1903లో పోస్టు చేస్తే 121 ఏళ్లకు చేరిన వైనం
ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్ల కాలం. కానీ వందేళ్ల కిందట సమాచారం చేరవేతకు ఏకైక మార్గం పోస్టే. ఒక లెటర్ చేరడానికి మూడు నుంచి వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల నుంచి నెల దాకా కూడా పట్టేది. కానీ ఒక పోస్ట్‌కార్డు చేరడానికి ఏకంగా 121 ఏళ్లు పట్టింది! 1903లో పోస్ట్ చేసిన ఆ లేఖ శతాబ్దం ఆలస్యంగా చేరుకుంది. బ్రిటన్‌లో స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ అడ్రస్‌తో ఉన్న ఈ క్రిస్మస్ థీమ్ కార్డు క్రాడాక్ స్ట్రీట్ శాఖకు గతవారం చేరింది. ఆ చిరునామాలో గతంలో నివసించిన మిస్ లిడియా డేవిస్ బంధువులను కనిపెట్టి ఈ కార్డు ఎవరికి రాసిందో తెలుసుకుని వాళ్లకు చేర్చాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్ అనే వ్యక్తి లిడియాకు రాశారు.
స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో 121 ఏళ్ల కిందట ఆండ్రూ డల్లీ తన భార్య మరియాతో కలిసి నివసించారు. వారి ఆరుగురు పిల్లల్లో పెద్ద కూతురు లిడియా. ఈ పోస్టు కార్డు పంపిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. వారి కుటుంబం గురించిన సమాచారం ఆన్‌లైన్‌లో చాలా తక్కువగా ఉందని స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ వర్గాలన్నాయి. ఆమెతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుగొని లేఖను అందజేస్తామని చెప్పుకొచ్చాయి.
లేఖలో ఏముందంటే..
‘డియర్ ‘ఎల్’.. నన్ను క్షమించండి. నేనా జత (ఏదో తెలియని వస్తువు) తీసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావని ఆశిస్తున్నా’ అని రాశారు. తన వద్ద 10 షిల్లింగ్‌లు ఉన్నాయని, రైలు చార్జీలను లెక్కించడం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ‘గిల్బర్ట్, జాన్‌లను కలవాలి.. గుర్తుంచుకోండి’ అంటూ ముగించారు. ‘అందరికీ ప్రేమతో’అంటూ సంతకం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment