
ప్రతి ఇంటికీ బాబు మోసం.. మహిళలు, రైతులు, యువతకు, పిల్లలకూ ద్రోహం: వైఎస్ జగన్ నిప్పులు
చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంట్లో నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవి
ఈ రోజు టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి ప్రజల దీవెనలు పొందగలరా?
ఇవాళ్టికీ మన కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు
గత ప్రభుత్వంలో అమలైన పథకాలన్నీ రద్దు.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలన్నీ బాబు మోసంగా మార్చేశారు
దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు.. సమయం రాగానే ఫుట్‌బాల్‌ని తన్నినట్లు తంతారు
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిటే
కూటమి పాలనలో విచ్చలవిడిగా స్కామ్‌లు.. ఇసుక, మట్టి, మద్యం ప్రతిదీ మాఫియా
ఏ ఊరులో చూసినా గుడి, బడి, వీధి చివరా బెల్టు షాపులే.. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా దోచుకో పంచుకో తినుకో నడుస్తోంది
ఊరూ పేరూ లేని కంపెనీలకు భూములు ధారాదత్తం చేస్తున్నారు
మేం మొబిలైజేషన్ అడ్వాన్సులను తొలగిస్తే వీళ్లు అదే పనిగా తెచ్చారు.. 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వసూలు చేసుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకాలను రద్దు చేశాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలన్నీ పూర్తి మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు మాత్రం జగన్ ఇచ్చినవి అన్నీ కొనసాగుతాయి.. అంతే కాకుండా అధికంగా ఇస్తానని నమ్మబలికారు. చంద్రబాబు మాటలను నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ఇంట్లో పెట్టుకున్నారు.
తమ ఇంటికి ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మనం రాక్షస రాజ్యంలో, కలియుగంలో ఉన్నామని చెప్పేందుకు ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అంతటి దారుణమైన, దుర్మార్గమైన పాలన చూస్తున్నాం..’ అని చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు.
గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలం.. మరి వాళ్లు వెళ్లగలరా?
రాజకీయాలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికే ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. వైఎస్సార్‌సీపీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని గర్వంగా చెప్పగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు 12 నెలల పాలనలో ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలరా? ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు, కూటమి నేతల ఫొటోలు తీసుకుని ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరూ ప్రశ్నిస్తారు.
ఆ చిన్న పిల్లవాడు తల్లికి వందనం కింద నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి ఆడబిడ్డ నిధి కింద నా రూ.18 వేలు ఏమైందని అడుగుతుంది. ఆ తల్లుల అమ్మలు, అత్తలు బయటకు వచ్చి మాకు 50 ఏళ్లకే పెన్షన్ల ద్వారా రూ.48 వేలు ఇస్తామన్నారు కదా..! వాటి సంగతేంటని అడుగుతారు. అదే ఇంట్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నా రూ.36 వేల నిరుద్యోగ భృతి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తాడు. అదే ఇంట్లో నుంచి రైతన్న బయటకు వచ్చి అన్నదాతా సుఖీభవ కింద నా రూ.26 వేల సంగతి ఏమిటని నిలదీస్తాడు.
సూపర్ సిక్స్ గాలికి.. దారుణ వంచన
చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. కడప నుంచి విశాఖపట్నం వెళ్లి వద్దామనుకున్నాం..! కర్నూలు నుంచి అమరావతికి పొద్దున పోయి సాయంత్రానికి చూసి వద్దామనుకున్నాం..! ఆ ఉచిత బస్సు ఏమైందని మహిళలు అడుగుతున్నారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి.
చంద్రబాబు సీఎం అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకాలను రద్దు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని చూస్తున్నారు. ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు.
బాబుకు సింగిల్ డిజిటే..
ఇంత దారుణమైన పాలన, ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు రావడం ఖాయం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.
వ్యవస్థలన్నీ నిర్వీర్యం..
⇒ గ్రామాల్లో ఇవాళ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో నాడుృనేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిష్
మీడియం పక్కకు పోయింది. మూడో తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. మన హయాంలో ప్రభుత్వ బడులలో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి.. ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దనే దుస్థితికి తెచ్చేశారు.
ప్రతి కుటుంబంలో పిల్లలు డాక్టరు, ఇంజనీర్ లాంటి పెద్ద చదువులు చదివితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలని విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ.. లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం వారి చేతిలో డబ్బులు పెడుతూ ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే వారికి క్రమం తప్పకుండా అందించాం. ఇవాళ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయాయి.
⇒ ఆరోగ్యశ్రీ చూస్తే.. పేదవాడు తలెత్తుకుని ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్లి రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందే పరిస్థితి మన హయాంలో ఉండేది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది.
నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్య ఆసరా లేదు. రూ.450 కోట్ల బకాయిలు ఇవ్వలేదు. పేదవాడు నెట్‌వర్క్ ఆసుపత్రులకు వస్తే వైద్యం చేయబోమని బోర్డు తిప్పేశారు. పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పులు పాలైతే గానీ వైద్యం అందే పరిస్థితి లేదు.
⇒ మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశాం. ఇవాళ చంద్రబాబు రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న హామీ మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో ఉచిత పంటల బీమా ఉంటే.. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆర్బేకేలు నీరుగారిపోయాయి. ఈృ క్రాప్ కనబడకుండా పోయింది. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితిలో ఉన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, కందులు, పెసలు, మినుమలు, శనగ, అరటి, పామాయిల్, చీనీ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.
ఎక్కడ చూసినా మాఫియాలే..
ఒకవైపు దారుణమైన పాలన చేస్తున్నారు.. మరోవైపు విచ్చలవిడిగా స్కామ్‌లు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి పారదర్శకంగా డబ్బులు వచ్చాయి. ఏడాదికి రూ.750 కోట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా అరాచకం నడుస్తోంది. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా.. గుడి, బడి, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే.
ప్రతి బెల్టు షాపులో ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. నియోజకవర్గంలో మైన్స్, ఫ్యాక్టరీలు నడపాలంటే ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఇలా రాష్ట్రమంతా రెడ్‌బుక్ రాజ్యాంగం, దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) నడుస్తోంది.
నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు..
⇒ విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన బినామీలకు మాత్రం రూ.మూడు వేల కోట్ల విలువైన భూములిస్తారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ లాంటి కంపెనీలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని నాకింత.. నీకింత అని పంచుకుంటున్నారు.
⇒ మనం మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని తీసేస్తే వీళ్లు అదే పనిగా తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్‌ను మనం తెస్తే.. వీళ్లు రద్దు చేశారు. మనం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి టెండర్లు వేస్తున్నారు. వారికి చంద్రబాబు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు.
కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దేశంలోనే తొలిసారిగా బీసీ కుల గణన నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కుల ఆధారిత జనాభా గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.
కుల గణన చేయాలని నా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2021 నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించాం. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాల వారీ గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది కీలక అడుగు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.