేమ్ ఛేంజర్(Game Changer) ఓ పొలిటికల్ థ్రిల్లర్ అనే విషయం ట్రైలర్ చూస్తే ఎవరి అర్థమైపోతుంది. అయితే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్లు ఆసక్తికరంగా.. అంతే అతిగా అనిపించాయి కూడా. శంకర్ ఎప్పుడో నాలుగేళ్ల కింద రాసుకున్న కథలో సీన్లు.. ఏపీ రాజకీయాల్లో రియల్‌గా జరిగాయట!. వాటినే తెర మీద ఆడియొన్స్ చూడబోతున్నారట. రాజకీయ పార్టీ స్థాపన, ఈవీఎంల అంశం, పొలిటికల్ నేతల పేర్లు, ఎన్నికల్లో గెలుపు, రేషన్ బియ్యం, అవినీతి మీద పోరాటమంటూ డైలాగులు.. ఇవన్నీ పరిణామాలు ఈ మధ్య ఏడాదికాలంలో చూసినవే కదా!. వీటిల్లో పవన్ రిఫరెన్స్‌లు, పైగా ఏపీ కూటమికి సరిపోయేవే ఉన్నాయి కదా. అలాంటప్పుడు తనది కాని కథలో శంకర్ ఇవన్నీ నాలుగేళ్ల కిందటే ఎలా జొప్పించి ఉంటాడంటారు?. ఇవి ఎవరినో ప్రత్యేకంగా మెప్పించడానికి జొప్పించినట్లు లేదు!.
పోనీ.. దిల్ రాజ్(Dil Raju) అతిశయోక్తికి పోయి ఆ కామెంట్ చేసి ఉంటాడు అనుకున్నా.. రేపు థియేటర్లలో సినిమా చూసే ఆడియొన్స్‌కు అర్థం కాదని అంటారా?. ఏది ఏమైనా తెలంగాణలో ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్న దిల్‌రాజు.. రాజకీయాల కోసం సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దంటూ కోరడం, అదే సమయంలో ఏపీకి వెళ్లి మరీ పవన్‌ను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇక ఎలాగూ ఏపీలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ హాజరుకానున్నారు. ఆ ఈవెంట్‌లో పొలిటికల్‌గా జాకీలు పెట్టి లేపే ప్రోగ్రాం ఉండక పోదు!. ఇదంతా చూస్తుంటే.. ‘‘జనానికి ఇప్పుడు నీ అవసరం ఉంది. పగిలేకొద్దీ గ్లాసు పదునెక్కుద్ది’’ తరహా సంభాషణల్లాగే.. గేమ్ ఛేంజర్‌లో ‘సీజ్ ద షిప్’ లాంటి రిఫరెన్స్‌లు, డైలాగులు వగైరాలాంటివి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇవన్నీ ఎందుకు అసలు సినిమానే ఆయనతో తీసి ఉంటే సరిపోయేది కదా!.
Comments
Please login to add a commentAdd a comment