
అబుజా: నైజీరియాలోని జంఫారాలో పడవ బోల్తా పడిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని గుమ్మి-బుక్కుయుమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ శాసనసభ్యుడు సులేమాన్ గుమ్మి ఈ విషయాన్నితెలియజేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారన్నారు. జాంఫారాలోని గుమ్మి పట్టణ సమీపంలోని నదిలో పడవ బోల్తా పడిందని ఆయన తెలిపారు.
ప్రయాణికులు రోజూ పడవను తీసుకుని సమీప ప్రాంతంలోని తమ పొలాలకు వెళ్లేవారని గుమ్మి చెప్పారు. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. వారు 12 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జంఫారా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి హసన్ దౌరా మీడియాతో మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు.
జంఫారా ప్రావిన్స్‌లో రైతులు తమ భూముల దగ్గరకు పడవలో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు బోలా టినుబు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యవసర ఏజెన్సీలను ఆదేశించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్‌లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాలు మొదలైనవి ప్రమాదాలకు కారణాలవుతుంటాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: జలమార్గాన ప్రపంచయానం