దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల బారిన పడిన అసోం, అరుణాచల్ రాష్ట్రాల ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా అసోంలో సుమారు మూడు లక్షలమంది నిరాశ్రయులుగా మారగా, 60 మంది మృత్యువాత పడ్డారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరిగింది. ఫలితంగా నగాంవ్, డిబ్రుగఢ్ తదితర జిల్లాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
మరోవైపు ఉత్తరాఖండ్‌లోని అలకనందా నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో సమీపప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో జూలైలో సాధారణం కన్నా అధికవర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. జూన్‌లో సాధారణంకన్నా 11 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment