
భోపాల్: శివపార్వతుల్ని స్మరించుకుంటూ జరుపుకునే సంప్రదాయ పండుగ పర్వదినాన మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖాండ్వా జిల్లాలో చారుగావ్ మఖాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండావత్ గ్రామంలో 150ఏళ్ల పురాతన బావిని శుభ్రం చేస్తున్న 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు.
పోలీసు ఉన్నతాధికారుల సమాచారం మేరకు.. రాష్ట్రంలో ప్రతిఏడాది హిందూ సంప్రదాయ పద్దతిలో శివపార్వతులను (Lord Shiva Parvati) స్మరించుకుంటూ గంగోర్ (Gangaur festival) అనే పండుగను నిర్వహిస్తుండడం ఆనవాయితీ. అయితే, ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో భక్తులు గంగోర్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పండుగ సంప్రదాయంలో భాగంగా దేవుళ్ల విగ్రహాల్ని గంగాజలంలో నిమజ్జనం చేయాల్సి ఉంది. ఇందుకోసం గ్రామానికి చెందిన అతి పురాతన బావిలో విగ్రహాల్ని నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఒక్కొక్కరుగా బావిలోకి దిగి
ముందుగా బావిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు గురువారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందులోకి దిగాడు. బావి నుంచి విషవాయివులు వెలువడడంతో ఊపిరాడక బావిలోనే మరణించారు. బావిలోకి దిగిన ఎంత సేపటికీ అతని జాడ తెలియకపోవడంతో అతన్ని రక్షించేందుకు ఒక్కొక్కరుగా బావిలో దిగారు. అలా ఒక్కరి ప్రాణాల్ని రక్షించేందుకు వెళ్లిన మొత్తం ఎనిమిది మంది గ్రామస్తులు మరణించినట్లు ఖాండ్వా కలెక్టర్ రిషవ్ గుప్తా, ఎస్పీ మనోజ్ కుమార్ రాయ్ ప్రకటించారు.
నాలుగు గంటల పాటు శ్రమించి
బావిలోకి దిగిన గ్రామస్తుల ఆచూకీ గల్లంతు కావడంతో వారిని రక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, ఎసీఆర్‌ఎఫ్ బృందాలు తరలివచ్చాయి. నాలుగు గంటల పాటు శ్రమించి బావిలోనే ప్రాణాల్ని కోల్పోయిన గ్రామస్తుల్ని ఒక్కొక్కరిగా మొత్తం ఎనిమిదిమంది మృతదేహాల్ని వెలికి తీశాయి.
సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి
ఈ విషాదంపై సమాచారం అందుకున్న సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
खंडवा जिले अंतर्गत छैगांवमाखन क्षेत्र के कोंडावत गांव में एक दुर्भाग्यपूर्ण घटना में गणगौर विसर्जन के लिए कुएं की सफाई हेतु उतरे एक व्यक्ति के दलदल में फंसने पर बचाने के प्रयास में एक के बाद एक कुएं में उतरे अन्य सात व्यक्ति भी अंदर फंस गए, कुएं में जहरीली गैस से दम घुटने के कारण…
— Dr Mohan Yadav (@DrMohanYadav51) April 3, 2025
బాధితుల గుర్తింపు
బావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది మృతుల వివరాల్ని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో రాకేష్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వాసుదేవ్ పటేల్ (40), గజానన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35),మోహన్ పటేల్ (53) గా గుర్తించారు.
మరణానికి గల కారణం
విషాదానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో బావి లోపల కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ వంటి వాయువులు పేరుకుపోవడం వల్ల విషపూరిత పొగలు వచ్చి ఉండవచ్చని వైద్యులు అంచనా వేశారు. సరైన భద్రతా చర్యలు లేకుండా బావులు, సెప్టిక్ ట్యాంకులు వంటి ప్రదేశాల్లో దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
జిల్లా యంత్రాంగం ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. మరణాలకు ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తూనే, మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది.