Israel: నెతన్యాహు నెగ్గుకొచ్చేనా? | Growing Opposition Among Israelis Over The Failure Of The Netanyahu Government | Sakshi
Sakshi News home page

Israel: నెతన్యాహు నెగ్గుకొచ్చేనా?

Published Wed, Sep 4 2024 9:13 AM | Last Updated on Wed, Sep 4 2024 10:06 AM

Growing Opposition Among Israelis Over The Failure Of The Netanyahu Government

నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరి

ఇజ్రాయెలీల్లో నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకత

తప్పుకోవాలంటూ మిన్నంటుతున్న నిరసనలు

నెతన్యాహూ హయాంలో నిత్యం ఆందోళనలే

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: ఇజ్రాయెలీల ఆక్రోశం, ఆక్రందనలు క్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని పీఠానికి ఎసరు పెట్టేలా కని్పస్తున్నాయి. హమాస్‌ చెరనుంచి ఇజ్రాయెలీ బందీలను విడిపించడంలో నెతన్యాహు సర్కారు వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. తాజాగా ఆగస్టు 31న ఆరుగురు బందీలను గాజాలో ఉగ్రవాదులు పాశవికంగా హతమార్చడంతో ఇజ్రాయెలీలు భగ్గుమంటున్నారు. సోమవారం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని స్తంభింపజేశారు. నెతన్యాహూ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కోర్టు జోక్యం చేసుకుంటే గానీ వెనక్కు తగ్గలేదు. ఈ నిరసనలు చివరికి నెతన్యాహూ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడతాయా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.. 

2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి తెగబడ్డ హమాస్‌ 1,200 మందికి పైగా పొట్టన పెట్టుకోవడమే గాక 250 మందిని బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. ఖైదీల మారి్పడి కింద 100 మందిని విడిపించారు. 35 మందికి పైగా చనిపోయినట్టు భావిస్తుండగా 100 మందికి పైగా ఇంకా హమాస్‌ చెరలోనే మగ్గుతున్నారు. వాళ్లను విడిపించేందుకు ఇటీవల ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన తాజా ప్రయత్నం వికటించడం, ఆరుగురు బందీలను హమాస్‌ చంపేయడం తెలిసిందే. దీనిపై ఇజ్రాయేలీల్లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. బందీలను విడిపించడంలోనే గాక గాజాలో కాల్పుల విరమణలో కూడా ప్రధానిగా బెంజమిన్‌ నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో అతిపెద్ద  కార్మిక సంఘం హిస్ట్రాడుట్‌ ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపు సోమవారం దేశాన్ని స్తంభింపజేసింది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం మొదలయ్యాక దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఇదే అతి పెద్దది. దాని దెబ్బకు బెన్‌ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయాలు, షాపింగ్‌ మాల్స్, ఓడరేవులనూ మూసివేశారు. నిరసనలు సాయంత్రం దాకా కొనసాగాయి. నిరసనకారులు నెతన్యాహూ నివాసాన్ని కూడా ముట్టించారు. అమెరికా ఎంబసీ ముందు బైఠాయించారు. అయలాన్‌ హైవేను దిగ్బంధించారు. దాంతో వారిపైకి పోలీసులు వాటర్‌ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది. విధ్వంసానికి, అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ టెల్‌ అవీవ్‌లో 29 మందిని అరెస్టు చేశారు. చివరికి లేబర్‌ కోర్టు ఆదేశాలతో సమ్మె ఆగింది. ఇజ్రాయెలీల నిరసనల వెల్లువను తట్టుకుని నిలవడం నెతన్యాహూకు కష్టమేనంటున్నారు.

పెరుగుతున్న వ్యతిరేకత.. 
యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలన్న నెతన్యా హు వైఖరిపై విమర్శలు నానాటికీ పెరుగుతున్నా యి. ఇజ్రాయెల్‌ విపక్ష నేత యైర్‌ లాపిడ్‌ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. యుద్ధ విషయమై నెతన్యాహు తీసుకున్న, తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సొంత కేబినెట్‌లోనే వ్యతిరేకత ప్రబలుతోంది. బందీలను విడిపించే ఒప్పందం కుదు ర్చుకోవడం కంటే కారిడార్‌ నియంత్రణకే ప్రాధాన్యమిస్తుండటం సరికాదని రక్షణ మంత్రి యెవ్‌ గాలెంట్‌ బాహాటంగానే విమర్శించారు. దీన్ని ‘నైతికంగా అవమానం’గా అభివరి్ణంచారు. బందీల ఒ ప్పందంపై గానీ, కాల్పుల విరమణపై గానీ నెత న్యాహుకు ఎలాంటి ఆసక్తి లేదని ఇజ్రాయెల్‌ మాజీ రాయబారి, ప్రభుత్వ సలహాదారు అలోన్‌ పింకస్‌ ఆరోపించారు. ‘‘ఆశ్చర్యంగా అని్పంచినా ఇదే నిజం. ఒప్పందానికి నెతన్యాహూ విముఖత వల్లే బందీలు బలవుతున్నారు’’ అని మండిపడ్డారు.

తగ్గుతున్న మద్దతు..
మరోవైపు నెతన్యాహుకు మద్దతు కూడా నానాటికీ తగ్గుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని మెజారిటీ ఇజ్రాయెలీలు భావిస్తున్నట్లు గత శుక్రవారం ఛానెల్‌ 12 చేసిన సర్వేలో తేలింది. ఆయన మళ్లీ పోటీ చేయొద్దని 69 శాతం పేర్కొనగా కేవలం 22 శాతం మంది మాత్రమే మళ్లీ ఎన్నికల బరిలో దిగాలని కోరుతున్నారు.

నిత్యం నిరసనలే..
ఇజ్రాయెల్‌ చరిత్రలోనే అత్యంత అతివాద సంకీర్ణ సర్కారుకు నెతన్యాహూ నేతృత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో ఆయన గద్దెనెక్కిన నాటినుంచీ దేశంలో తరచూ నిరసనలూ, ఆందోళనలూ కొనసాగుతూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు అధికారాలకు భారీగా కత్తెర వేసేందుకు ఉద్దేశించిన న్యాయ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏడాది కింద జనం భారీగా రోడ్డెక్కారు. చివరికి ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక హమాస్‌ ఆటవిక దాడి అనంతరం నెతన్యాహూ ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ గత అక్టోబర్‌ నుంచి రాజధాని మొదలుకుని దేశంలో ఏదో ఒక మూల నిత్యం ఆందోళనలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌తో ఒప్పందానికి అంగీకరిస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా కొన్ని సంకీర్ణ పక్షాలు బెదిరిస్తున్నాయి. దీనికి తోడు నెతన్యాహూపై అవినీతి, మోసం, నమ్మకద్రోహం తదితర అభియోగాలపై విచారణలు కోర్టుల్లో పలు దశల్లో ఉన్నాయి.

ఎన్నికలకు మరో రెండేళ్లు..
ఇజ్రాయెల్‌లో ఎన్నికలకు మరో రెండేళ్ల గడువుంది. ఆలోపు నెతన్యాహూపై విపక్షం అవిశ్వాసం పెట్టాలన్నా కనీసం ఐదుగురు పాలక సంకీర్ణ సభ్యుల మద్దతు అవసరం.

నెతన్యాహు.. తగ్గేదేలే..
నెతన్యాహు మాత్రం వెనక్కు తగ్గేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే తన లక్ష్యమని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలన్న నిరసనకారుల డిమాండ్లను, మంత్రివర్గ సహచరుల విజ్ఞప్తులను నెతన్యాహూ తోసిపుచ్చారు. ‘‘ఆరుగురు బందీలను ఉరి తీశారు. అయినా కసి తీరక తల వెనుక భాగంలో కాల్చారు. వాళ్లతో రాయబారాలా?’’ అని ప్రధాని ప్రశి్నస్తున్నారు. కొన్ని మినహాయింపులతోనైనా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనాలన్న సూచనకు ససేమిరా అంటున్నారు.

దీనిపై ఇటీవల మరింత కఠిన వైఖరి తీసుకున్నారు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ పూర్తిగా వైదొలగాలన్న హమాస్‌ డిమాండ్‌కు ఒప్పుకునేదే లేదంటున్నారు. బందీలను కాపాడలేకపోయినందుకు క్షమాపణ చెప్పిన నెతన్యాహూ, యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయ సమాజమే హమాస్‌పై మరింత ఒత్తిడి తేవాలంటూ కుండబద్దలు కొట్టారు. బందీల విడుదలకు తాను తగినంత కృషి చేయడం లేదన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘‘ఈ విషయంలో నాకంటే నిబద్ధత కలిగిన వారెవరూ లేరు. దీనిపై నాకెవరూ ఉపన్యాసం ఇవ్వనక్కరలేదు’’ అన్నారు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement