బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Fires On Chandrababu Govt Lies And Atrocities | Sakshi
Sakshi News home page

బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?: వైఎస్‌ జగన్‌

Published Wed, Nov 20 2024 3:34 PM | Last Updated on Wed, Nov 20 2024 7:17 PM

Ys Jagan Fires On Chandrababu Govt Lies And Atrocities

సాక్షి, తాడేపల్లి: అబద్ధాలనే నిజాలుగా నమ్మించే యత్నానికి తెరలేపిన చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి మోసాలు, అరాచకాలను నిలదీశారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని.. ఆయనలో ఎప్పటికీ మార్పు ఉండదన్నారు.

‘‘సూపర్‌ సిక్స్ హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. హామీలు అమలు చేయలేకే చంద్రబాబు బడ్జెట్‌ ఆలస్యం చేశారు. బడ్జెట్‌ ప్రవేశపెడితే రాష్ట్రానికి ఉన్న అప్పులు చూపించక తప్పదు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. వాస్తవాలు ఏమిటో బాబు పెట్టిన బడ్జెట్‌ పత్రాలు చెబుతున్నారు.. కాగ్‌ రిపోర్ట్‌పై కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా గ్లోబెల్‌ ప్రచారం చేసింది. తప్పుడు ‍ప్రచారం చేయడం ధర్మమేనా?. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఆయనను బొంకుల బాబు అని ఎందుకు అనకూడదు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

 

 
 
’’బాబు దిగిపోయే నాటికి రూ.42,183 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీకి రూ.680 కోట్లు బకాయిలు పెట్టారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి చంద్రబాబు అప్పులు చేశారు. రూ. 28,457 కోట్లు పరిమితికి మించి బాబు అప్పు చేశారు. ఎవరు  ఆర్థిక విధ్వంకారులో ఈ లెక్కలే సాక్ష్యం. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే. మా హయాంలో 15 శాతం మాత్రమే పెరిగాయి. చంద్రబాబు కంటే వైఎస్సార్‌సీపీ హయాంలో 4 శాతం అప్పులు తక్కువగా ఉన్నాయి. చంద్రబాబు పరిమితికి మించి అప్పులు చేశారు.’’ అని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

‘‘బాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 22.63 శాతం. మా హయాంలో 13.57  శాతం మాత్రమే. మా హయాంలో కోవిడ్ రాష్ట్రాన్ని పీడించింది. దేశ వృద్ధి రేటు కూడా 9.28 శాతానికి తగ్గిపోలేదా? మా హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు 12.61 శాతం పెరిగింది. బాబు హయాంలో 11.92 శాతం మాత్రమే పారిశ్రామిక వృద్ధి రేటు. బాబు హయాంలో ఎంఎస్‌ఎంఈల ద్వారా 8 లక్షల ఉద్యోగాలు ఇస్తే మా హయాంలో 32 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

ఇదీ చదవండి: అభివృద్ధిపైనా అబద్ధాలే

అప్పులపై అదే దుష్ప్రచారం:
బడ్జెట్‌ పేజీ నెం.14. 16 రెండు పేజీలు చూస్తే.. రాష్ట్ర అప్పులు 2018–19 నాటికి రూ.2.57 లక్షల కోట్లు అని చూపారు. దానికి గవర్నమెంట్‌ గ్యారెంటీ రూ.55 వేల కోట్లు కూడా కలిపితే అప్పటికి రాష్ట్ర అప్పు మొత్తం రూ.3.13 లక్షల కోట్లు. అలాగే 2024లో వైయస్సార్‌సీపీ దిగిపోయే నాటికి ఉన్న అప్పులను అదే పేజీలో చూపారు. అప్పులు రూ.4.91 లక్షల కోట్లకు ఎగబాయాయని, గవర్నమెంట్‌ గ్యారెంటీ అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు, రెండూ కలిపితే మొత్తం అప్పు 6.46 లక్షల కోట్లు అని తేల్చారు. అది బడ్జెట్‌లోనే కాకుండా, 2023–24లో కాగ్‌ రిపోర్ట్‌ (పేజీ నెం.18. 20)లో చూపారు. అందుకే మరోసారి చంద్రబాబును అడుగుతున్నాను. అయ్యా, అబద్ధాల చెప్పడం ధర్మమేనా? రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు.. చివరకు ఎన్నికల నాటికి రూ.14 లక్షల కోట్లు అని చెప్పడం ధర్మమేనా? చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా అదే దుష్ప్రచారం చేస్తూ. ఒక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ (వ్యవస్థీకృత నేరం) చేశారు.

అది తప్పైతే అసెంబ్లీలో ఎందుకు పెట్టారు?:
చంద్రబాబు తన గుండెల మీద చేయి వేసుకుని, ప్రజలకు చెప్పాలి. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. అధికార యంత్రాంగమంతా ఆయన చేతుల్లోనే ఉంది. తన చేతుల్లో ఉన్న అధికారులతోనే బడ్జెట్‌ తయారు చేయించి, సభలో ప్రవేశపెట్టారు. అందులోని అధికారిక లెక్కలను కాగ్‌ కూడా ధృవీకరించింది. ఆ తర్వాత కూడా నీ హయాంలో, నీ అధికారుల చేత నీవు ప్రవేశపెట్టిన నీ బడ్జెట్, నీ లెక్కలను కాగ్‌ ధృవీకరించిన తర్వాత, సభలో పెట్టిన తర్వాత కూడా.. ఈ అప్పుల గురించి, మీరు ఖరారు చేసిన వివరాల మీద మీరే ఒప్పుకోకపోతే.. ఇక అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టారు?. చెప్పే అబద్ధాలకు ఒకటే బొంకు. అందుకే బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు?

మీరు రూ.42 వేల కోట్లు ఎగ్గొట్టి పోయారు:
 స్పిల్‌ ఓవర్‌ అక్కౌంట్స్‌ మీద కూడా అదే దుష్ప్రచారం. అవి ఏటా ఉంటాయి. ప్రతి బడ్జెట్‌ నుంచి, మరో బడ్జెట్‌కు స్పిల్‌ ఓవర్‌ బిల్స్‌ ఉంటాయి. అలా 2019లో చంద్రబాబు దిగిపోతూ మాకు పెట్టిపోయిన బిల్లులు ఏకంగా రూ.42,183 కోట్లు. బహుషా ఏ ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో గిఫ్ట్‌లు ఇవ్వదు. అయినా మేము చిరునవ్వుతో చెల్లించాం.

బాబు హయాంలో పరిమితికి మించి అప్పు:
 2014–19 మధ్య ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. అది కాగ్‌ నివేదికలోనే ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలో కూడా ఉంది. ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోత పడింది. ఆ విధంగా చూస్తే.. మా హయాంలో చేసిన ఎక్కువ అప్పు కేవలం రూ.1647 కోట్లు మాత్రమే. మరి ఎవరు ఆర్థిక వి«ధ్వంసకారుడు. ఎవరు క్రమశిక్షణతో నడిచారు అన్నది ఈ డేటా చూస్తే అర్థమవుతుంది.

ఎవరి హయాంలో ఎంతెంత అప్పు?:
చంద్రబాబు హయాంలో కోవిడ్‌ వంటి మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు ఆ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ కూడా చూస్తే.. – చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పు ఉండగా, 2019 నాటికి అది రూ.3.13 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పులు ఏటా సగటున 19.54 శాతం పెరిగాయి. అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.6.46 లక్షల కోట్లు కాగా, ఆ పెరుగుదల (సీఏజీఆర్‌) 15.61 శాతం మాత్రమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలో 4 శాతం తక్కువ. అలాగే నాన్‌ గ్యారెంటీ అప్పులు కలిపి చూసినా, చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8600 కోట్లు ఉంటే, 2019 నాటికి అవి రూ.77వేల కోట్లకు చేరాయి. అదే మా హయాంలో ఆ అప్పులను రూ.2 వేల కోట్లు తగ్గించాం. అంటే మేము దిగిపోయేనాటికి నాన్‌ గ్యారెంటీ అప్పులు రూ.75వేల కోట్లు. ఆ మేరకు చంద్రబాబు హయాంలో నాన్‌ గ్యారెంటీ అప్పులు 54.98 శాతం పెరిగితే, మా హయాంలో అది –0.48 శాతం.

వృద్ధిరేటుపై అసెంబ్లీ చంద్రబాబు:
తన హయాంలో 2014–19 మధ్య రాష్ట్ర వృద్ధి రేటు 13.5 శాతం ఉంటే, అది 2019–24 మధ్య మా హయాంలో 10.6 శాతానికి పడిపోయిందని చెప్పారు. అయ్యా, చంద్రబాబు నీ హయాంలో కోవిడ్‌ లేదు. ఆ టైమ్‌లో దేశ వృద్ధి రేట్‌ చూస్తే.. కోవిడ్‌ వల్ల, దానికి ముందు 5 ఏళ్లతో పోల్చి చూస్తే.. అన్ని రాష్ట్రాల్లో అది తగ్గింది. అలాగే దేశంలో కూడా చూస్తే.. 10.97 శాతం నుంచి 9.82 శాతానికి వృద్ధిరేటు తగ్గింది.

ఇతర రంగాల్లో గణనీయ పురోగతి:
 2019–24 మధ్య వృద్ధి రేటు మందగించినా.. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు చూస్తే.. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో అది సగటున 11.92 శాతం ఉంటే, 2019–24 మధ్య అది 12.61 శాతం నమోదైంది. అది సోషియో ఎకనామిక్స్‌ రిపోర్ట్‌లోనే ఇది స్పష్టంగా ఉంది. 2018–19 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో జీవీఏ 1,88,601 కోట్లు అయితే, 2023–24 లో అది రూ.3,41,485 కోట్లు. అలాగే పారిశ్రామిక ఉత్పత్తి విలువలో 2014–19 మధ్య దేశంలో రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, మన హయాంలో 2023–24 నాటికి 8వ స్థానానికి వచ్చాం. అదే సమయంలో జీవీఏ పోల్చి చూస్తే, ఏపీ ఉత్పత్తి విలువ 12.6 శాతం ఉంటే, దేశ సగటు అది 8.17 శాతమే. అంటే 4 శాతం ఎక్కువ.

ఉద్యోగావకాశాలు, తలసరి ఆదాయాల పోలిక:
ఎంఎస్‌ఎంఈ సెక్టర్‌లో చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కేవలం 8,67,537 ఉద్యోగావకాశాలు వస్తే.. 2019–24 మధ్య 32,79,770 ఉద్యోగావకాశాలు వచ్చాయి. అలాగే భారీ, అతిభారీ పరిశ్రమల రంగం ద్వారా మా హయాంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం. చంద్రబాబు హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.154,031 కాగా, మా హయాంలో అది రూ.2,42,470. చంద్రబాబు హయాంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే, మా హయాంలో 15వ స్థానానికి ఎదిగింది. వాస్తవాలు ఇలా ఉంటే, తన హయాంలో కంటే, వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జీడీపీ పడిపోయిందని మాత్రమే చెబుతాడు. మిగిలిన అన్ని రంగాలు చాలా బాగున్నాయని చెప్పడు. తన హయాంలో కోవిడ్‌ లేదని చెప్పడు. పెరిగిన ఉద్యోగావకాశాలు పెరిగాయని చెప్పడు.

సూపర్‌సిక్స్‌ అమలు లేదు:
సూపర్‌సిక్స్‌ పథకాలు అమలు చేయడం లేదు. దాంట్లో చాలా చిన్న అంశం గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ. అందులో పెద్దవి ఏమిటంటే.. చిన్నపిల్లలకు నీకు రూ.15 వేలు అని, వాళ్ల అమ్మ కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో అత్త కనిపిస్తే నీకు రూ.48 వేలు.. సంతోషమా? ఇంట్లో పిల్లాడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.20 వేలు అనేవారు. అవన్నీ పెద్దవి. అందులో మోసం చేశారనుకుంటే.. చిన్నవైనా గ్యాస్‌ సిలిండర్లు. మహిళలకు ఉచిత బస్సు. సిలిండర్లపై ఒక్కొ క్కరు ఒక్కోమాట. రాష్ట్రంలో యాక్టివ్‌ సిలిండర్లు 1.55 కోట్లు. ఆయిల్‌ కంపెనీల డేటా ఇది. ఆ లెక్కన ఒక్కోటి రూ.895. ఏటా మూడు సిలిండర్లు. మొత్తం కలిపితే రూ.4200 కోట్లు. బడ్జెట్‌లో పెట్టింది రూ.895 కోట్లు. అంటే ఒక సిలిండర్‌ కూడా ఇవ్వరు. ఒక సిలిండర్‌ ఇవ్వాలన్నా రూ.1400 కోట్లు కావాలి. కానీ ఆ కేటాయింపు లేదు. అది దారుణ మోసం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement