విజన్‌ 2047.. ఓ డొల్ల డాక్యుమెంట్‌: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Mohan Reddy Tweet On Chandrababu Vision 2047: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విజన్‌ 2047.. ఓ డొల్ల డాక్యుమెంట్‌: వైఎస్‌ జగన్‌

Published Mon, Dec 16 2024 3:37 AM | Last Updated on Mon, Dec 16 2024 10:33 AM

Ys Jagan Mohan Reddy Tweet On Chandrababu Vision 2047: Andhra Pradesh

మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ధ్వజం

బాబు పాలనలో మొత్తం 3 విజన్లు.. చరిత్రలో నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా?  

ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా కట్టారా? స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేశారా? రైతులకు అండగా నిలిచారా? 

మరి ఇంకెందుకు విజన్‌ డాక్యుమెంట్లు?  

రాష్ట్రం, ప్రజల అవసరాలకు చోటెక్కడ? వాస్తవిక దృక్పథం ఏది? 

ఆయన దృష్టంతా ప్రజలను మోసం చేయడం, మాయ చేయడంపైనే.. 

విజన్‌ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలాడితే జైలుకో, ఆస్పత్రికో పంపిస్తామన్న నాటి స్విట్జర్లాండ్‌ ఆర్థిక మంత్రి పాస్కల్‌  

బాబు 14 ఏళ్ల పాలనలో రెవెన్యూ లోటు మినహా ఎన్నడైనా మిగులు ఉందా? 

ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి.. సంపదను ఆవిరి చేసే సంస్కృతి చంద్రబాబుది 

వైఎస్సార్‌సీపీ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను నీరుగారుస్తూ.. రద్దు చేస్తున్నారు 

మేం సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు 

పేదలను మరింత పేదవాళ్లుగా తయారు చేస్తున్న చంద్రబాబు    

సాక్షి, అమరావతి: విజన్‌ 2047 పేరిట ప్రజలను మభ్యపుచ్చి మాయ చేసేందుకు సీఎం చంద్రబాబు మరోసారి పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం, ప్రజల అవసరాలకు చోటే లేదని ధ్వజమెత్తారు. వాస్తవిక దృక్పథం అంతకన్నా లేద­న్నారు. ఆయన దృష్టి ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్లలో మేనిఫెస్టో హామీల అమలుపై ఉండదని దుయ్య­బట్టారు. ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం, మాయ చేయడం మీదనే ఆయన  ధ్యాసంతా ఉంటుందని మండి­పడ్డారు. ఈ మేరకు ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో జగన్‌ పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే...

 1998లో కూడా చంద్రబాబు విజన్‌–2020 పేరిట డాక్యుమెంట్‌ విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. రైతుల ఆత్మహత్యలు, ఉపాధి లేక వలసలు, ఉద్యోగాలు లేక నిరుద్యోగుల అష్టకష్టాలు.. వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్‌ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రైవేటీకరణ పేరుతో  విలువైన ప్రభుత్వ ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు.

నాడు స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక మంత్రి పాస్కల్‌ హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా విజన్‌ డాక్యుమెంట్ల పేరిట ఇలా అబద్ధాలు చెప్పేవారిని తమ దేశంలో జైలుకో లేకపోతే ఆస్పత్రికో పంపిస్తామని కామెంట్‌ చేశారు. చివరకు ప్రజలు కూడా విజన్‌ 2020 కాదు.. 420 అంటూ చంద్రబాబు తీరును దుయ్యబట్టారు.

2014లో కూడా చంద్రబాబు విడుదల చేసిన విజన్‌ 2029 డాక్యుమెంట్‌ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయింది. తన పరిపాలనలో మొత్తం విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశాడా? ప్రభుత్వా­నికి మేలు జరిగే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా? ఒక్క పోర్టుగానీ ఫిషింగ్‌ హార్బర్లుగానీ కట్టాడా? ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా కట్టారా? స్కూళ్లు బాగు చేశారా? ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేశారా? వ్యవసాయ రంగాన్ని బాగు చేశారా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? మానవ వనరుల అభివృద్ధి మీద, యువత  భవి­ష్యత్తు మీద ఒక్క పైసా అయినా ఖర్చు చేశారా? ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. మరి ఇంకెందుకు ఈ విజన్‌ డాక్యుమెంట్లు?

YS Jagan: మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌

ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ విజన్‌ 2047 పేరిట డాక్యుమెంట్‌ విడుదల చేయడం మరో డ్రామా, స్టంట్‌ కాదా? ప్రజలకు ఇచ్చిన వాగ్దానా­లను గంగలో కలిపిన పాలకుడిని చీటర్‌ అంటారు. 
అంతేగానీ విజనరీ అంటారా?

చంద్రబాబు పాలనలో, ఆయన 14 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడూ రెవెన్యూ లోటే కనిపిస్తుందన్న మాట వాస్తవం కాదా? మరి ఇంకెక్కడి సంపద సృష్టి? ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా? ఆయనకు
సంపద సృష్టించే శక్తి లేదు. సమగ్ర ఆర్థిక నియంత్రణ కూడా లేదు. ఇప్పుడు విజన్‌ 2047 ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్‌ డాలర్లు చేస్తానంటూ చంద్రబాబు చెప్పడం కట్టుకథ కాదా? 

సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి నుంచి వచ్చే 10 ఏళ్లు తీసుకున్నా లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని చంద్రబాబు.. ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపదను ఆవిరి చేసే ఈ బాబు.. ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే 420 అని అంటారు.

మేం ఏం చేశామో చూడండి
రాష్ట్రంలోని సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతూ అసమానతలు రూపుమాపి అందరికీ సమాన అవకాశాలు కల్పించి, సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్సార్‌సీపీ హయాంలో అనేక చర్యలు తీసుకున్నాం. విద్యారంగంలో సీబీఎస్‌ఈ, ఐబీ, పిల్లలకు ట్యాబ్‌లు, వ్యవసాయంలో ఆర్బీకే వ్యవస్థ, ఈ–క్రాప్, ఫామ్‌గేట్‌ వద్దే మద్దతు ధరకు పంటల కొనుగోళ్లు, నాడు–నేడు ద్వారా ఆస్పత్రుల బలోపేతం, కొత్తగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్‌లు, ఉపాధి కల్పనా రంగంలో మైక్రోసాఫ్ట్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఎడెక్స్‌తో ఒప్పందం ద్వారా అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ లాంటి పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాం. 

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబు నీరు గారుస్తున్నారు, రద్దు చేస్తున్నారు. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బ తీశారు. ప్రభుత్వ రంగంలో సృష్టించిన ఆస్తులను తన మనుషులకు అమ్మేయడానికి  ప్రయత్నిస్తున్నారు. 

సమాజంలో అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలన్నింటినీ తీసివేసి పేద­లను మరింత పేదవాళ్లుగా చంద్రబాబు తయారు చేస్తు­న్నారు. మరి చంద్రబాబుకు విజన్‌ ఉందని ఎలా అనుకుంటారు?  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement