న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. ఈ మేరకు సుప్రీంకోర్టు జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేజ్రీవాల్‌కు శుక్రవారం పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్‌పై విచారణ సందర్భగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ.. ‘పంజరంలో ఉన్న చిలుక (caged parrot) మాదిరి వ్యవహరించకూడదని సూచించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్
సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పనిచేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే సీబీఐ.. కేంద్ర ప్రభావంతో పనిచేసే ‘బోనులో ఉన్న చిలుక’ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే ‘స్వేచ్ఛగా విహరించే చిలుకలా’ వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు.
అలాగే సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విధానంపై జస్టిస్ భూయాన్ విమర్శలు గుప్పించారు. ఆయన్ను కేవలం జైలులో ఉంచి వేధించాలన్న ఉద్దేశంతో ప్లాన్ ప్రకారం అరెస్ట్ జరిగినట్లు కనిపిస్తోందన్నారు.
అయితే ‘పంజరంలో బంధించిన చిలుక’ పదాన్ని 2013లో సీబీఐపై సుప్రీంకోర్టు ఉపయోగించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రమైనది కాదని కేంద్ర ప్రభుత్వ ప్రభావంతో పని చేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనతో ఏకీభవించిన అప్పటి సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా.. ఈ వ్యాఖ్యను అంగీకరించారు. సీబీఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సీబీఐని ‘పంజరంలో చిలుక’ అనే మాటను తరచుగా ఉపయోగిస్తుంటాయి. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో ఈ పదబంధం మళ్లీ తెరపైకి వచ్చింది.
చదవండి: ఆరు నెలల తర్వాత బయటకు
మరోవైపు విచారణ సందర్భంగా బెయిల్‌పై జస్టిస్ సూర్యకాంత్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ అరెస్టు సక్రమైందని తెలిపిన న్యామూర్తి.. సుదీర్ఘంగా జైలులో నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 21 ప్రకారం సాధారణంగా కోర్టులు స్వేచ్ఛ వైపే మొగ్గుచూపుతాయని తెలిపారు.
కాగా లిక్కర్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసులో తొలుత కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అదుపులోకి తీసుకుంది. అనంతరం జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈడీ కేసులో సీఎంకు జూలై 12న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. సీబీఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉన్నారు.
సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ, బెయిల్ కోసం అభ్యర్థిస్తూ రెండు పిటిషన్‌లు వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బయటకు రానున్నారు.
ఇదీ చదవండి: అభయ కేసు.. సీబీఐ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment