
తాడేపల్లి : ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. టీడీపీ వైఖరికి ప్రజాస్వామ్య వాదులు సిగ్గు పడుతున్నారని ధ్వజమెత్తారు.
‘స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చెడగొడుతున్నారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయం పడుతున్నారు?, తాడిపత్రిలో మా పార్టీకి అధికారం రాకపోయినా గౌరవించాం. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి సైతం జగన్ ని మెచ్చుకున్నారు. కానీ నేడు ఏం జరుగుతుందో చూసి జనం నవ్వుతున్నారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పంలో ఏరకంగా టీడీపీ గెలుస్తుంది?, మాచర్ల, కుప్పం, తుని, విశాఖపట్నం ఇలా అన్నిచోట్లా వైఎస్సార్ సీపీ సభ్యులే అధికంగా ఉన్నారు. మా సభ్యులను ప్రలోభపెట్టి, బెదిరించి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కున్నారు. దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవటం సిగ్గుచేటు. విప్ ని ధిక్కరించిన వారిపై కోర్టుకు వెళ్తాం. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నాం. అడ్డదారిలో గెలవటం కీసం కూటమి నేతలు అనేక కుట్రలు చేశారు’ అని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు.
