ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.
డబ్బు ఆదా అవుతుందట!
తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment