న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది.
యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..
ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్‌ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు.
అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment