![Putta Shivashankar Reddy Comments On Chandrababu And Yellow Media](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Putta-Shivashankar-Reddy1.jpg.webp?itok=8g22c5j9)
సాక్షి, తాడేపల్లి: ఓర్వకల్లు విమానాశ్రయానికి 'ఉయ్యాలవాడ' పేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న డ్రామాలతో ఆయన ప్రచార పిచ్చి పీక్‌కు చేరుకుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నాలుగేళ్ల క్రితమే నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారికంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయం కూడా తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు.. రెడ్డి సంఘం ప్రతినిధుల పేరుతో కొందరిని పిలిపించుకుని వారితో ఒక వినతిపత్రం తీసుకున్నారు. సదరు సంఘం ప్రతినిధులు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్‌కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని, గతంలో ఈ మేరకు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్ హామీ ఇచ్చి విస్మరించారంటూ చంద్రబాబుకు విన్నవించుకున్నారు. వెంటనే చంద్రబాబు చాలా అన్యాయం జరిగింది.. ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరును పెడతానంటూ హామీ ఇచ్చేశారు. ఇదంతా కూడా నిత్యం చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా ఈనాడు పత్రికలో పెద్ద ఎత్తున ప్రచురించారు. ఈ కథనంలో చంద్రబాబును కలిసిన ఆ రెడ్డి సంఘం ప్రతినిధులు ఎవరో కూడా వెల్లడించకుండా ఈనాడు పత్రిక జాగ్రత్త పడింది.
నిత్యం వైఎస్ జగన్‌పై బురద చల్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు తాజాగా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు అంటూ చేసిన హంగామా ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోంది. గతంలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్ట్‌కు ఉయ్యాలవాడ పేరును ప్రకటించడంతో పాటు, అధికారికంగా ఉత్తర్వులు జారీ జారీ చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసు.
మార్చి 25, 2021న ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేస్తూ విమానాశ్రయానికి బ్రిటీష్ వారిపై పోరు సల్పిన మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్టు బహిరంగ సభలో ప్రకటించారు. దీనిని అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. అంతేకాకుండా దీనిపై మే 16, 2021న నాటి వైయస్ జగన్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 21ని విడుదల చేసింది.
వాస్తవానికి రాష్ట్రంలో కేవలం 6 విమానాశ్రయాలుంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి వాటి పేర్లు కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. స్వాతంత్ర కాంక్షను ప్రజల్లో రగిలించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఓర్వకల్లు విమానాశ్రయంకు పెట్టి నాలుగేళ్లు అయ్యిందని తెలిసి కూడా తెలియనట్లు వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లింది. చివరికి తన ప్రచార యావ, వైఎస్ జగన్‌పై విషప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో మహనీయుల పట్ల కూడా అగౌరవంగా వ్యవహరించిన చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎప్పుడైనా జాతికి మార్గదర్శకులుగా వ్యవహరించిన మహనీయుల విషయంలో స్పందించే సమయంలో వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని, ముఖ్యమంత్రి హోదాకు ఉన్న గౌరవాన్ని దిగజార్చకూడదని సూచిస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment