జగన్‌ వరుస నిర్ణయాలతో వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం | YSRCP Get Boost Up With YS Jagan Full Focus On Reshuffle Party, Check Out For More Details | Sakshi
Sakshi News home page

జగన్‌ వరుస నిర్ణయాలతో వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం

Published Sat, Jan 25 2025 9:57 AM | Last Updated on Sat, Jan 25 2025 12:07 PM

YSRCP Get Boost Up With YS Jagan Full Focus On Reshuffle Party

గుంటూరు, సాక్షి: చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన గడువు ముగిసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. సంపద సృష్టి పేరుతో ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెర తీసింది కూటమి సర్కార్‌. దీంతో ప్రజల తరఫున పోరాటాలకు ప్రతిపక్ష బాధ్యతతో వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. అదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.

వైఎస్సార్‌సీపీలో కొంతకాలంగా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నది చూస్తున్నదే. వరుసగా జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌(YS Jagan) విడివిడిగా భేటీ అవుతూ వచ్చారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం(Red Book Constitution), కీలక నేతలపై అక్రమ కేసులు.. నిర్బంధాలు, సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల వంటి పరిణామాలు చర్చించారు. కూటమి ప్రతీకార రాజకీయాలకు భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కేడర్‌కు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థుల కుట్రలకు తాను ఎంతగా ఇబ్బంది పడింది.. వాటికి ఎదురొడ్డి ప్రజాభిమానంతో చారిత్రక విజయం సాధించింది వివరించారు. రాబోయే రోజులు మళ్లీ మనవేనని.. కాబట్టి పోరాట పటిమ తగ్గకూడదని పిలుపు ఇచ్చారు. అదే సమయంలో ‘మార్పు’ తప్పదనే సంకేతాలిచ్చారు కూడా. 

అలాంటి వాళ్లకే పదవులు
వైఎస్సార్‌సీపీ(YSRCP)లో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తైంది. నియోజకర్గాల కార్యవర్గాల అంశం చివరి దశలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇక.. మండల్‌, బూత్‌ లెవల్‌ నియామకాలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. అయితే.. త్వరలో వైఎస్‌ జగన్‌ కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలోనే వాటిని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  

నిజానికి.. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాకే వైఎస్‌ జగన్‌ ఈ ప్రక్షాళన మొదలుపెట్టారు. మార్పులపై కీలక నేతలతో చర్చలు జరిపారు. పార్టీలో ఎవరైతే చురుకుగా ఉంటున్నారో.. వాళ్లకే పదవులను అప్పగిస్తున్నారు. తద్వారా పార్టీ కేడర్‌ను చెక్కుచెదరకుండా చూసుకున్నారు. అంతేకాదు.. స్వయంగా తానే కార్యకర్తల దగ్గరకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఈ వరుస కొత్త పరిణామాలు.. పార్టీలో నూతనోత్సాహం నింపుతున్నట్లు తెలుస్తోంది.   

పోరుబాటలో YSRCP..
ఒకవైపు ప్రక్షాళనతో పార్టీ పునఃనిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని వైఎస్‌ జగన్‌ పార్టీ కేడర్‌కు పిలుపు ఇస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) మళ్లీ  మేనిఫెస్టో విషయంలో మోసానికి దిగారు. సూపర్‌ సిక్స్‌ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వంపై నిందలతోనే కాలాయాపన చేస్తున్నారు.  ఈ పరిణామాలన్నింటిని కేడర్‌కు గుర్తు చేస్తున్నారు.

ఐదారు నెలలకే చంద్రబాబు సర్కార్‌పై  ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు కష్టకాలంలో ఉన్నారని, ఈ టైంలో ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. ఇప్పటికే రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 5న ఫీజు రియంబర్స్‌మెంట్‌ నిధుల విడుదల కోరుతూ మరో ధర్నాకు సిద్ధమైంది.  మొత్తంగా.. పార్టీలో పోరాట పటిమ తగ్గకూడదని వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపుతో మరిన్ని ప్రజాపోరాటాలకు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ అనే సంకేతాలిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement