అది మేనిఫెస్టోను ఎగ్గొట్టే రంగు రంగుల కథల పుస్తకం
వైఎస్సార్ïసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
చంద్రబాబు ఏడు నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కు లేదు
ఇప్పుడు 2047 విజన్ అంటుండటం ఆశ్చర్యం.. విజన్ అంటే మనిషి అభివృద్ధికి బాటలు వేయాలి
ఓ పిల్లాడి 20 ఏళ్ల బంగారు భవిష్యత్తుకు వేసే అడుగులే విజన్.. అలాంటి విజన్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బాటలు వేసింది
ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా మార్చడం విజన్
ఉన్నత విద్యలో హార్వర్డ్, ఎంఐటీలతో భాగస్వామ్యం, ఆన్‌లైన్ వర్టికల్స్ మన విజన్
విజన్ అంటే వైద్యంలో సమూల మార్పులు, గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
రైతుల కోసం గొప్ప సంస్కరణలు.. ఆర్బీకేల ద్వారా చేయూతనందించడం విజన్
బాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని చెప్పాను.. ఇప్పుడది 6 నెలలు తిరక్క ముందే ప్రతి ఇంటా కన్పిస్తోంది
అందుకే ప్రజల తరఫున పోరుబాటకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు
ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికుడు కావాలంటూ దిశా నిర్దేశం
ప్రతి అడుగులోనూ జగన్‌తోపాటు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా
ఇవాళ ఆరు నెలలు గడవక ముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని. ఇవాళ 6 నెలలు తిరక్క ముందే అది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది. జగన్ పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. పలావు, బిర్యానీ రెండూ పోయాయి. ఏమీ లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడు అన్న చర్చ నడుస్తోంది.
– వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చంద్రబాబు విజన్ 2047 అంటున్నాడు. ఏడు నెలల క్రితం చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి మేనిఫెస్టో పేరుతో ప్రచారం చేసి ఊదరగొట్టారు. రూ.15 వేలు నుంచి రూ.48 వేల వరకు హామీలిచ్చుకుంటూ వెళ్లారు. ఇక్కడ ఏడు నెలల క్రితం మేనిఫెస్టో అని చెప్పిన హామీలకే దిక్కులేదు... కానీ, విజన్ 2047 అంటున్నాడు. రంగు రంగుల కథల పుస్తకమైన వారి విజన్ డాక్యుమెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది.
– వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. ఇంకోవైపు బాదుడే బాదుడు మొదలైంది. ముట్టుకుంటే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఆరు నెలలు తిరక్క మునుపే రూ.15 వేల కోట్లు కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమే. హామీలపై చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే... ఆ ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామ స్థాయి నుంచి అమలవుతోంది. స్కామ్‌ల మీద స్కామ్‌లు.. లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి డబ్బులివ్వాల్సిందే. ప్రతి విషయంలో నాకింత.. నీకింత.. అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు కళ్లెదుట కనిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన సాగు నీటి సంఘాల ఎన్నికలను అపహాస్యం చేశారు. ఎన్నికలను ఏకపక్షం చేశారు. గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికెట్లు, ప్రతిపక్షానికి, సాధారణ రైతులకు ఇవ్వకుండా వాళ్ల పార్టీ వారికే ఇచ్చుకుని పోలీసుల సాయంతో ఏకపక్షంగా బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపించుకున్నారు. అలాంటప్పుడు ఎన్నికలు జరపడం ఎందుకు? బుల్డోజ్ చేసి ఎన్నికలు జరిపి... రైతులు సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతారు? రైతులు సంతోషంగా ఉన్నారని మీకు అనిపిస్తే రాజీనామా చేసి బయటకు రండి. అప్పుడు పెట్టుబడి సాయం, ఉచిత బీమా ఎక్కడ అని అడుగుతున్న రైతులు మీకు కనిపిస్తారు.
– వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్‌సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు రంగు రంగుల కథలు చెబుతూ.. దానికి విజన్ 2047 అని పేరు పెడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే దాన్ని 420 విజన్ అంటారని మండిపడ్డారు. ‘మనిషిని అభివృద్ధి బాటలోకి తీసుకుని పోవాలంటే.. ఆ అభివృద్ధి బాట ఏమిటని చెప్పేదే విజన్ డాక్యుమెంట్. ఇవాళ చిన్న పిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు? అప్పుడు అతడి భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్ కోసం ఇవాళ సరైన అడుగులు వేస్తున్నామా? లేదా? అన్నదే విజన్. అందులో భాగంగా ఐదేళ్ల పాలనలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చాలా వాటిని చేసి చూపింది’ అని గుర్తు చేశారు.
చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని, పులినోట్లో తలపెట్టడమే అని.. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇవాళ ఆరు నెలలు తిరక్క ముందే అదే కనిపిస్తోంది’ అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం దగా చేయడంతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా గొంతు విప్పాలని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని మార్గ నిర్దేశం చేశారు.
‘పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. దేనికైనా మనం సిద్ధమే. ఎవ్వరూ, ఎక్కడా భయపడొద్దు. దేన్నైనా ఢీకొందాం. మీ అందరికీ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు పార్టీ అండగా ఉంటుంది’ అంటూ నేతలకు భరోసా ఇచ్చారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
జనవరి నుంచి జిల్లాల పర్యటన
జనవరి చివరి వారం నుంచి నేను పార్లమెంటు జిల్లాల్లో పర్యటిస్తాను. వారంలో ప్రతి బుధ, గురువారం రాత్రి అక్కడే బస చేసి కార్యకర్తలతో మమేకమవుతాను. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈ కార్యక్రమం మొదలయ్యే లోగా మండల స్థాయి నుంచి మొదలై నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలి. పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇదంతా ఆర్గనైజ్డ్‌గా తీసుకు రావాలి. నా కార్యక్రమం మొదలైన తర్వాత మీరు, నేను కలిసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకుని పోదాం. విలేజ్ కమిటీలు, బూత్ కమిటీల నియామకం పూర్తి చేస్తాం.
సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉందాం
ఇవాళ మనం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు.. చంద్రబాబు వేసుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి ముసుగుతో యుద్ధం చేస్తున్నాం. ఇలాంటి వాళ్లను ఎదుర్కోవాలంటే మనం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండాలి. జనరేషన్ మారింది. ప్రతి కార్యకర్తకు ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్ వంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలి. గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాలి. ఎవరికైనా పెన్షన్ రాకపోయినా, బిల్లుల బాదుడు పైనా ప్రశ్నిస్తూ ప్రతి గ్రామం నుంచి విప్లవ ధోరణిలో ప్రశ్నించాలి. గ్రామ స్థాయి నుంచే ప్రశ్నించే స్వరం ఉండాలి. అప్పుడే చైతన్యం వస్తుంది. ఈసారి మన టార్గెట్.. చంద్రబాబుకు సింగిల్ డిజిట్ దాటకూడదు. అది కచ్చితంగా జరుగుతుంది.
మనకూ కచ్చితంగా గుడ్ టైమ్ వస్తుంది
ప్రతిపక్షంలో కష్టాలు, కేసులు సహజం. జైల్లో కూడా పెడతారు. నేను మీ అందరికీ చెబుతున్నాను. కష్టాలు ఎల్లకాలం ఉండవు. కష్టం తర్వాత సుఖం ఉంటుంది. ఏ కష్టం ఎవరికి వచ్చినా నా వైపు చూడండి. ప్రతిపక్షం ఉండదు.. అడిగే వాడు ఉండడని నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీ కలిసి నామీద కేసులు పెట్టాయి. ఏమైంది? ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యాను. పగలు తర్వాత రాత్రి వస్తుంది. మళ్లీ మన టైం వస్తుంది. జమిలి వస్తుందంటున్నారు. దేనికైనా మనం సిద్ధంగా ఉందాం. మనకూ తప్పనిసరిగా గుడ్ టైమ్ వస్తుంది.
ఆరు నెలల్లో 3.14 లక్షల పెన్షన్లు కట్
మార్చి, ఏప్రిల్ నెలల్లో.. మన ప్రభుత్వ హయాంలో 66,34,742 పెన్షన్లు ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. డిసెంబర్‌లో పంపిణీ చేసిన పెన్షన్ల సంఖ్య 63,20,222. అంటే 3.14 లక్షల పెన్షన్లు కట్ చేశారు. కొత్తగా పెన్షన్ ఒక్కరికి ఇవ్వకపోగా.. ఉన్న పెన్షన్లు కట్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల్లో ఇంకా, 3 లక్షల నుంచి 4 లక్షల మంది పెన్షన్లు కట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలి. ఈ పోరుబాటలో ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించేలా ఎగుర వేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అభ్యర్థిస్తున్నాను.
ఆరు నెలలకే ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదు
⇒ ఆరు నెలలకే చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీదా లేదు. ఎన్నికల్లో మనం ప్రచారం చేసినప్పుడు, మన పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నేను చెప్పిన మాటలు అందరికీ తెలుసు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీలు, మోసాల గురించి నా దగ్గరకు వచ్చిన పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు. మనం కుటుంబానికి అంతటికీ మంచి చేశాం. కానీ చంద్రబాబు మోసాలు, అబద్ధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఇంటికి మనం మంచి చేస్తే.. ఆయన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి చేస్తానని హామీ ఇచ్చాడు.
⇒ మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని మన పార్టీ నేతలు నాతో అన్నారు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ధర్మం కాదనేది నా అభిమతం. ఆ రోజు మనం మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఇవి మనం చేస్తున్న పథకాలు.. ఐదేళ్ల మన పాలనలో ఎప్పుడూ జరగని మార్పులు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి అమలు చేశాం. చివరకు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయాలు తగ్గినా, మనం సాకులు వెతుక్కోలేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్‌తో పాటు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి... బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసి చూపింది. అంత గొప్పగా ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నాం.
⇒ మనమంతా ఎమ్మెల్యేల తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు మనల్ని ఆప్యాయతతో ప్రజలు ఆదరించారు. మన మీద వ్యతిరేకత లేదు. కానీ పది శాతం మంది చంద్రబాబు మాటలను నమ్మారు. దానికి కారణం కూడా మనమే... అంత గొప్ప పాలన మనం అందించగలిగాం కాబట్టే.. చంద్రబాబు మభ్యపెట్టగలిగాడు. ప్రజలను ఆశ పెట్టగలిగాడు. జగన్ చేసి చూపించాడు కాబట్టి.. చంద్రబాబు కూడా చేసి చూపిస్తాడేమో అని ప్రజలు ఆశపడ్డారు.
⇒ చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటికి వెళ్లినా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో మోసం చేయగలుగుతాడా.. అన్నంతగా మోసం చేశారు. చిన్నపిల్లలతో నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. వారి తల్లులకు నీకు రూ.18 వేలు అని, ఆ అమ్మల తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశ పెట్టారు.
ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ పాలన
⇒ ఒకవైపు మనం ఇస్తున్న పథకాలు పూర్తిగా నిలిపివేశాడు. మరోవైపు ఆయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. రూ.15 వేల కోట్ల మేర కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ప్రశ్నించే స్వరాన్ని అణగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం గ్రామస్థాయి నుంచి అమలవుతోంది. మరోవైపు లిక్కర్, శాండ్ మాఫియాతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, స్కామ్‌లు. ప్రతి పనికీ డబ్బులివ్వాల్సిందే. నాకింత.. నీకింత అని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పంచుకుంటున్న పరిస్థితులు.
⇒ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టడానికి మనం ఇవాళ కలిసి అడుగులు వేస్తున్నాం. ఏ నాయకుడైనా ప్రజల తరఫున స్పందించ గలగాలి. వారి సమస్యలపై పోరాటం చేయాలి. దీనిపై పార్టీ నాయకత్వాన్ని చైతన్యం చేస్తున్నాం. అప్పుడే ప్రజల్లో అధికార పార్టీ మీద పెరుగుతున్న వ్యతిరేకత మనకు సానుకూలంగా మారుతుంది.
⇒ ఆరు నెలలకే మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలన అలా నడుస్తోంది. ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్న విషయం మన కళ్లెదుటే కనిపిస్తోంది. రైతులకు గతంలో పెట్టుబడి సహాయంగా రైతు భరోసా కింద ఇచ్చిన రూ.13,500 గాలికెగిరిపోయింది. రూ.20 వేలు ఇస్తానన్న పెట్టుబడి సాయం మోసమని తేలిపోయిన పరిస్థితుల్లో రైతు సాగు చేస్తున్నాడు. రైతులకు ఉచిత పంటల బీమా దక్కే పరిస్థితి పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఈ–క్రాపింగ్ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో మనం ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి రైతుకు కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా ధాన్యం కొనుగోలు చేసి.. వెంటనే పైకం చెల్లించేలా అక్కడే ‘ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్’ (ఎఫ్‌టీఓ) కూడా ఇచ్చి, మనం తోడుగా నిలిచాం. ఇవాళ అదే రైతులకు కనీస మద్దతు ధర రాకపోగా, అంత కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది. అందుకే వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమం చేశాం.
షాక్ కొడుతున్న కరెంటు బిల్లులపై 27న ఆందోళన
పట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్న విద్యుత్ బిల్లుల మీద ఈ నెల 27న ఆందోళనకు పిలుపునిచ్చాం. ఇప్పటి వరకు అంటే... 6 నెలల వరకు రూ.6 వేల కోట్ల బాడుదు మాత్రమే. రేపటి నెలలో మరో రూ.9 వేల కోట్ల బాదుడు ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితులలో మహిళలు నిరసన తెలుపుతూ బిల్లులు కాల్చుతున్న పరిస్థితి. ఈ దఫా కరెంటు బిల్లుల పెరుగుదలకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో చేయబోతున్నాం.
ఫీజులు రాని పిల్లలకు అండగా నిలుద్దాం
మన ప్రభుత్వ హయాంలో ప్రతి 3 నెలలకొకసారి, త్రైమాసికం అయిన వెంటనే పిల్లల తల్లులకు డబ్బులిచ్చి వారి చదువులకు తోడుగా ఉండేవాళ్లం. ఈ రోజు పిల్లలు విద్యా దీవెన, వసతి దీవెన రాక ఇబ్బంది పడుతున్నారు. మనం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏప్రిల్‌లో వెరిఫై చేసి మే నెలలో ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు త్రైమాసికాలు గడిచిపోయాయి. ఏప్రిల్‌లో వసతి దీవెన కింద డబ్బులిచ్చే వాళ్లం. ఇప్పుడు అది కూడా ఎగిరిపోయింది. మొత్తంగా ఫీజులకు సంబంధించి నాలుగు దఫాలు విద్యా దీవెన రూ.2,800 కోట్లు, వసతి దీవెన రూ.1,100 కోట్లు మొత్తం రూ.3,900 కోట్లు పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. పిల్లలు డబ్బులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పనులకు వెళ్తున్నారు. ఈ పిల్లలకు అండగా, వారికి తోడుగా ఉండే కార్యక్రమం జిల్లా యూనిట్‌గా జనవరి 3వ తేదీన చేయబోతున్నాం.
అసలైన విజన్ అంటే ఇదీ
చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్‌తో మరో డ్రామాకు తెర తీశారు. అసలైన విజన్ అంటే ఏమిటో మనం చూపించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ బడులతో ప్రైవేటు బడులు పోటీ పడే పరిస్థితి కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. నాడు–నేడు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. తొలిసారిగా ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)తో డిజిటల్ బోధన ప్రారంభించాం. ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లిష్ మీడియం చేయడంతో పాటు, సీబీఎస్‌ఈతో ఆపకుండా.. ఏకంగా ఐబీ వరకు ప్రయాణానికి కూడా మన ప్రభుత్వంలోనే అడుగులు పడ్డాయి. రోజుకొక మెనూతో గోరుముద్ద మన ప్రభుత్వంలోనే అమలు చేశాం. తొలిసారిగా మనం చేసిన ఈ మార్పులతో పదో తరగతికి వచ్చే సరికి పిల్లలు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే పరిస్థితి తెచ్చాం. అదీ మన విజన్.
ఉన్నత విద్యలో ఊహకందని మార్పు
ఉన్నత విద్యలో మన డిగ్రీతో ఉద్యోగాలు రాని పరిస్థితి నుంచి వాటిని మరింత మెరుగ్గా చేయడానికి ఎడెక్స్ అనే సంస్థ సహాయంతో ఆన్‌లైన్ వర్టికల్స్ తీసుకొచ్చాం. ఇందులో మన డిగ్రీ విద్యార్థి తనకు నచ్చిన కోర్సులు తీసుకునే విధంగా.. స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ వంటి పెద్ద, పెద్ద విదేశీ యూనివర్సిటీలు కోర్సులు ఆఫర్ చేసేలా చేశాం. ఆ కోర్సులు ఇక్కడ తీసుకుని పరీక్షలు రాస్తే.. వాటికి ఆ యూనివర్సిటీలు సర్టిఫికెట్స్ ఇస్తాయి. ఆయా యూనివర్సిటీల నుంచి డేటా అనలైటిక్స్, అసెట్స్ మేనేజిమెంట్ వంటి కోర్సుల్లో సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి కోర్సుల కోసం ఆలోచన చేసి వారికి విద్యాదీవెన, వసతి దీవెనతో సహా ఏర్పాటు చేయడమే విజన్.
గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్
చదువులు, వైద్యం మనిషిని ఎప్పుడైనా అప్పుల్లోకి నెట్టేస్తాయి. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 ప్రొసీజర్స్‌కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందేట్టు చేశాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నాడు–నేడు పనులతో రూపురేఖలు మార్చాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకుని వచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో స్పెషలిస్టు డాక్టర్ల కొరత దేశ వ్యాప్తంగా 67 శాతం ఉంటే... మన రాష్ట్రంలో మాత్రం దాన్ని కేవలం 4 శాతానికి పరిమితం చేశాం. ప్రతి ఆసుపత్రిలో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో కూడిన మందులు ఉండేలా చేశాం. గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ అంటే వివిధ రోగాలు తొలి దశలో ఉన్నప్పుడే గుర్తించి, వాటిని నివారించడానికి గొప్ప అడుగులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పడ్డాయి. ఇదీ విజన్.
పోర్టులు, ఫిషింగ్ హార్బర్లతో ప్రగతి..
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి రూ.13వేల కోట్లకుపైగా వ్యయంతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాన్ని, రూ. 3,500 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టాం. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. తద్వారా రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయి. ఇదీ విజన్.
రైతును చేయి పట్టుకుని నడిపించాం
రైతుకు ఇబ్బంది రాకుండా, వారిని చేయి పట్టుకుని నడిపించేందుకు ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకే కేంద్రంగా కూర్చోబెట్టడం విజన్. ప్రతి ఎకరాను ఈ–క్రాప్ చేయడమే కాకుండా.. రైతుకు తోడుగా ఉంటూ ఇన్సూ్యరెన్స్ చేసుకున్నా, లేకున్నా.. విపత్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్సూ్యరెన్స్ వచ్చేట్టు ఉచిత పంటల బీమా తీసుకు రావడం విజన్. రైతుకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకేల దగ్గరే కొనుగోలు చేసి.. పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టు చేయడం ఒక విజన్. ఈ రకంగా వ్యవసాయ రంగంలో మార్పులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగాయి.
ఇంటి వద్దకే సేవలు
మన ప్రభుత్వం రాకమనుపు ఒక రూపాయి ప్రభుత్వం ఇస్తే.. అది నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విజన్‌ను తీసుకొచ్చిందే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ.. అందులో 540 రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం.. 60–70 ఇళ్లకు ఒక వలంటీర్... కులం, మతం, ప్రాంతం చూడకుండా.. లంచాలు లేకుండా ప్రతి ఇంటికి ప్రతి పథకం చేర్చగలిగే పరిస్థితి వైఎస్సార్‌సీపీప్రభుత్వంలోనే వచ్చింది. ఇదీ విజన్ అంటే.
Comments
Please login to add a commentAdd a comment