‘‘మనం హామీలు ఇచ్చాం.. సూపర్ సిక్స్ చెప్పాం.. చూస్తే భయమేస్తోంది. ముందుకు కదలలేకపోతున్నాం..ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి’’.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చేసిన ప్రకటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయన అన్న మాటలు గమనించండి.'ఇంకా సంపద సృష్టిస్తా..ఆదాయాన్ని పెంచుతా..ఈ పెంచిన ఆదాయం పేదవాళ్లకోసం ఖర్చు పెడతా.."అని బహిరంగ పభలలో చెప్పారు. అంతేకాదు..తల్లికి వందనం కింద ఎందరు పిల్లలుంటే అందరికి పదిహేనువేల చొప్పున ఇస్తాం. ఒకరుంటే ఒకరికి ,ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా..ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తా..నలుగురు ఉంటే నలుగురికి ఇస్తా.."అని ఆయన చెప్పేవారు. మరి ఇప్పుడో..
చంద్రబాబు నాయుడు సంపద సృష్టించింది ఎక్కడకు పోయిందో కాని, ప్రజలంతా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల గురించి ఆలోచించాలని చెబుతున్నారు. దీనిపైనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు ఎప్పుడైనా ఒక మోడెస్ ఆపరేండి అమలు చేస్తారని, తొలుత హామీలు ఇచ్చేస్తారని, ఆ తర్వాత తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని వాటిని అమలు చేయడం కష్టమని ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ స్కీములపైన అయినా, ఎవరినైనా వ్యక్తిగతంగా హననం చేయాలన్నా ఇదే పద్దతి అవలంభిస్తారని జగన్ వ్యాఖ్యానించారు. చివరికి పిల్లనిచ్చిన మామ ఎన్.టి.రామారావును కూడా చంద్రబాబు వదలిపెట్టలేదని, ఆయనపై సైతం దుష్ప్రచారం చేశారని జగన్ పేర్కొన్నారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే విధానాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారు.
ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పు చేసిందని తెగ ప్రచారం చేశారు. అయినా తనకు సూపర్ సిక్స్ అమలు చేయగల సత్తా ఉందని అనేవారు. జనం కూడా కొంతవరకు ఆయనను నమ్మారు. సీనియర్ కనుక, ఏదో సంపద అని అంటున్నారు కనుక ,దానిని సృష్టించి హామీలు అమలు చేస్తారులే అని జనం అనుకున్నారు. కానీ చంద్రబాబు తన పాత ఎగవేత స్కీమ్ నే యధా ప్రకారం అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆలోచన చేశారు. మొత్తం సమస్యలన్నిటికి జగన్ ప్రభుత్వమే కారణమని ప్రచారం ఆరంభించారు.
ఏకంగా జగన్ ప్రభుత్వం వల్ల 12,96 లక్షల కోట్ల ఆర్దిక విధ్వంసం జరిగిందని కాకి లెక్కలు చెప్పారు. పోలవరం జాప్యం వల్ల రూ.45 వేల కోట్ల రూపాయల నష్టం. అమరావతివల్ల ఇంత నష్టం ..అంటూ ఏవేవో పిచ్చి లెక్కలు వేసి అసలు విషయాన్ని చల్లగా బయటపెట్టేశారు. తనకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని ఉందని, కాని ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ,ప్రజలు అర్దం చేసుకోవాలని అంటున్నారు. ఇక అప్పుల మీద కూడా నోటికి వచ్చిన అంకెలను చెప్పి ప్రజలను నమ్మించాలని చూశారు.
తొమ్మిది లక్షల డెబ్బైనాలుగువేల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని ఆయన కోరారు. జగన్ 2.71 లక్షల కోట్ల డబ్బు బటన్ నొక్కి బదిలీ చేస్తే.. ఇంత అప్పు ఎందుకు అయిందని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించారు. మరి ఎన్నికలకు ముందు రూ. 13 లక్షల కోట్ల అప్పు అని ఎలా ప్రచారం చేశారని చంద్రబాబును ఎవరైనా ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది.నిజానికి రాష్ట్రాన్ని ఆర్ధికంగా విధ్వంసం చేయడానికి పూనుకుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లే.అందుకే బాద్యతారహితంగా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారు. పైగా తమ అంత సమర్ధులు లేరని, సంపద సృష్టించి చూపుతామని కోతలు కోశారు.కాని ఇప్పుడు ఏమంటున్నారు. ప్రజలు ఆలోచించాలట. ఎమ్మెల్యేలు తమ ఆలోచనలు ప్రభుత్వానికి ఇవ్వాలట. ఇందుకోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తారట.గత ప్రభుత్వ హయాంలో క్షీణించిన శాంతిభద్రతలు , జరిగిన ఆర్ధిక అవకతవకలపై రాష్ట్రంలోని ప్రతి పల్లెలో చర్చ చేపడతారట. ఇంతకన్నా పచ్చి మోసం ఇంకొకటి ఉంటుందా?
ఎన్నికల మానిఫెస్టోలో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన హామీలు ప్రకటించినప్పుడు ఎవరిని అడిగి చేశారు?సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఎలా చెప్పగలిగారు? అది దారుణమైన అసత్యమని తెలిసి కూడా అలాంటి వాగ్దానం చేయడం జనాన్ని మోసం చేయడం కిందకు వస్తుందా? రాదా?. చంద్రబాబు తన ఆత్మసాక్షిని అడిగి జవాబివ్వగలరా? చంద్రబాబు ఆత్మతో నిమిత్తం లేకుండా అబద్దాలను చెప్పగలరన్న వైఎస్సార్‌సీపీ నేతల విమర్శలకు సమాధానం ఇవ్వగలరా!. ఏడు శ్వేతపత్రాలపై రాష్ట్రం అంతా చర్చిస్తారట. ఇదే కొత్తగా చెబుతున్న పాత డ్రామా అన్నమాట. 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ గెలిస్తేనే మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం స్కీమ్, విద్యుత్ చార్జీల తగ్గింపు మొదలైనవి యధావిధిగా కొనసాగుతాయని ప్రచారం చేశారు. తీరా టిడిపికి సగం సీట్లు వచ్చాక, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు నిర్వహించి వాటన్నిటికి మంగళం పాడారు. ఇప్పుడు కూడా సరిగ్గా సూపర్ సిక్స్ ఎగవేతకు రంగం సిద్దం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైనా హామీల అమలు సాద్యాసాద్యాల మీద రాష్ట్రం అంతా చర్చ పెడతామని చెప్పలేదే!. కాని ఇప్పుడు హామీలను అమలు చేయలేకపోతున్నామని, దీనిపై ప్రజలంతా చర్చించి సలహాలు ఇవ్వాలని అంటున్నారు ఇంతకన్నా చీటింగ్ వేరే ఏమైనా ఉంటుందా?అని జగన్ ప్రశ్నించడంలో అర్దం ఉంది.ఎన్నికలకు ముందు జగన్ చాలా స్పష్టంగా చంద్రబాబు జనాన్ని మోసం చేయడానికి సూపర్ సిక్స్ అంటున్నారని నెత్తి,నోరు మొత్తుకుని చెప్పారు. చంద్రబాబు మాటను నమ్మరని ఆయన అనుకున్నారు. కాని ప్రజలు మాత్రం చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకున్నారు.అదే ట్రాప్ ను ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ మోసంలో భాగస్వామిగా ఉండడానికి ఏ మాత్రం సిగ్గుపడడం లేదు.
జగన్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ మొత్తం అప్పు 7.48లక్షల కోట్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు 2019 లో దిగిపోయేనాటికి ఖజానాలో వంద కోట్లే మిగిల్చివెళితే, తాను 2024లో దిగిపోయేటప్పటికీ ఏడువేల కోట్ల నుంచి ఎనిమిదివేల కోట్ల రూపాయల నిధులు ఖజానాలో ఉన్నాయని, దీనిని బట్టి ఎవరు ఆర్దిక విధ్వంసానికి పాల్పడింది అర్ధం చేసుకోవచ్చని జగన్ వ్యాఖ్యానించారు.
2014 లో కూడా చంద్రబాబు రైతుల రుణాలన్నింటినీ రద్దు చేస్తానని నమ్మబలికారు. కాని చేయలేక చతికిలపడ్డారు. తిరిగి 2024లో కూడా అదే తరహా హామీలు ఇచ్చి మళ్లీ జనాన్ని మాయ చేయగలిగారు. చేసిన వాగ్దానాలకు బడ్జెట్ కేటాయించవలసి వస్తుందని, అది సాధ్యం కాదు కనుకే చంద్రబాబు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేకపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. సాధారణంగా ఎన్నికలు అయిన వెంటనే పూర్థిస్థాయి బడ్జెట్ పెడతారు. కాని చంద్రబాబు ఆ పని చేయలేకపోవడం బలహీనతగానే కనిపిస్తోంది. చంద్రబాబేమో తాను వాగ్దానాలను అమలు చేయడం కష్టం అన్న సంకేతలు ఇస్తూ, జగన్ పై మొత్తం కధను నెట్టేయడానికి బేషజం లేకుండా ప్రయత్నిస్తున్నారు. అదే జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నడూ డబ్బులు లేవని, కష్టాలు పడుతున్నానని, ప్రజలు సలహాలు ఇవ్వాలని కోరలేదు. తనతంటాలేవో తాను పడి ఆర్ధిక వనరులు సమకూర్చుకుని స్కీములు అమలు చేశారు.
ఏపీని టీడీపీ నేతలు అరాచకానికి చిరునామాగా మార్చారని జగన్ విమర్శిస్తే.. లోకేష్ దానికి బదులు ఇస్తూ ఇంకా రెడ్ బుక్ తెరవలేదని అంటున్నారు. అంటే ఆ బుక్ ఓపెన్ చేయకముందే ఇంత ఆరాచకం చేస్తే, బుక్ తెరచి ఇంకెందరిపై ఘాతుకాలకు పాల్పడతారో అనే సందేహం సహజంగానే అందరిలో వస్తుంది.
ఇప్పుడు చంద్రబాబు ముందున్నది ఒకటే ఆప్షన్.జనాన్ని ఎలా మోసం చేయాలన్నదే..జనాన్ని ఎలా అబద్దాలతో నమ్మించాలన్నదే. ప్రజలను ఎలా డైవర్ట్ చేయలన్నదే. అందుకే తన తప్పులన్నింటిని జగన్ పై తోసివేసి కథ నడపాలని రాష్ట్ర వ్యాప్త చర్చల డ్రామాకు తెరదీస్తున్నారు. జనం అంతా ఎగబడి తమకు ఈ స్కీములు వద్దని చెప్పాలన్నమాట. ఎవరైనా స్కీములు ఎందుకు అమలు చేయరని? అడిగితే వారిని రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేయాలన్నమాట!. ఈ రకమైన కొత్త వ్యూహంతో ఆంధ్రప్రదేశ్‌ను అబద్దాల ప్రదేశ్ గా మార్చడమే టీడీపీ ఎజెండా. దానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు నాయకత్వం వహిస్తున్నారన్నమాట.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment