
చదివిన ప్రతి తరగతిలోనూ అత్యధిక మార్కులతో పాసైన ఓ కుర్రాడు బెట్టింగ్ అలవాటు మానుకోలేక చదువుకు దూరమై హొటల్‌లో సర్వర్‌గా మారి ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు. చెడు సాంగత్యాన్ని మొదటిలోనే తుంచలేక ఓ వివాహిత చేతులారా బంగారం లాంటి బతుకును బుగ్గిపాలు చేసుకుంది. పైడి భీమవరంనడిబొడ్డున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలు తెలిసే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రణస్థలం: పైడిభీమవరంలో ఊరి నడిబొడ్డున ఈ నెల 19న జరిగిన అవాల భవానీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని జేఆర్ పురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు జేఆర్ పురం పోలీస్ స్టేషన్‌లో సీఐ ఎం. అవతారం గురువారం వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..
అవాల భవానీ పైడిభీమవరంలోని ఓ హొటల్‌లో పనిచేసేది. అక్కడే సర్వర్‌గా పనిచేస్తున్న కొండక వీర్రాజు అనే వ్యక్తితో నాలుగు నెలల కిందట ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం హోటల్ యజమానికి తెలియడంతో వీర్రాజు ను పనిలో నుంచి మానిపించేశారు. ఆ తర్వాత భవానీ ఈ విషయం తమ ఇంటిలో తెలిసిపోతుందని వీర్రాజును దూరం పెట్టింది. ఫోన్ చేసినా మాట్లాడకపోవడంతో వీర్రాజు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. మరొకరితో అక్రమ సంబంధం ఉండడం వల్లనే తనను దూరం పెడుతోందని భావించి ఆమెపై కోపం పెంచుకున్నాడు.
ఈ నెల 19న పైడిభీమవరంలోని ఒక దుకాణంలో చాకు కొను క్కుని తన దగ్గర ఉంచుకున్నాడు. పైడిభీమవరం నడిబొడ్డున ఉన్న గుర్రమ్మ గుడి వెనుక ఉన్న కాజావారి కోనేరుగట్టు వద్ద అవాల భవాని రావడం గమనించి ఆమెను పిలిచి కొంత సమయం గొడవ పడ్డాడు. అయితే ఆమె అతడితో మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న చాకుతో భవాని గొంతును రెండు సార్లు బలంగా కోసినట్లు పోలీసులు తెలిపారు.
తర్వాత అక్కడ నుంచి పారిపోయిన వీర్రాజు విజయవాడలోని ఇంటికి చేరుకుని ఎవరూ గుర్తు పట్టకుండా గుండు గీసుకుని తిరుపతి వెళ్లిపోయాడు. తిరిగి వస్తుండగా పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు రణస్థలం మండలంలోని కమ్మసిగడాం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసును త్వరగా ఛేదించి జేఆర్ పురం సీఐ అవతారం, ఎస్‌ఐ ఎస్.చిరంజీవి, సిబ్బంది పి.హేమంత్ కుమార్, కేకే సింగ్, సీహెచ్ సురేష్ ను జిల్లా ఉన్నతాధికారులు ప్రశంసించారు.
అన్నింటింలోనూ టాపరే..
ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కొండక వీర్రాజు స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గల నడిపల్లి గ్రామం. కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి విజయవాడ వలస వెళ్లి అక్కడే ఉండేవాడు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. పదిలో పదికి పది, ఇంటర్‌లో 965 మార్కులు, డిగ్రీ రెండేళ్లలోనూ 90శాతం మార్కులు సాధించాడు.
డిగ్రీ చివరి ఏడాదిలో బెట్టింగులకు అలవాటు పడి డబ్బులు అప్పు చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో అన్నదమ్ములు నాలుగు నెలలు క్రితం స్వగ్రా మం నడిపిల్లి పంపించేశారు. తదుపరి నడిపిల్లి వచ్చిన అతను పైడిభీమవరంలోని ఒక హోటల్‌లో సర్వర్‌గా పనిలో జాయినయ్యాడు. అంత తెలివైన విద్యార్థి బెట్టింగ్ మానుకోలేక ఆఖరుకు హంతకుడిగా మిగిలాడు.