![Supreme Court fires on BRS MLAs Party defection case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/SCI-BANNER.jpg.webp?itok=w55gAFFV)
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఒప్పుకోం
నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా గడువు ఉండాలి కదా!
బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
రీజనబుల్ టైం అంటే ఏమిటి?.. మీరు అడిగే సమయానికి గడువు అనేది ఎంత?
మీరు చెప్పకపోతే మీ సమయానికి గడువు మేమే పెడతాం.. స్పష్టం చేసిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం
స్పందించేందుకు కొంత సమయం కావాలన్న స్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది రోహత్గీ
విచారణ ఈనెల 18కి వాయిదా
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి? తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం.’’
– తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సుప్రీంకోర్టు ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో చెప్పండి. ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా? ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే.. మేం చూస్తూ ఊరుకోబోం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే.. తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది.
రెండు పిటిషన్లపై విచారణ..
బీఆర్‌ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వ్, దానం నాగేందర్‌లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ), మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్‌ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే.
ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచా రణ చేపట్టింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ వాదనలు విని పించగా.. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు.
ఇంకా ఎంత సమయం కావాలి?
తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము విచారణ జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని, అనర్హత పిటిషన్‌పై మాత్రమేనని, అందువల్ల పిటిషన్‌లో ఉన్న అంశాలను ప్రస్తావించాలని సూచించింది.
పిటిషన్‌పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. తమకు ఇంకా తగినంత సమయం కావాలని రోహత్గీ బదులిచ్చారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటికే పది నెలలు గడిచింది, మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించి ఉంటే.. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదు’’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
హక్కులకు సంబంధించిన అంశం ఇది
అయితే తమకు ఇంకా సమయం కావాలని రోహత్గీ ఈ సందర్భంగా అభ్యర్ధించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం’’ అని స్పష్టం చేసింది.
సంపత్‌కుమార్, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ కోరిన ‘తగినంత సమయం’ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన తీర్పును రోహత్గీ ప్రస్తావించారు. దీనితో ‘తగినంత సమయం’ అంటే ఎంత అని రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ‘‘తగినంత సమయం అంటే రెండు నెలలు, మూడు నెలలు అని ఏదీ కూడా ఆ తీర్పులో ధర్మాసనం చెప్పలేదని రోహత్గీ బదులిచ్చారు.
డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం’ అంటే ఎంత?
రోహత్గీ సమాధానంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంత? పది నెలలు రీజనబుల్ టైం కాదా? అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి? మీరు చెప్పే రీజనబుల్ టైమ్‌కు గడువు అనేది ఉందా, లేదా? పోనీ మీరు రీజనబుల్ టైం చెప్పకపోతే.. మేమే ఓ గడువు విధిస్తాం.
ఆ గడువులోపు దానిని పూర్తి చేయండి’’ అని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం పేర్కొంది. అయితే ‘రీజనబుల్ వ్యక్తికి రీజనబుల్ టైం ఇవ్వాల’ని రోహత్గీ తిరిగి అభ్యర్ధించారు. ‘‘రీజనబుల్ వ్యక్తి దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటీ, అసలు ఎంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. దీనికి బదులు ఇచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం కావాలని రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
ధర్మాసనానికి అన్ని ఆధారాలు సమర్పించాం: మోహిత్‌రావు
తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది పి.మోహిత్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధర్మాసనానికి సమర్పించామని చెప్పారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని వివరించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment