
వాళ్లంతా ఒకే ఏరియాలో ఉండే స్నేహితులు. సరదా ట్రిప్పు కోసం కారులో కొద్ది దూరం వెళ్లారు. కానీ, తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వాళ్లలో ఇద్దరిని కబళించింది. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు.. ఇదంతా గూగుల్ మ్యాప్(Google Map) చేసిన నిర్వాకమనే విషయం తెలిసి కంగుతిన్నారు.
ఢిల్లీ-లక్నో హైవేపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన కారు-ట్రక్కు ప్రమాదంలో విస్తుపోయే విషయం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. గూగుల్ మ్యాప్ చూపించినట్లుగా ముందుకెళ్లిన కారు.. అనూహ్యంగా ట్రక్కు ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారని ఎన్డీటీవీ ఒక కథనం ఇచ్చింది.
హర్యానా రోహ్‌తక్‌కు చెందిన శివాని, సిమ్రాన్, రాహుల్, సంజూలు నైనిటాల్‌లోని నీమ్ కరోలీ బాబా ఆశ్రమ్‌కు వెళ్లి తిరిగొస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి టైంలో బైపాస్ గుండా వెళ్లాల్సిన కారు.. అనూహ్యాంగా ఢిల్లీ వైపు మలుపు తిరిగింది. అంతలో రామ్‌పూర్ నుంచి ఢిల్లీ వైపు వేగంగా వెళ్తున్న సిమెంట్ దిమ్మెలతో కూడిన ట్రక్కు వీళ్ల కారును బలంగా ఢీ కొట్టింది. ఆ ప్రమాద తీవ్రతకు ట్రక్కు బోల్తా పడగా.. కారు నుజ్జు అయ్యి ట్రక్కు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్షగాతత్రులు సాయం కోసం కేకలు వేశారు.

సుమారు 15 మంది(ట్రక్కు డ్రైవర్‌తో సహా).. దాదాపు గంట సేపు అతికష్టం మీద శ్రమించి కారులో ఉన్న నలుగురు క్షతగాత్రులను బయటకు తీశారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన శివాని, సిమ్రాన్‌లు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ టైంలో డ్రైవర్ సీట్‌లో ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఉంది. బహుశా ఆ రాంగ్ టర్నే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావించిన పోలీసులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుల నుంచి అదే విషయాన్ని ధృవీకరించుకున్నారు.