మస్క్‌... ట్రంప్‌కు కోటి డాలర్లు ఎందుకు ఇస్తానన్నాడు? | Elon Musk X Settles Donald Trump Lawsuit Over Account Suspension, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

మస్క్‌... ట్రంప్‌కు కోటి డాలర్లు ఎందుకు ఇస్తానన్నాడు?

Published Thu, Feb 13 2025 7:45 AM | Last Updated on Thu, Feb 13 2025 11:01 AM

Elon Musk X settles Donald Trump lawsuit over account suspension

వాషింగ్టన్‌: అమెరికాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఎక్స్‌(ట్విట్టర్‌)పై ట్రంప్‌ దావా వేసిన కారణంగా తాజాగా ఎలాన్‌ మస్క్‌ ఆయనకు దాదాపు 10 మిలియన్‌ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2021లో యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడి అనంతరం ట్రంప్‌ ఈ దావా వేశారు.

వివరాల ప్రకారం.. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Donald Trump) పరాజయం పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ (Joe Biden) విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్‌ క్యాపిటల్‌ భవనంలో కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్‌ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకే క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్‌షీట్‌లో ట్రంప్ పేరు కూడా ఉంది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను ఎక్స్‌(ట్విట్టర్‌), ఫేస్‌బుక్‌.. ట్రంప్‌ అకౌంట్స్‌ను సస్పెండ్‌ చేసింది. దీంతో, వారి చర్యలను ఆయా సంస్థలపై ట్రంప్ దావా వేశారు. ఈ దావాను పరిష్కరించుకునేందుకు 25 మిలియన్‌ డాలర్లు చెల్లిస్తామని గత నెలలో మెటా ప్రకటించింది. ఇక, తాజాగా మస్క్‌(Elon Musk) కూడా ట్రంప్‌కు 10 మిలియన్‌ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. యూఎస్ క్యాపిటల్‌పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ ఘటనలో దాదాపు 1500 మందికి ట్రంప్‌ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్‌కు ఆదేశాలు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement