![Manohar Reddy Strongly Condemned Misuse Of Police Force For Political Vendetta](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Manohar-Reddy-Strongly-Cond.jpg.webp?itok=NX8RTsyD)
సాక్షి, తాడేపల్లి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టులో కచ్చితంగా కుట్ర కోణం ఉందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు వెనుకుండి నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవర్ధన్ స్టేట్‌మెంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు.
సాంకేతికంగా చూస్తే హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్‌ను విచారించలేదని పేర్కొన్నారు. టీడీపీ కక్షసాధింపులకు వత్తాసు పలుకుతున్న పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను దాదాపు 90 మందిని అక్రమంగా ఇరికించారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరి 10వ తారీఖున కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చారు.
కేసు వెనక్కి తీసుకోవాలని నిన్ను ఎవరైనా బెదిరించారా అని జడ్జి ప్రశ్నించినప్పుడు కూడా నా అంతట నేనే ఇష్టపూర్వకంగానే వచ్చానని సత్యవర్ధన్ చెప్పిన మాటలను జడ్జి రికార్డు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ కేసులో ఎలాగైనా ఇరికించాలని భావించిన తెలుగుదేశం నేతలు సత్యవర్ధన్ వాగ్మూలంతో ఉలిక్కిపడ్డారు. సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రలోభాలు పెట్టారు. ఫిబ్రవరి 12న సత్యవర్ధన్ సోదరుడితో నా తమ్ముడ్ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేయించి మరో కేసు పెట్టారు. ఈ కేసు ఆధారంగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ వెళ్లి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ అడిగితే చిత్తు పేపర్ మీద అక్కడిక్కడే పెన్నుతో రాసి ఒక నోటీస్ ఆయన చేతుల్లో పెట్టారు.
![YSRCP లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి వ్యాఖ్యలు](https://www.sakshi.com/s3fs-public/inline-images/td_5.jpg)
విశాఖలో సత్యవర్థన్‌ను కాపాడామంటూ కొత్త డ్రామా
ఫిబ్రవరి 13వ తేదీన సత్యవర్ధన్‌ను విశాఖలో కాపాడామని పోలీసులు కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ సీసీ టీవీ వీడియో చూస్తే సత్యవర్ధన్‌ను బెదిరించి పోలీసులే లాక్కుని వెళ్తున్నట్టు ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో పోలీసుల పాత్రపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే సత్యవర్ధన్‌ను పోలీసులు విశాఖ నుంచి తీసుకొచ్చారు. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు సెక్షన్లు నమోదు చేయాలి. కానీ సాంకేతికంగా చూస్తే సత్యవర్ధన్‌ను విచారించకుండానే వంశీకి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్
వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే పోలీసులు విశాఖలో సత్యవర్ధన్‌ను పట్టుకొచ్చారని అర్థమవుతోంది. ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్‌గా వంశీని కేసులో ఇరికించడానికే టీడీపీ పన్నాగం పన్నింది. ముందుగా అనుకున్నట్టుగా నాన్ బెయిలబుల్, జీవితఖైదుకు సంబంధించిన సెక్షన్లతో పోలీసులు కేసులు సిద్దం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వంశీని విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు, నోటీస్ ఇవ్వడం తప్ప.. ఏ కేసులో, ఎందుకు తీసుకొచ్చింది, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదు. నాలుగైదు స్టేషన్లలో తిప్పి రాత్రి 11.45గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చి, 12 గంటలకు ఎఫ్ఐఆర్ రాశారు. ఈ మధ్యలో వంశీని ఎలా ఇబ్బంది పెట్టాలో చంద్రబాబు, లోకేష్, డీజీపీ చర్చించుకున్నట్టుగా అర్థం అవుతోంది.
చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే..
ఈ తతంగమంతా చూస్తుంటే న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టుగానే పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. ఎలా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు అధికారులుగా ఎవరుండాలి, దర్యాప్తు చేసి ఏ స్టేట్‌మెంట్ ఇవ్వాలి. ఎవరెవర్ని సాక్ష్యులుగా తీసుకోవాలి, ఎవర్ని కేసుల్లో ఇరికించాలి, ఇలాంటివన్నీ కూటమి నాయకులే చెప్పడం దానిని పోలీసులు తుచ తప్పకుండా అమలు పరచడం కనిపిస్తోంది.
ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పోలీసులకు ఇదే పని. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, సానుభూతి పరులను అక్రమ కేసులతో వేధించి జైలు పాలు చేయడం, వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం చేస్తున్నారు.
న్యాయస్థానాలంటే గౌరవం లేదు
చట్టాలన్నా, న్యాయస్థానాలన్నా కూటమి ప్రభుత్వానికి భయం కానీ, గౌరవం కానీ లేదని ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన ఎన్నో ఘటనలు రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల్లో పోలీస్ స్టేషన్లకు చెందిన సీసీ టీవీ ఫుటేజ్‌లు అడిగితే ఇవ్వనందుకు సాక్షాత్తు హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఎప్పుడడిగినా ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటున్నారని, మా ఆదేశాలను ధిక్కరిస్తే డీజీపీనే కోర్టుకు రప్పిస్తామని గట్టిగా హెచ్చరించింది. హైకోర్టు ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం లెక్క చేయడం లేదంటే న్యాయస్థానాల మీద వారికున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
దెందులూరులో ఒక పెళ్లి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తన కారుకు అడ్డం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితోపాటు ఆయన డ్రైవర్, ఇతర అనుచరుల మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. ఎమ్మెల్యేనే దారుణంగా దుర్భాషలాడి తిరిగి ఆతనే వైయస్సార్సీపీ నాయకుల మీద కేసులు పెట్టించాడు. నిందితులే బాధితులపై కేసులు పెడుతున్న దారుణాలు నిత్యం జరుగుతున్నాయి.
తాము అనుసరిస్తున్న విధానాలు కరెక్టో కాదో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మేం చేయబోయే పోరాటంలో పోలీసులే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. డీజీపీ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు తప్పు చేసింది ఎవరైనా వదిలే ప్రసక్తే ఉండదు. చీఫ్ సెక్రటరీ దగ్గర్నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందర్నీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం.
Comments
Please login to add a commentAdd a comment