
ఔగాడౌగౌ: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అధిక సంఖ్యలో సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానిక అధికారుల సమాచారం మేరకు.. బుర్కినా ఫాసోలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఉత్తర బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఇందులో సైనిక స్థావరంతో పాటు డజిబో పట్టణం సైతం ఉంది. బుర్కినా ఫాసో సహెల్ ప్రాంతంలో తీవ్రవాదం పేట్రేగిపోతున్న సమయంలో అక్కడ యాక్టివ్‌గా ఉన్న అల్ ఖైదా అనుబంధ గ్రూప్ జేఎన్‌ఐఎమ్ ఈ దాడికి పాల్పడింది.
ఏక కాలంలో ఎనిమిది ప్రాంతాల్లో దాడులు
జేఎన్‌ఐఎమ్ ముష్కరులు ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపినట్లు ఓ సహాయ కార్యకర్త తెలిపారు. ముష్కరులు బుర్కినా ఫాసో ఎయిర్‌పోర్టును ధ్వంసం చేసే లక్ష్యంతో ఈ దాడికి తెగబడ్డారు. ముందుగా డజిబో నగరంలోకి ప్రవేశించే దారుల్ని నిర్బందించారు. అనంతరం సైనిక శిబిరాలపై దాడి చేశారు. స్పెషల్ యాంటీ టెర్రరిజం యూనిట్ శిబిరాల్లో బీభత్సం సృష్టించారని చెప్పారు.
Presidente de Burkina Faso, Ibrahim Traoré, gran líder de África que lucha contra el colonialismo de Francia, Alemania, Israel y EEUU. pic.twitter.com/s2uFuVA7pP
— El Fantasma (@AlTopeyPunto198) May 13, 2025
అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా సహెల్
బుర్కినా ఫాసో దేశంలో సైనిక పాలన కొనసాగుతుంది. ఆఫ్రికాలోని 11 దేశాల భూ భాగాల్లో సహెల్ ప్రాంతం ఒకటి. ఆ 11 దేశాల్లో 2.3 కోట్ల జనాభా ఉన్న బుర్కినా ఫాసో ఒకటి. అయితే ఆఫ్రికా దేశాల్లో సహెల్ ప్రాంతం అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దాదాపు సగానికి పైగా భూభాగంపై సైనిక ప్రభుత్వం పట్టును కోల్పోయింది. అనునిత్యం బుర్కినా ఫాసో దేశాన్ని ఆక్రమించేందుకు ఆల్‌ఖైదాలాంటి ఉగ్ర సంస్థలు మారణహోమం సృష్టిస్తూనే ఉంటాయి. ఈ హింస వల్లే 2022లో రెండు సార్లు భారీ ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశ భద్రతా దళాలు కూడా చట్టవిరుద్ధమైన హత్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.