
వైఎస్ జగన్ వద్దకు వస్తున్న ప్రజల్ని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్ వద్దకు వస్తున్న ప్రజల్ని చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతుందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభూత కల్పనలు సృష్టించి ప్రజలు తప్పుడు సంకేతాలు పంపేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు జగన్ ఆఫీస్‌పై దాడి చేశారనడం అబద్ధమని స్పష్టం చేశారు.
‘‘తమ సమస్యలు చెప్పుకోవడానికే జగన్ వద్దకు వచ్చారు. ప్రతి ఒక్కరూ బాబు దుష్టపాలనను జగన్‌కు వివరిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట జనం నడుస్తున్నారనే ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజా నాయకుడే. ప్రజల మనసు నుంచి వైఎస్ జగన్‌ను తొలగించడం టీడీపీకి, ఎల్లో మీడియాకు సాధ్యం కాదు’’ అని చెవిరెడ్డి చెప్పారు.
ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి: సాంబశివారెడ్డి
ఇది చేతకాని ప్రభుత్వం.. చేతగానితనాన్ని ప్రజలు జగన్‌కు వివరిస్తున్నారనే దుష్ప్రచారం మొదలు పెట్టారని వైఎస్సార్‌సీపీ నాయకులు సాంబశివారెడ్డి ధ్వజమెత్తారు పులివెందుల కార్యాలయంపై దాడి జరిగింది అనడం పూర్తి అబద్ధం. ఇలా ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ ఏడు నెలల్లో ఈ ప్రభుత్వం పూర్తి ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంది. ఆ విషయాన్నే ప్రజలు జగన్‌కి వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు. జగన్ ఓపికగా నిలబడే ఉదయం నుంచి వారి సమస్యలు వింటున్నారు. పచ్చ మీడియా ఇకనైనా ఇలాంటి పిచ్చి రాతలు మానుకోవాలి’’ అని సాంబశివారెడ్డి హెచ్చరించారు.
చౌక బారు రాజకీయాలు మానుకోవాలి: సతీష్‌కుమార్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో ఆయన పలకరింపు కోసం జనం బారులు తీరారు. సెల్ఫీల కోసం యువకులు ఎగబడ్డారు. పులివెందుల కార్యాలయంపై ఎలాంటి దాడి జరగలేదు. ఎల్లో మీడియా సిగ్గులేకుండా దుష్ప్రచారం చేస్తోంది. పులివెందుల నుంచి తాతి రెడ్డి పల్లెకు 25 కిలోమీటర్లు మాత్రమే. దారి పొడవునా వేలాది మంది ప్రజలను పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. తాతిరెడ్డి పల్లెకు చేరుకోవడానికి 7గంటల సమయం పట్టింది. జన సందోహం మధ్య కార్యకర్తలను చెదరగొట్టే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు అద్దాలపై పడ్డారు. చిన్న ఇష్యూను దాడి అంటూ ఎల్లో మీడియా స్క్రోలింగ్‌లు వేయడం విడ్డూరం. చౌక బారు రాజకీయాలు మానుకోవాలి’’ అని సతీష్‌కుమార్‌రెడ్డి హితవు పలికారు.