
ఢిల్లీ: నగరంలో 17ఏళ్ల బాలుడు కునాల్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సీలంపూర్‌లో ఓ లేడీ డాన్ చుట్టూ తిరుగుతోంది. బాలుడి హత్య వెనుక లేడీ గ్యాంగ్ స్టర్ జిక్రా ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిఖ్రా తన కుమారుడిని చాలాసార్లు బెదిరించిందని.. ఆమె తుపాకీతో తిరుగుతూ ఉండేదన్నారు. అవకాశం దొరికితే నా కొడుకును చంపేస్తానని చెప్పేదని బాలుడి తండ్రి అన్నారు. జిక్రా గన్‌తో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలు కూడా ఉండగా, సీలంపూర్‌లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి.
జిక్రాకు పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబాతో ప్రేమ సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు అండర్ వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని సమాచారం. గతంలో ఢిల్లీలో బడా క్రిమినల్ అయిన గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయా ఆమెను బౌన్సర్‌గా నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం 10-15 మందితో జిక్రా తన సొంత ముఠాను నడిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
పాలస్తీనియన్ జెండా ప్రొఫైల్ ఫోటో ఉన్న జిక్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15,300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవలి పోస్ట్‌లలో చాలా వరకు ఆమె వివిధ పాటలకు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తాయి. గన్‌తో ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేంది. తుపాకులతో రీల్స్ చేసినందుకు ఆయుధ చట్టం కింద జిక్రాపై ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఆమె పోలీసు కస్టడీలోనూ వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసేంది. కునాల్ వర్గానికి చెందిన వ్యక్తులు గతంలో జిక్రా సోదరుడు సాహిల్‌పై దాడి చేయగా, దానికి ప్రతీకారంగానే కునాల్‌ను హత్య చేసి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు.