![Sheena Bora Case: No Relief For indrani mukerjea In Supreme Court](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Sheena-Bora-Case.jpg.webp?itok=bXDdTzoL)
న్యూఢిల్లీ: షీనా బోరా కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. విదేశాలకు వెళ్లే విషయంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టిపారేసింది. అదే సమయంలో ఈ కేసు విచారణ ఆలస్యం అవుతుండడంతో ట్రయల్ కోర్టుపై అసహనం వ్యక్తం చేసింది.
ఇంద్రాణీ ముఖర్జీ విదేశాలకు వెళ్లకుండా.. గతంలో బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను కిందటి ఏడాది నవంబర్‌లో సుప్రీం కోర్టులో ఇంద్రాణీ ముఖర్జీ సవాల్ చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేష్, రాజేష్ బిందాల్ ధర్మాసనం.. ఇవాళ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అదే సమయంలో.. కేసు విచారణ జాప్యం అవుతుండడం దృష్టికి రావడంతో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏడాదిలోపు ఈ కేసుకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ వాదన
- ఇది ఎంతో సున్నితమైన కేసు
- ప్రస్తుతం ఈ కేసు విచారణ మధ్యలో ఉంది
- ఇప్పటికే 96 మంది సాక్ష్యులను విచారించాం
- ఇలాంటి సమయంలో ఆమెకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వడం సరికాదు.
ఇంద్రాణీ తరఫు వాదనలు
- ఈ కేసులో సుప్రీం కోర్టు ఆమె బెయిల్ మంజూరు చేసింది.
- అయితే ఇంకా 96 మంది సాక్ష్యులను విచారించాల్సిన అవసరం ఉంది.
- ట్రయల్ కోర్టులో విచారణ జరపాల్సిన బెంచ్ నాలుగు నెలల కూడా ఖాళీగానే ఉంది
- కాబట్టి ఈ కేసు విచారణ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయి
- కాబట్టి మా క్లయింట్‌కు విదేశాలకు వెళ్లేందుకు ఊరట ఇవ్వాలి
సీబీఐ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం.. ఇంద్రాణీ ముఖర్జీ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.
షీనా బోరా కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు, పోలీస్ డైరీలో ఏముందంటే..
ముంబై మెట్రో వన్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున షీనా బోరా(22) 2012, ఏప్రిల్ 24న అదృశ్యమైంది. మళ్లీ ఆమె కనిపించనే లేదు. శవంగా తేలడంతో పోలీస్ దర్యాప్తు మొదలైంది. షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. తన రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో అరెస్టైన ఆమె.. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆరేళ్ల తర్వాత బయటకు వచ్చారు. అయితే తన బిడ్డను తాను చంపుకోలేదని, ఆమె ఇంకా బతికే ఉందంటూ ఇంద్రాణీ మొదటి నుంచి వాదిస్తూ వస్తుండడం గమనార్హం.
షీనా బోరా కేసు టైం లైన్
- ఏప్రిల్ 24, 2012: షీనా బోరా కనిపించకుండా పోయింది
- 2015, ఆగష్టు 21: ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ అరెస్ట్.. నేరం ఒప్పుకోలు
- 2015, ఆగష్టు 25: షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ అరెస్ట్
- ఆగష్టు 26, 2015: షీనా మాజీ భర్త సంజీవ్ ఖన్నా కోల్‌కతాలో అరెస్ట్
- 2015, సెప్టెంబర్ 1: షీనా అసలు తండ్రిని తననేంటూ సిద్ధార్థ్ దాస్ ప్రకటన
- 2015, సెప్టెంబర్ 18: షీనా బోరా కేసు సీబీఐకి అప్పగింత
- 2015, నవంబర్ 19: పీటర్ ముఖర్జీ అరెస్ట్.. ఇంద్రాణీ, సంజీవ్, శ్యామ్‌వర్ మీద ఛార్జ్‌షీట్ దాఖలు
- ఫిబ్రవరి 16, 2016: ఛార్జ్ షీట్‌లో పీటర్ ముఖర్జీ పేరు నమోదు
- జనవరి-ఫిబ్రవరి 2017: ఈ కేసులో విచారణ ప్రారంభం
- అక్టోబర్ 2019: ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీలకు విడాకులు మంజూరు
- మార్చి 2020: పీటర్ ముఖర్జీకి బెయిల్ మంజూరు
- మే 18, 2022: ఇంద్రాణీ ముఖర్జీకి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. ఆరేళ్ల తర్వాత బయటకు
- ఫ్రిబవరి 12, 2025: విదేశీ పర్యటనకు తనను అనుమతించాలని ఇంద్రాణీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత.. ట్రయల్ ఏడాదిలోపు పూర్తి చేయాలని కింది కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment