‘‘అయ్యా ట్రంప్‌.. ఇలాంటి బతుకులెందుకు?’’ | Negative Reactions And Criticism On Trump Gaza AI Video | Sakshi
Sakshi News home page

‘‘అయ్యా ట్రంప్‌.. ఇలాంటి బతుకులెందుకు?’’

Published Thu, Feb 27 2025 1:57 PM | Last Updated on Thu, Feb 27 2025 3:07 PM

Negative Reactions And Criticism On Trump Gaza AI Video

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విజన్‌పై అరబ్‌ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ‘ట్రంప్‌ గాజా’ అంటూ ఆయన తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహాజనితమైన గాజా.. వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని.. అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానేకాదని పలువురు మండిపడుతున్నారు.

ఆకాశన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసి పోయే గాజా, నియంతృత్వ ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్‌ మస్క్‌, డబ్బులు వెదజల్లే పిల్లలు,  అటు పబ్‌లో డ్యాన్సర్లతో.. ఇటుపై ఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహూతో ట్రంప్‌ చొక్కాల్లేకుండా సేదతీరుతున్న దృశ్యాలను.. వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో షేర్‌ చేశారు.

అయితే ట్రంప్‌ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్‌(AI Generated Video) వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో సభ్యుడు బసీమ్‌ నయీమ్‌ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ట్రంప్‌ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటోంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్మిర్మాణం. అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని. అంతేగానీ బంధీఖానాల్లో ఉండాలని కాదు. మేం పోరాడేది బంధీఖానాల్లో పరిస్థితులు మెరుగుపడాలని కాదు. అసలు జైలు, జైలర్‌ లేకుండా చూడాలని’’ అని నయీమ్‌ అంటున్నారు.

మరోవైపు ఈ వీడియోలో మస్క్‌, నెతన్యాహూ ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్‌ పక్కనపెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 

👉2023 అక్టోబర్‌ 07వ తేదీన హమాస్‌(Hamas) సంస్థను ఇజ్రాయెల్‌పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1,200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్‌ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా.. ఇందులో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది. మరోవైపు.. ఈ యుద్ధ వాతావరణంతో  90 శాతం గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా.. ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.

👉ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పలు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బంధీలను హమాస్‌.. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తైతే హమాస్‌ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 

👉మరోవైపు.. గాజా పునర్మిర్మాణం కోసం ట్రంప్‌ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి(వెలేసి).. గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారాయన. దీనికి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మద్ధతు ప్రకటించగా.. అరబ్‌ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్‌లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్‌ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం లేకపోలేదు.

ఇదీ చదవండి: సారీ.. ఆయన కింద పని చేయలేం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement