అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతేకాదు.. రాబోయే కాలంలో ఆయన పాలనలో మస్క్ కీలక పాత్ర సైతం పోషించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే.. అలాంటి వ్యక్తిపై ట్రంప్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదీ.. ప్రత్యర్థుల విమర్శల నేపథ్యంలో..
ప్రపంచంలో అత్యధిక సంపద కలిగి ఉన్న ఎలాన్ మస్క్‌ను.. అమెరికాకు షాడో ప్రెసిడెంట్‌గా పేర్కొంటూ ఓ ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ ఈ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తోంది. ప్రజలచేత ఎన్నుకోబడని ఓ వ్యక్తి(ఎలాన్ మస్క్).. అధికారం చెలాయించేందుకు సిద్ధమైపోతున్నాడు. రాబోయే రోజుల్లో అమెరికా ఆదాయ వ్యవహారాలన్నింటిని ప్రెసిడెంట్ మస్క్ చేతుల మీదుగానే నడుస్తాయి అంటూ ఎద్దేవా ప్రకటనలు చేస్తోంది. ఈ తరుణంలో..
ఆదివారం అరిజోనా ఫీనిక్స్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ట్రంప్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘‘ఎలాన్ మస్క్ ఏదో ఒకనాటికి అమెరికా అధ్యక్షుడు కాకపోతాడా?’’ అని ప్రశ్నించింది. దానికి ఆయన ‘నో’ అనే సమాధానం ఇస్తూ కారణం వివరించారు.
‘‘అతడు అధ్యక్షుడు కాలేడు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నా. ఎందుకంటే.. అతను ఈ దేశంలో పుట్టలేదు. కాబట్టి అది ఏనాటికి జరగదు’’ అని చెప్పారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఆ దేశ గడ్డపై పుట్టిన వ్యక్తి మాత్రమే అధ్యక్షుడు కాగలడు. ఎలాన్ మస్క్ సౌతాఫ్రికాలో పుట్టాడు.
ఇదిలా ఉంటే.. రిపబ్లికన్ పార్టీలోనూ మస్క్‌కు వ్యతిరేక వర్గం తయారవుతున్నట్లు సమాచారం. ఓ ప్రభుత్వ ఫండింగ్ ప్రతిపాదనను తిట్టిపోస్తూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీటే అందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment