న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 15 జ్యూడీషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియర్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు.
లిక్కర్ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ జ్యూడీషియల్ కస్టడీ కోరగా.. అదే సమయంలో కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. అయితే.. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
‘‘సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. ఆర్థిక నేరస్తులు చాలా వనరులు, పలుకుబడి ఉన్నవారు. పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే దర్యాప్తు అనేది చాలా జఠిలమైనది. ఇందుకోసమైనా కవితను జ్యూడిషియల్ కస్టడీ కి పంపాలి’’
:::కవిత ఈడీ జ్యుడీషియల్ రిమాండ్ రిపోర్ట్
ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 9వ తేదీ దాకా కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే.. కవిత బెయిల్ పిటిషన్‌పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని చెబుతూ.. ఏప్రిల్ 1వ తేదీకి ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది.
బెయిల్‌పై వాదనల సందర్భంగా..
తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అయితే.. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్.
ఇక విచారణ సందర్భంగా.. కోర్టు ప్రాంగణంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారని అన్నారామె. అదే సమయంలో ఆమె తన భర్త అనిల్, బంధువులను కలిసి మాట్లాడేందుకు ఈడీ అనుమతించింది.
ఇదీ చదవండి- అప్రూవర్‌గా మారను.. క్లీన్‌గా బయటకొస్తా: కవిత
కవిత మేనల్లుడి అరెస్ట్‌కు రంగం సిద్ధం?
మరోవైపు ఇవాళ లిక్కర్ స్కాం కేసులో ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఈడీ విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ సొమ్ము బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. శరణ్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment