ఫిరాయింపుల వ్యవహారం.. కేటీఆర్‌ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ! | KTR Delhi Tour Updates | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుల వ్యవహారం.. నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో కేటీఆర్‌

Published Wed, Feb 5 2025 4:14 PM | Last Updated on Wed, Feb 5 2025 5:47 PM

KTR Delhi Tour Updates

సాక్షి,హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 10న విచారణ చేపట్టనుంది. 

ఈ తరుణంలో కేటీఆర్‌ రేపటి నుంచి నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్‌లు  వెళ్లనున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై న్యాయవాదులతో చర్చించనున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్‌లు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్‌ చేస్తున్నారు.  

అంతకుముందు 
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

మరో పిటిషన్‌లో.. 
ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ గవాయ్‌, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది.  ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్‌ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్‌ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్‌ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్‌ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్‌ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. 

అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్‌పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్‌ అడిగి చెప్తానని లాయర్‌ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం(ఫిబ్రవరి 10న) కౌశిక్‌ రెడ్డి ఎస్‌ఎల్‌పీ, కేటీఆర్‌ రిట్‌ పిటిషన్‌లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement