ఇజ్రాయెల్‌లోని అణు కేంద్రంపై దాడి చేస్తాం: ఇరాన్‌ సంచలనం | Iran threatens hit at Israel's Dimona nuke site | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లోని అణు కేంద్రంపై దాడి చేస్తాం: ఇరాన్‌ సంచలనం

Mar 5 2026 10:33 AM | Updated on Mar 5 2026 12:10 PM

Iran threatens hit at Israel's Dimona nuke site

టెహ్రాన్: ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రంపై దాడి చేస్తామని ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ పార్థివ దేహాన్ని ఉంచేందుకు టెహ్రాన్ గ్రాండ్ మోసల్లాలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఇరాన్ ప్రభుత్వ మీడియా పలు వివరాలు తెలిపింది.

సుప్రీం లీడర్‌కు తుది వీడ్కోలు తెలపడంలో భాగంగా 3 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది సంతాపం తెలిపేందుకు మోసల్లా వద్దకు చేరుకునే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ మరణం తర్వాత సాధారణంగా “వీడ్కోలు కార్యక్రమం”, ఆ తర్వాత “అంతిమ యాత్ర” నిర్వహించడం అక్కడి ఆచారం.

ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూల్చే ప్రయత్నం జరిగితే ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటామని గురువారం ఇరాన్ హెచ్చరించింది.

ఇరాన్‌లో కొత్త సుప్రీం లీడర్‌ వస్తే అతడిని కూడా టార్గెట్‌ చేస్తామంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిమోనా అణు కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తామంటూ ఇరాన్‌ హెచ్చరించడం గమనార్హం. ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ మరోసారి దాడులు ప్రారంభించింది. మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలు, జెరూసలేం పరిసరాలు, పశ్చిమ తీర ప్రాంతం భాగాల్లో సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఆపరేషన్ ప్రారంభించామని ఇరాన్‌ పేర్కొంది.

అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన 7కు పైగా ఆధునిక రాడార్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఈ దాడులతో ఆ దేశాల నిఘా వ్యవస్థలు పనిచేయకుండా చేశామని పేర్కొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థను ఛేదించి మరీ దూసుకెళ్లి పలుచోట్ల తాకినట్లు ఐఆర్‌జీసీ పేర్కొంది. టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ భవనాల సముదాయం, బెన్ గురియన్ విమానాశ్రయం కూడా లక్ష్యాల్లో ఉన్నాయని తెలిపింది.

ఈ థాడ్ క్షిపణి నిరోధక వ్యవస్థ అమెరికాకు చెందింది. గగనతలంలో శత్రుదేశాల క్షిపణులను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఇది. వాటిని దాటుకుని మరీ తమ క్షిపణులు దూసుకెళ్లాయని ఇరాన్‌ అంటోంది. ఐఆర్‌జీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌ కొనసాగిస్తున్న క్షిపణి-డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్‌లోఏని అనేక ప్రాంతాల్లో గంటల తరబడి సైరన్‌లు మోగాయి. ప్రజలు చాలాసేపు సురక్షిత ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయని ఇరాన్‌ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement