కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు.. తీర్పు రిజర్వు | Delhi CM Arvind Kejriwal Bail Arguments In Supreme Court Updates | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీంలో వాడీవేడి వాదనలు.. తీర్పు రిజర్వు

Published Thu, Sep 5 2024 2:04 PM | Last Updated on Thu, Sep 5 2024 4:09 PM

Delhi CM Arvind Kejriwal Bail Arguments In Supreme Court Updates

న్యూ ఢిల్లీ:  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్‌ కేజీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై  విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌ తరపున  సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్పీ రాజు వాదించారు.  

ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల​ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది.

ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిందని అభిషేక్‌ మను సింఘ్వీ పేర్కొన్నారు. ఇది అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కఠినమైన మనీలాండరింగ్‌ చట్టం కింద ఢిల్లీ ముఖ్యమంత్రి రెండుసార్లు బెయిల్‌ పొందారని, కానీ సీబీఐ ఆయన్ను ‘బీమా అరెస్టు’(ముందస్తు) చేసిందని మండిపడ్డారు.

సింఘ్వీ వాదనలు..

  • ఈ కేసులో రెండేళ్ల తర్వాత కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మూడు కోర్టు ఉత్తర్వులు మాకు అనుకూలంగా ఉన్నాయి.  అయినా బీమా అరెస్టు కింద( ఆకస్మిక) సీబీఐ  కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుంది.  కాబట్టి ఆయన్ని ఎప్పటికీ జైలులో ఉంచవచ్చని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

  • 41ఏ కింద కేజ్రీవాల్‌ను నిందితుడిగా విచారించాలని సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అరెస్ట్‌ చేయాలని ముందుగా అనుకోలేదు. కేజ్రీవాల్‌ కస్టడీలో ఉన్నప్పుడు కేవలం ఆయన్ను విచారించేందుకు మాత్రమే కోర్టు అనుమతించింది.

  • 41ఏ దరఖాస్తు ప్రకారం సీబీఐ సీఎంను మూడు గంటలు విచారించారు. కానీ వారి దగ్గర 41ఏ నోటీసు లేదు.  మరి అంత అకస్మాత్తుగా కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట​ చేశారు. ఇది బీమా అరెస్ట్‌, హడావిడి అరెస్ట్‌ కాకుంటే మరెంటీ?

  • కేజ్రీవాల్‌ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందా? సాక్ష్యాలను తారుమారు చేస్తాడా? అతను సాక్షులను ప్రభావితం చేస్తాడా? సుప్రీంకోర్టు మూడు ప్రశ్నల గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి.

  • సీబీఐ అరెస్టుకు ప్రధాన కారణం కేజ్రీవాల్ సహకరించకపోవడమే. ఒక వ్యక్తి తనను తాను నేరారోపణ చేసుకోవాలని ఎలా అనుకుంటారు.

  • అరవింద్ కేజ్రీవాల్ ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తి.  ఎక్కడికి పారిపోలేడు. ట్యాంపరింగ్ కుదరదు, లక్షల డాక్యుమెంట్లు ఉన్నాయి, ఐదు చార్జిషీట్లు దాఖలయ్యాయి. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉండదు. బెయిల్ కోసం మూడు తీర్పు మాకు అనుకూలంగా  ఉన్నాయి.

  • కేజ్రీవాల్‌కు రెండుసార్లు బెయిల్‌ పొందారు.  పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 కింద సుప్రీంకోర్టు ఓసారి బెయిల్‌ ఇచ్చింది. కేవలం ఇన్సురెన్స్‌ (ముందస్తు, హడావిడీ) అరెస్టు మాత్రమే. అతని అరెస్ట్‌ను సమర్ధించేందుకు అంతకుముంచి దర్యాప్తు సంస్థ కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. 

  • ఈ కేసులో మిగతా నిందితులందరూ(విజయ్ నాయర్, మనీష్ సిసోడియా, బుచ్చి బాబు, సంజయ్ సింగ్, కవిత) విడుదలయ్యారు.

  • లిక్కర్‌ పాలసీకి సబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా.. సీబీఐ ఆయన్ను అరెస్ట్‌ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ఒకరు కస్టడీలో ఉన్నప్పుడు .. మళ్లీ అరెస్ట్‌ చేయాలంటే కోర్టు అనుమతి కావాలి. క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌లో ఏదో ఉంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

  • సీబీఐ సెక్షన్ 41,  41ఏ లను పాటించకుండా అర్నేష్ కుమార్, యాంటిల్ తదితర తీర్పులను ఉల్లంఘించి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసింది.

  • సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ

సీబీఐ తరపున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్పీ రాజు.. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

  •  బెయిల్‌ కోసం ముందు మనీష్‌ సిసోడియా ట్రయల్ కోర్టుకు వెళ్లారు కానీ కేజ్రీవాల్‌ ఒక్కసారి కూడా ఆ పని చేయవలేదని ఆయన ప్రస్తావించారు.  ఇలాంటి కేసుల్లో తాము జోక్యం చేసుకోలేం తిరిగి ట్రయల్‌ కోర్టుకు వెళ్లండి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన కేసులు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.

  • కేజ్రీవాల్‌ ను సెషన్స్ కోర్టుకు వెళ్లకుండానే హైకోర్టును ఆశ్రయించాడు. ఇది నా ప్రాథమిక అభ్యంతరం. మెరిట్‌ల దృష్ట్యా ట్రయల్ కోర్ట్ దీనిని మొదట విచారించాల్సి ఉంది.  అసాధారణమైన కేసుల్లో మాత్రమే హైకోర్టు పరిశీలిస్తుంది. సాధారణ కేసుల్లో ముందుగా సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.

  • కేజ్రీవాల్‌ ముందు సుప్రీంకోర్టుకు వచ్చారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు, ఇప్పుడు ఇక విషయాన్ని ఈ కోర్టు నిర్ణయించాలి.  

  • ఈ మేరకు కవిత కేసును ప్రస్తావిస్తూ.. ముందుగా ఆమె ట్రయల్‌ కోర్టుకు వెళ్లారు. అక్కడ తిరస్కరణ ఎదురవ్వడంతో హైకోర్టు మెట్లెక్కారు. అక్కడా ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు.

  • ఎస్పీ రాజు వాదనలపై జస్టిస్ కాంత్ స్పందిస్తూ..ఒకరిని ట్రయల్‌ కోర్టుకు పంపాలనుకుంటే అప్పుడే హైకోర్టు నిర్ణయాత్మకంగా ఆలోచించాల్సి ఉండేది. ఇక్కడ మెయింటెనబిలిటీకి సంబంధించిన ప్రశ్న కూడా నిర్ణయించుకోవాలి.
  • చట్టం ముందు అందరూ సమానులే. ఎవరూ ప్రత్యేక వ్యక్తులు కారు. ఏ వ్యక్తికి ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ ఉండదు. కేవలం ముఖ్యమంత్రి కావడం వల్లే కేజ్రీవాల్‌ హైకోర్టును ఆశ్రయించారు. సాధారణ ప్రజలు ట్రయల్ కోర్టుకు వెళతారు. వారంతా సుప్రీంకోర్టుకు రాలేరు.
  • కేజ్రీవాల్‌ రిమాండ్ దరఖాస్తును అందించాం, అందులో అరెస్టుకు సంబంధించిన వివరణాత్మక ఆధారాలు ఉన్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసిప్పుడు లేదా సాక్షులను బెదిరించినప్పుడు.  వారెంట్ లేకుండా సరైన దర్యాప్తు కోసం అరెస్టు చేయవచ్చు.  ఈ కేసు ఆ వర్గంలోకి వస్తుంది.
  • అరవింద్ కేజ్రీవాల్ ఛార్జ్ షీట్ కాపీని జతచేయలేదు. దానిని దాచినందున అతని బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలి
  • ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తే, అది ఢిల్లీ హైకోర్టును నిలదీసినట్టే’ అంటూ వాదనలు వినిపించారు.

అయితే లిక్కర్‌ పాలసీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో సీఎంకు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.  ఈ కేసులోనూ సుప్రీం ముఖ్యమంత్రి బెయిల్‌ మంజూరు చేస్తే కేజ్రీవాల్‌  ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement