ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఈడీ కేసులో ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) తనకు బెయిల్ తిరస్కరించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారామె. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది.
లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారం చేసుకుని తనని ఈ కేసులో ఇరికించారని, స్టేట్మెంట్లు మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కవిత తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసు పెట్టారని ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్నింటికి మించి ఒక మహిళ అయినందున బెయిల్‌తో ఊరట ఇవ్వాలని పిటీషన్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదన్నారు.
అయితే.. లిక్కర్ కేసులో కవితే సూత్రధారి , పాత్రధారి అని ఈడీ తొలి నుంచి వాదిస్తోంది. లిక్కర్ పాలసీని అనుకూలంగా తయారు చేయించేందుకు 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ కు చెల్లింపులు చేయడంలో కవితే ముఖ్య భూమిక పోషించారని, పైసా పెట్టుబడి లేకుండా ఇండో స్పిరిట్ లో కవిత 33శాతం వాటా సంపాదించారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతేకాదు.. కవితకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిగా సాక్షులనూ ప్రభావితం చేయొచ్చని బెయిల్ పిటిషన్‌పై గతంలో ఈడీ వాదనలు వినిపించింది కూడా. ఈ నేపథ్యంలో నేటి విచారణ ద్వారా బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఓ కొలిక్కి వస్తాయా? లేకుంటే విచారణ మళ్లీ వాయిదా పడుతుందా? అనేది చూడాలి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ.. మార్చి 15న ఆమెను హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్టు చేసింది. మార్చి 26 నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. జూన్ 3 వరకు కవిత జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment