
కర్నాటకలో పట్టుబడ్డ డ్రగ్స్‌తో సిబ్బంది
కర్నాటకలో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఈశాన్యాన రూ.88 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ/బనశంకరి: కర్నాటక పోలీసులు 37 కిలోల ఎండీఎంఏ (మెథిలీన్ డయాక్సీ మెథాంఫెటమైన్) అనే సింథటిక్ డ్రగ్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ ఆదివారం మీడియాకు తెలిపారు. గత సెప్టెంబరులో మంగళూరులో హైదర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 15 గ్రాముల ఎండీఎంఏ స్వాదీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బెంగళూరులో ఓ నైజీరియా దేశస్తున్ని పట్టుకోగా రూ.6 కోట్ల విలువైన ఎండీఎంఏ దొరికింది.
ఇది అంతర్జాతీయ డ్రగ్స్ దందా అని, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. మంగళూరు పోలీసులు బాంబా ఫాంట్ (31), అబిగైల్ అడోనిస్(30) అనే దక్షిణాఫ్రికన్లను అరెస్ట్ చేసి ట్రాలీ బ్యాగుల్లో దాచిన 37 కిలోల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏను మోల్లీ, ఎక్‌స్టసీ అని పలు పేర్లతో పిలుస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఇంఫాల్, గౌహతి జోన్లలో రూ.88 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ డ్రగ్ టాబ్లెట్లను పట్టుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
ఇందుకు సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా సభ్యులైన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారని ఆదివారం ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘‘ఎన్‌సీబీ ఇంఫాల్ జోన్ అధికారులు ఈ నెల 13న లిలాంగ్ ప్రాంతంలో ఓ ట్రక్కులో సోదాలు జరిపి టూల్‌బాక్స్‌లో దాచిన 102.39 కిలోల మెథాంఫెటమైన్ ట్యాబ్లెట్లను పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అసోం సరిహద్దుల్లో ఓ వాహనం స్పేర్ టైర్‌లో దాచిన 7.48 కిలోల మెథాంఫెటమైన్ టాబ్లెట్లను పట్టుకున్నారు’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment