Britain
-
మర్డర్ మిస్టరీని ఛేదించిన సిగరెట్ పీక
ఎంత ప్రొఫెషనల్ నేరగాడైనా నేరానికి సంబంధించి ఏదో ఒక క్లూ వదులుతాడంటారు. అది నిజమేనని మరోసారి నిరూపించిన ఉదంతమిది. అప్పుడెప్పుడో 1984లో జరిగిన ఓ హత్య మిస్టరీని 2014లో చేధించారు. హంతకుడు తాగి పడేసిన సిగరెట్ పీకే అతని పీకకు చుట్టుకుంది. అత్యాధునికమైన డీఎన్ఏ ప్రొఫైలింగ్ మనవాన్ని పట్టించింది. 2021లో అతనికి శిక్ష పడింది.బ్రిటన్‌లో గ్లాస్గోకు చెందిన 58 ఏళ్ల మేరీ మెక్ లాఫ్లిన్కు రెండు పెళ్లిళ్లయ్యాయి. మొత్తం 11 మంది పిల్లలున్నారు. వారు వేర్వేరు నగరాల్లో ఉంటడంతో ఒక్కతే ఉంటోంది. కొడుకు మార్టిన్ కలెన్ (24) వారానికోసారి తల్లిదగ్గరకు వచ్చేవాడు. 1984 అక్టోబర్ 2న తల్లిని చూసేందుకు వచ్చినప్పుడు ఫ్లాట్ నుంచి భయంకరమైన వాసన వచ్చింది. లోపల మేరీ శవమై, మంచం మీద పడుంది. ఐదు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు పోస్టుమార్టంలో తేలింది. సెప్టెంబర్ 26న ఆమె పబ్‌లో గడిపిందని, తర్వాత నడుచుకుంటూ ఇంటికెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దారిలో ఆగి సిగరెట్ కొనుక్కుందని కూడా చెప్పారు. బూట్లు చేతబట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించడం చూసినట్టు ఓ ట్యాక్సీ డ్రైవర్ వాంగ్మూలమిచ్చాడు. అయినా కేసు ఎటూ తేలలేదు. ఒకానొక దశలో ఆమె పిల్లలపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏడాది దర్యాప్తు తర్వాత కేసును మూసేశారు. తర్వాత మరో నాలుగుసార్లు దర్యాప్తు చేసినా లాభం లేకపోయింది. 30 ఏళ్ల తరువాత 2014లో ఈ హత్యకు సంబంధించిన సాక్షాధారాలను మరోసారి సమీక్షించాల్సిందిగా స్కాటిష్ క్రైమ్ క్యాంపస్‌లో పనిచేస్తున్న జోవాన్ కోక్రాన్‌ను మేరీ కుమార్తె గినా మెక్ గావిన్ అడిగారు. 1984ల్లో డీఎన్ఏ ప్రొఫైలింగ్ గురించి అంతగా తెలియకపోయినా అన్ని సాక్ష్యాలనూ భద్రపరిచారు. వాటిలోని మేరీ జుట్టు, గోరు వంటివాటిని డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారు. లివింగ్ రూమ్‌లో కాఫీ టేబుల్ మీది యాష్ ట్రేలోని ఉన్న సిగరెట్ పీక కీలక క్లూగా మారింది. పీకకు అంటిన డీఎన్ఏ గ్రాహం మెక్ గిల్ అనే నేరస్తుని డీఎన్ఏతో సరిపోలింది. అతను పలు లైంగిక నేరాల కేసుల్లో తీవ్ర శిక్షలు అనుభవిస్తున్నాడు. సరే, కేసు వీడింది కదా అనుకుంటే మరో చిక్కు వచ్చి పడింది. మేరీ హత్యకు గురైన సమయంలో మెక్ గిల్ ఖైదీగా ఉన్నట్టు రికార్డులు చూపించాయి. జైల్లో ఉంటే హత్య ఎలా చేయగలడా అని అధికారులు తల పట్టుకున్నారు. నేషనల్ రికార్డ్స్ ఆఫ్ స్కాట్లాండ్లో విచారించిన మీదట చిక్కు ముడి వీడింది. మేరీ హత్య జరిగిన సమయంలో మెక్ గిల్ ఐదు రోజులు పెరోల్‌పై బయట ఉన్నట్టు తేలింది. దాంతో 2019లో మెక్‌గిల్‌ను అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారించి 2021లో 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మేరీ హత్య సమయంలో మెక్‌గిల్‌కు 22 ఏళ్లు. 59 ఏళ్ల వయసులో అతనికి శిక్ష పడింది. ‘‘తల్లి హంతకుడిని జీవితకాలంలో చూస్తామనుకోలేదు. ఆశే మమ్మల్ని నడిపించింది. మొత్తానికి ఉపశమనం కలిగింది’’అని గినా అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Foula: ఆరున క్రిస్మస్.. 13న న్యూ ఇయర్!!
2025 ఏడాది మొదలై ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త తీర్మానాలతో, ఆనందక్షణాలతో బంధుమిత్రుల సమక్షంలో జనమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేసి తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ బ్రిటన్‌లోని ‘ఫౌలా’ద్వీపంలో మాత్రం అత్యంత ఆలస్యంగా అంటే సోమవారం (జనవరి 13) రోజు ఘనంగా కొత్త ఏడాది వేడుకలు జరిగాయి. అందరూ డిసెంబర్ 31 రాత్రి నుంచే సెలబ్రేషన్లు మొదలెట్టి ముగించేస్తే వీళ్లేంటి ఇంత ఆలస్యంగా వేడుకలు చేస్తున్నారని ఆశ్చర్యపోకండి. వాళ్ల దృష్టిలో జనవరి 13వ తేదీనే అసలైన కొత్త ఏడాది. ఎందుకంటే వాళ్లు మనలా ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్‌ను పాటించరు. ప్రాచీనకాలంనాటి సంప్రదాయ జూలియన్ క్యాలెండర్‌ను మాత్రమే అనుసరిస్తారు. జూలియన్ క్యాలెండర్ స్థానంలో నాలుగు శతాబ్దాల కిందట కొత్తగా గ్రెగరీ క్యాలెండర్ వచ్చిన సంగతి తెల్సిందే. 400 సంవత్సరల క్రితం నాటి 13వ పోప్ గ్రెగరీ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కొత్త క్యాలెండర్ ఆయన పేరిటే తర్వాత కాలంలో గ్రెగోరియన్ క్యాలెండర్‌గా స్థిరపడిపోయింది. కానీ ఫౌలా ద్వీపవాసులు మాత్రం తన ఐలాండ్‌లో వేడుకలను పాత జూలియన్ క్యాలెండర్‌ను అనుసరించి మాత్రమే జరుపుకుంటారు. అందుకే జూలియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదిని జనవరి 13వ తేదీన మాత్రమే జరుపుకున్నారు. దీంతో ఆదివారం ద్వీపంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రిస్మస్ను సైతం వాళ్లు జూలియన్ క్యాలెండర్ ప్రకారమే చేసుకుంటారు. అందరూ డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకుంటే వీళ్లు మాత్రం జనవరి ఆరో తేదీన క్రిస్మస్ను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కడుందీ ఫౌలా? బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ఫౌలా.. షెట్‌ల్యాండ్ అనే ప్రధాన ద్వీపానికి 16 మైళ్ల దూరంలో ఉంది. ఫౌలా ద్వీపం పొడవు కేవలం ఐదు మైళ్లు. ప్రధాన భూభాగం నుంచి ఇక్కడికి విద్యుత్లైన్ల వ్యవస్థ లేదు. అందుకే ఇక్కడ జనం సొంతంగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పవన విద్యుత్, చిన్నపాటి జల విద్యుత్ వ్యవస్థ, సౌర ఫలకాలతో సౌర విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నారు. ప్రధాన ద్వీపసముదాయమైన షెట్లాండ్లోని టింగ్వాల్ విమానాశ్రయం నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపాల్లో ఒకటైన ఫౌలాలో అత్యంత పురాతన నార్న్ భాషను మాత్రమే మాట్లాడతారు. ఇక్కడి జనాభా కేవలం 40 మంది మాత్రమే. ప్రస్తుతం 36 మంది మాత్రమే ఉంటున్నారు. పని చేయడానికి బయటి నుంచి ఎవరూ రారు. మన పని మనం చేసుకోవాల్సిందే. ప్రకృతిని ఆస్వాదిస్తూనే ఇక్కడి జనమంతా పనుల్లో బిజీగా ఉంటారు. రెండూ అద్భుతమైనవే: రాబర్ట్ స్మిత్ రెండు వారాల వ్యవధిలో రెండు క్రిస్మస్లు, రెండు నూతన సంవత్సర వేడుకలు రావడం నిజంగా బాగుంటుందని 27 ఏళ్ల రాబర్ట్ స్మిత్ వ్యాఖ్యానించారు. విద్యాభ్యాసం కోసం కొంతకాలం షెట్లాండ్ ద్వీపసముదాయంలో ఉన్న రాబర్ట్.. మళ్లీ ఫౌలాకు వచ్చేశారు. అందరు ద్వీపవాసుల మాదిరిగానే ఆయనా అనేక పనులు చేస్తాడు. పడవను నడపడం, నీటి శుద్ధి కర్మాగారంలో పనిచేయడం, టూర్లు, అవసరమైతే ఉత్తరాలు అందించడం అన్ని పనుల్లో పాలు పంచుకుంటాడు. ‘‘ఉరుకుల పరుగుల షెట్లాండ్ లైఫ్‌ను చూశా. ప్రశాంతమైన ఫౌలా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదించగలిగే మనసున్న ఫౌలా స్వాగతం పలుకుతోంది. ఇక్కడ అందరం ఒకే కుటుంబంలా నివసిస్తాం. ఎప్పుడూ సంగీతం వింటాం. సాధారణంగా ఏ ద్వీపంలోనైనా వృద్ధులు, మధ్యవయస్కులు ఉంటారు. కానీ ఫౌలాలో ఎక్కువ మంది యువత, చిన్నారులే. గతంలో ఇక్కడి మెజారిటీ జనాభా పక్షుల వేటనే ప్రధాన వృత్తిగా ఎంచుకునేది. పక్షులను కొట్టి తెచ్చి కూర వండుకుని తినేయడమే. ఇప్పుడంతా మారిపోయింది. ఎన్నో వృత్తులు వచ్చాయి. తోటపని, చేపలు పట్టడం, కళాకారునిగా పనిచేయడం ఇలా...’’అని రాబర్ట్ అన్నారు. ‘‘ఇక్కడి వాళ్లు అందరితో కలుపుగోలుగా ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్తాం. ఆనందంగా పాడతాం. ఆడతాం. రాబర్ట్ గతంలో గిటార్ వాయించేవాడు. తర్వాత మాండలీన్ పట్టుకున్నాడు. ఇప్పుడేమో ఫిడేల్ నేర్చుకుంటున్నాడు’అని ద్వీపంలోని మరో వ్యక్తి చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓ సిపాయీ... తెలుసుకొనవోయీ!
భాష తెలియని దేశంలో సైనికుడైనా సామాన్యుడే. కొత్త నేలపై కుదురుకోవటం యుద్ధం చేసినంత పని! భాష మాత్రమే కాదు, అక్కడి ఆహారాలకు అలవాటు పడాలి. సంస్కృతులకు సర్దుకుపోవాలి. సంప్రదాయాల కత్తుల వంతెనపై ఒద్దికగా నడవాలి. నడవడికను బుద్ధిగా ఉంచుకోవాలి. ముఖ్యంగా, కరెన్సీని అర్థం చేసుకోవాలి, బేరాలాడాలి. అత్యవసరంలో ప్రాథమిక చికిత్సా, అకాల పరిస్థితుల ముందుచూపూ ఉండాలి. ఇవన్నీ సైనికులకు ప్రభుత్వాలు చెప్పి పంపవు. ‘వెళ్లాక తెలుస్తుందిలే’ అని బదలీ పత్రాలు ఇచ్చేస్తాయి. అయితే, వెళ్లాక తెలుసుకోవటం కాదు, ‘తెలుసుకునే వెళ్లండి’ అంటూ నూటపాతికేళ్ల క్రితమే ఒక ప్రసిద్ధ బ్రిటిష్ సిగరెట్ కంపెనీ భారత్ వెళ్లే బ్రిటన్ సైనికుల కోసం హ్యాండ్‌బుక్‌ను ప్రచురించటం విశేషమే!‘వైల్డ్ ఉడ్బైన్’ బ్రాండు సిగరెట్లను ఉత్పత్తి చేస్తుండే 18వ శతాబ్దపు ప్రఖ్యాత బ్రిటన్ పొగాకు కంపెనీ ‘డబ్లు్య.డి. అండ్ హెచ్.వో. విల్స్’ తాత్కాలిక విధి నిర్వహణలపై భారతదేశానికి తరలివెళ్లే బ్రిటిష్ సైనికుల కోసం మార్గదర్శకాలతో కూడిన ఒక కరదీపికను ప్రచురించినట్లుంది! మన దేశంలో ఆ సైనికుల అపరిచిత స్థానిక వ్యవహారాలను సులభతరం చేయటానికి ఉద్దేశించిన ఆ పుస్తక ప్రతి ఒకటి గతవారం లండన్ , పోర్టోబెల్లో రోడ్డులోని పురాతన వస్తువుల దుకాణంలో నా కంట పడింది. చదువుతుంటే ఎంత సరదాగా అనిపించిందో! భారతదేశం ఎంత పెద్దదో చెప్పడంతో ఆ కర పుస్తకం మొదలౌతుంది. ‘‘ఇండియాలో ఇరవై గ్రేట్ బ్రిటన్లను పట్టించ వచ్చు’’ అని చెబుతూ, ఆనాటి మన కరెన్సీని, బ్రిటన్ కరెన్సీతో పోల్చి వాటి సమాన విలువలను తెలియబరిచింది. ఆ ప్రకారం:1 అణా 1 పెన్నీకి సమానం. 11 అణాలు 1 షిల్లింగ్కి సమానం (రూపాయికి 16 అణాలు అనే లెక్క ఆధారంగా). 1 రూపాయి 1 షిల్లింగు 5 పెన్నీలకు సమానం. 13 రూపాయల 6 అణాలు ఒక పౌండుకు సమానం. పుస్తకంలోని ఎక్కువ భాగంలో, సైనికుడు తెలుసుకోవలసిన అవసరం ఉన్న ముఖ్యమైన పదాలను, వాటి అర్థాలను, వాటిని ఉచ్చరించే విధానాన్ని పొందుపరచటం జరిగింది. ఉదాహరణకు, ఎలుక Chew-ha (చూహా), రోడ్ Rust-er (రస్తా), సముద్రం Some-under (సమందర్), చొక్కా Come-ease (కమీజ్), చక్కెర Chee-knee (చీనీ), నీళ్లు Par-knee (పానీ), మహిళ Awe-rut (ఔరత్) అని ఇచ్చారు. (ఈ హిందీ మాటలను పలికే విధానమంతా ఆంగ్ల పదాలకు దగ్గరగా ఉండేలా ఇచ్చారు.)సైనికుడు స్థానికులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు రోజువారీ వాడుక కోసం కొన్ని చిన్న చిన్న వాక్యాలు కూడా ఆ కర పుస్తకంలో ఉన్నాయి. మీరెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవాలనుకున్న సైనికుడు "Kid-her jar-ta high?" (కిదర్ జాతా హై?) అంటాడు; అతనికేదైనా అర్థం కాకపోతే, "Tomb key-ah bowl-ta high?" (తుమ్ క్యా బోల్తా హై) అంటాడు. అతను పోస్టాఫీస్ కోసం వెదుకుతుంటే "Dark-car-ner kid-her high?" (డాక్ ఘర్ కిదర్ హై) అని అడుగుతాడు. దుకాణందారు ఎక్కువ రేటు చెప్పినట్లనిస్తే "Darm jars-tea high" (దర్ జాస్తి హై) అంటాడు. బ్రిటిష్ సైనికుల కోసం ముద్రించిన హ్యాండ్‌బుక్ కవరు పేజీ ఇప్పుడు బ్రిటన్ సైనికులు అనారోగ్యం పాలైనప్పుడు ఏం చేయాలని పుస్తకం చెప్పిందో చూద్దాం. జ్వరాలను తగ్గించుకోటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే కచ్చితమైన సూచనలు కొన్ని పుస్తకంలో ఉన్నాయి. ‘‘అనేక కారణాల ఫలితంగా జ్వరం అనేది వస్తుంది. లవణాలు, ఆముదపు నూనె మోతాదులను ఎప్ప టికప్పుడు తీసుకోవటం ద్వారా జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. అవి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. వీలైనంత వరకు మాట్లాడకుండా, మౌనంగా ఉండండి. ముఖంపైన, తల పైన చల్లటి తడి గుడ్డను వేసుకుని పడుకోండి. ఒకవేళ మలేరియా సోకి, రోగికి చలిపుడుతూ, వణుకు వస్తున్నట్లయితే వేడి టీ చుక్కల్ని తాగిస్తే చమటలు పడతాయి. వణుకు తగ్గేవరకు రోగికి దుప్పటి కప్పి ఉంచాలి’’ అని ఆ కరదీపిక సూచించింది. పాము కాట్లకు బ్రిటిష్ వారు భయభ్రాంతులయ్యేవారని అని పిస్తోంది. అందుక్కూడా పుస్తకంలో ప్రాథమిక చికిత్సలు ఉన్నాయి. విషపూరితమైన సర్పం కాటేస్తే ‘‘తక్షణం, తీక్షణమైన చికిత్స’’ అవసరం అవుతుంది. అంటే, రక్త ప్రసరణను ఆపటానికి కాటుకు పైభాగాన వస్త్రపు నాడాతో గట్టిగా బిగించి కట్టాలన్న మాట. ఆ తర్వాత, పెదవులపై లేదా నోటిలో పుండ్లు, కోతలు, లేదా పొక్కులు లేని వ్యక్తి ఆ గాయాన్ని పీల్చి, విషాన్ని ఉమ్మేయాలి. ఆ తర్వాత, గాయంపై బలమైన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణాన్ని, (లేదా, ముడి స్ఫటికాలను) అద్దాలి. ఒకవేళ ఆ ప్రదేశంలో సిర, లేదా ధమని ఉన్నందువల్ల కోత పెట్టటానికి వీలు లేకుంటే కాటు వేసిన చోట నిప్పు కణికను, మండుతున్న సిగరెట్‌ను, కాల్చిన తాడు కొసను తాకించాలి. ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన సంగతి: ‘‘ఇవన్నీ చేసేలోగా చేతిలో ఏదైనా బలమైన ఉద్దీపన ఉంటే (బ్రాందీ, విస్కీ మొదలు అమ్మోనియం కార్బోనేట్ కలిసిన శాల్ ఓలటైల్ వరకు ఏదైనా) కొంచెం తాగించాలి. అలా పదిహేను నిముషాలకొకసారి చేయాలి’’ అని ఉండటం! బహుశా, మద్యంతో నరాలను శాంతపరచటమే దీని ఉద్దేశం కావచ్చు. ఈ హ్యాండ్‌బుక్‌లో... ‘తగని పనులు – చిట్కాలు’ అనే ఒక కీలకమైన విభాగం కూడా ఉంది. ‘‘మండే సూర్యరశ్మిలో తలపై టోపీ లేకుండా బయటికి వెళ్లొద్దు – అది వేసవైనా, చలికాలమైనా’’. ‘‘సూర్యాస్తమయానికి ముందు వైన్, బీరు, ఆల్కహాల్ సేవించ వద్దు – (సేవించే అవకాశం వచ్చినప్పటికీ!). ‘‘కొన్ని ఆకులను,ముఖ్యంగా వేపాకులను మీరు అడవిలో ఉన్నప్పుడు మీ టోపీ కింద ఉంచుకోవటం మీ తలను చల్లగా ఉంచుతుంది’’. ‘‘ఫ్లానల్ షర్టును వేసుకోవటం మరచిపోవద్దు. శీతాకాలమైనా, వేసవి కాలమైనా అది మీకు సురక్షితమైన కవచం’’. ఫ్లానల్ వేడిమిని గ్రహించదు. (ఫ్లాన ల్లో చుట్టిన ఐసు ముక్కలు త్వరగా కరగకపోవటమే ఇందుకు రుజువు)’’ అని పుస్తకంలో రాసి ఉంది. బ్రిటిష్ సైనికుడు ఇండియాలో ఆడగలిగే అనేక ఆటల వివరాలు కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. ‘‘హాకీ, ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్, పోలో, గోల్ఫ్, స్విమ్మింగ్, రన్నింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, రోయింగ్, షూటింగ్, పిగ్–స్టిక్కింగ్, గేమ్ హంటింగ్ వంటివి... భారతదేశం అందించే ఆసక్తికరమైన ఆటలు, క్రీడల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇవన్నీ ఇండియాకు కొట్టిన పిండి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ముగింపులో ఆ పుస్తకం ఇచ్చిన సలహా నా పొట్టను చెక్కలు చేసింది. ‘‘చివరిగా ఒక మాట. ఎట్టి పరిస్థితిలోనూ ఇండి యాలో మీరు మీ ప్రశాంతతను, ఉత్సాహాన్ని, నిద్రను కోల్పోకండి. బ్రిటన్‌పై బెంగ పెట్టుకోకండి. సమయం త్వరగానే గడిచిపోతుంది. అంతేకాదు, సౌతాంప్టన్ హార్బరులో మీకు వీడ్కోలు పలుకుతూ ఊగిన చేతి రుమాలు గతించిపోయిన కాలంలా అనిపిస్తుంది. అన్ని టినీ మించి ఇండియా మంచి దేశం.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
డీప్‌ఫేక్స్ చేసినా.. షేర్ చేసినా.. జైలుకే!
డీప్‌ఫేక్.. నటి రష్మిక మందన పేరుతో వైరల్ అయిన ఓ వీడియో తర్వాత విస్తృతంగా చర్చ నడిచిన టెక్నాలజీ. ఆ వీడియోకుగానూ ఆమెకు అన్నిరంగాల నుంచి సానుభూతి కనిపించింది. ఆ టైంలో ఈ టెక్నాలజీని కట్టడి చేయాలంటూ ప్రభుత్వాలు సైతం గళం వినిపించాయి. అయితే ఏఐ వాడకం పెరిగిపోయాక.. ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. ఏకంగా సినిమా హీరోయిన్లను.. నచ్చిన అమ్మాయిలను ముద్దు పెట్టుకుంటున్నట్లు, వాళ్లతో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియో క్రియేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ షార్ట్వీడియోస్ యాప్‌లలోనూ వదులుతున్నారు.ఒకవైపు మన దేశంలో ఈ తరహా విషసంస్కృతిని కట్టడి చేయలేకపోవడంతో.. ఉన్మాదులు మరింత రెచ్చిపోతున్నారు. మన దేశ ప్రధానిని సైతం కూడా వదలకుండా తమ పైత్యం ప్రదర్శిస్తున్నారు. ఇందులో సరదా కోణం ఉన్నప్పటికీ.. అశ్లీలత, అసభ్యత లాంటివి కూడా చాలావరకు కనిపిస్తోంది. అయితే ఇక్కడో దేశం డీప్‌ఫేక్ కట్టడికి కఠిన చట్టం అమల్లోకి తేబోతోంది.ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లను ఆర్టిఫిషియల్ టెక్నాలజీ(Artificial Intelligence) ని ఉపయోగించి.. అచ్చం నిజంవాటిలా అనిపించేలా చేసే ప్రయత్నమే డీప్‌ఫేక్. ఇందులో సరదా కోణం మాత్రమే కాదు.. అచ్చం పోలికలతో ఉండేలా అసభ్యకరమైన వీడియోలను, ఫొటోలను, అలాగే ఫేక్ ఆడియో క్లిప్‌లను కూడా సృష్టించవచ్చు. అందుకే ఆందోళన తీవ్రతరం అవుతోంది. అయితే..డీప్‌ఫేక్స్(Deepfakes)ను క్రియేట్ చేసినా.. వాటిని ఇతరులకు షేర్ చేసినా.. ఇక నుంచి తీవ్ర నేరంగానే పరిగణించనుంది బ్రిటన్. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన చేసింది. ముఖ్యంగా మహిళలను, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని మృగాలు నెట్టింట రెచ్చిపోతున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్రిటన్ ప్రకటించింది.వాస్తవానికి 2015 నుంచే డీప్‌ఫేక్‌ను తీవ్ర నేరంగా పరిగణించేలా చట్టం చేయాలని బ్రిటన్ ప్రయత్నిస్తూ వస్తోంది. గత కన్జర్వేటివ్ ప్రభుత్వం తీవ్ర నేరంగానే పరిగణించాలని చట్టం చేయాలనుకున్నప్పటికీ.. శిక్షను మాత్రం స్వల్ప జైలు శిక్ష, జరిమానాతో సరిపెట్టాలనుకుంది. అయితే ఆ టైంలో శిక్ష కఠినంగా ఉండాలని పలువురు డిమాండ్ చేశారు. తాజాగా లేబర్ పార్టీ(labour Party) ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం.. డీప్‌ఫేక్‌ను ప్రమోట్ చేసేవాళ్లు కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కఠిన శిక్షకూడా పడుతుంది. ‘‘అనుమతి లేకుండా అశ్లీలంగా డీప్‌ఫేక్ కంటెంట్ తయారు చేసినా.. వైరల్ చేసినా శిక్షార్హులే అని ఆ దేశ న్యాయశాఖ ప్రకటించింది. అలాగే మహిళల ప్రైవసీకి భంగం కలిగించే ఈ వ్యవహారాన్ని అత్యవసర పరిస్థితిగానూ పరిగణిస్తామని పేర్కొంది. అతిత్వరలో ఈ చట్టాన్ని పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది.యూకేకు చెందిన రివెంజ్పోర్న్ హెల్ప్‌లైన్ గణాంకాలను పరిశీలిస్తే.. 2017 నుంచి సోషల్ మీడియాలో ఈ తరహా వేధింపులు 400 శాతం పెరిగిపోయినట్లు తేలింది. అయితే ఇది ఫొటోల రూపేణా ఎక్కువగా కనిపించింది.ఉన్మాదంతో, ఒక్కోసారి ప్రతీకార చర్యలో భాగంగా పోర్నోగ్రఫిక్ కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగానే నెట్లో వదులుతున్నారు కొందరు. మన దేశంలోనూ కొందరి డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుండడంతో.. ఆ ప్రైవేట్ వీడియోలు తమవి కావంటూ వాళ్లు ఖండిస్తుండడం చూస్తున్నాం.ఇదీ చదవండి: చొరబాట్లకు మూడు రూట్లు -
అమెరికా, యూరప్‌లను... హడలెత్తిస్తున్న మంచు
వాషింగ్టన్/లండన్: కనీవినీ ఎరగనంతటి భారీ మంచు అమెరికా, యూరప్‌లను హడలెత్తిస్తోంది. అమెరికాలో మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. బ్రిటన్‌లో హిమ బీభత్సం కొనసాగుతోంది. పలు దేశాల్లో విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత భారీగా మంచు కురుస్తోందని నేషనల్ వెదర్ సరీ్వస్ తెలిపింది. మధ్య అమెరికాలో మొదలైన మంచు తుపాను తూర్పు దిశగా కదులుతోందని హెచ్చరించింది. ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని హెచ్చరించింది. కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మామూలుగా చలి అంతగా ఉండని మిసిసిపీ, ఫ్లోరిడా రాష్ట్రాలూ మంచు బారిన పడతాయని హెచ్చరించారు. ఆర్కిటిక్ చుట్టూ పోలార్ వోర్టెక్స్ కారణంగా ఏర్పడుతున్న విపరీతమైన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ, బాలి్టమోర్, ఫిలడెల్ఫియా నగరాలను మంచు ముంచెత్తుతోంది. వర్జీనియా తదితర చోట్ల 5 నుంచి 12 అంగుళాలు, కాన్సాస్, ఇండియానాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుంది. మిస్సోరీ, ఇల్లినాయీ, కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోనూ భారీగా మంచు కురియనుంది. విమాన సరీ్వసులు కూడా ప్రభావితమవుతున్నాయి. బ్రిటన్‌లో కరెంటు కట్ యూరప్ అంతటా ఆదివారం భారీగా మంచు వర్షం కురిసింది. బ్రిటన్, జర్మనీల్లో ప్రధాన నగరాల్లో హిమపాతంతో ప్రజా జీవనానికి అంతరాయం కలిగింది. విమానాలు నిలిపేశారు. బ్రిటన్‌లో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైల్వే సేవలు రద్దయ్యాయి. దక్షిణ ఇంగ్లాండ్‌లో ఎనిమిదో హెచ్చరిక జారీ చేశారు. మరో వారం ఇదే పరిస్థితి కొనసాగనుంది. జర్మనీలో మంచు బీభత్సం దృష్ట్యా బ్లాక్ ఐస్ హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో రాకపోకలన్నీ రద్దయ్యాయి. రైలు ప్రయాణాలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్ కౌంటర్
లండన్:బ్రిటన్(Britain) ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer)పై అమెరికా బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) విమర్శలకు బ్రిటన్ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్(Pakistan) మూలాలున్న వ్యక్తులు అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లను నడిపినా అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్‌గా ఉన్న స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)వేదికగా మస్క్ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి.అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగులను చట్టం ముందు దోషులుగా నిలపడంలో స్టార్మర్ అప్పట్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇందుకే బ్రిటన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో స్టార్మర్‌కు కూడా భాగస్వామ్యం ఉందని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆ గ్యాంగులపై విచారణకు లేబర్ పార్టీ ఒప్పుకోనందున ఆ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు. అయితే ఈ మస్క్ చేసిన ఈ విమర్శలపై యూకే ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ తప్పుపట్టారు. మస్క్‌కు ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని,ఆయన ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయని వెస్ పేర్కొన్నారు. అయితే బ్రిటన్‌లో అమ్మాయిలపై అకృత్యాలను అరికట్టేందుకు మస్క్‌తో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు.ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..? -
యూకే స్టూడెంట్ వీసా.. మరింత భారం!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో భారత విద్యార్థులకు యూఎస్ వీసాలు కష్టమేనన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ స్టూడెంట్స్ ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో ఉన్నత చదువులకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులకు బ్రిటన్ చేదువార్త చెప్పింది. స్టూడెంట్ వీసా కావాలంటే మునుపటి కన్నా ఎక్కువ సొమ్ములు చూపించాలని అంటోంది.ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు ఇక నుంచి అధిక నిధులు సమకూర్చుకోవాల్చిందే. యూకే స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సిన మొత్తాన్ని బ్రిటన్ 11.17 శాతం పెంచేసింది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక నుంచి విద్యార్థి వీసా దరఖాస్తుదారులు తమ బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.14.4 లక్షలు (13,347 పౌండ్లు) మెయింటెనెన్స్ మనీగా చూపించాల్సి ఉంటుంది. 28 రోజుల పాటు వారి బ్యాంక్ ఖాతాలో ఈ నగదు ఉండాలి. ఇప్పటివరకు ఈ మొత్తం రూ. 12.9 లక్షలు (12,006 పౌండ్లు)గా ఉంది. బ్రిటన్‌లో పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘మెయింటెనెన్స్ మనీ’ కూడా పెంచినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.లండన్‌లో వెలుపల చదవాలనుకున్న విద్యార్థులకు కూడా మెయింటెనెన్స్ మనీ 11.05 శాతం వరకు పెరిగింది. లండన్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు విదేశీ విద్యార్థులు ఇప్పటివరకు 9,207 పౌండ్లు మెయింటెనెన్స్ మనీగా చూపించేవారు. ఇక నుంచి ఈ మొత్తం 10,224 పౌండ్లకు పెరుగుతుంది. 2025, జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని బ్రిటీష్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ పేర్కొంది.యూకే స్టూడెంట్ వీసాల నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులు మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తమ ఆర్థిక వ్యవహారాలను మరింత సూక్ష్మంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నిర్వహణ ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందాలంటే స్కాలర్షిప్లు సంపాదించాలని సలహాయిస్తున్నారు. విదేశాల్లో చదువు పూర్తైన తర్వాత బాగా సెటిలయితే తాము పెట్టిన పెట్టుబడి సద్వినియోగం అయినట్టేనని కెరీర్ మొజాయిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా జవేరీ పేర్కొన్నారు.చదవండి: హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!విదేశాల్లో ఉన్నత చదువు కోసం స్టూడెంట్ వీసా పొందేందుకు కొంత మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతాలో చూపించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు, నిర్వహణ ఖర్చుల కోసం తగినంత డబ్బును వారి బ్యాంక్ ఖాతాలో చూపించాలి. లండన్‌లో చదవాలకునే విదేశీ విద్యార్థులు 20 వేల పౌండ్లు ‘మెయింటెనెన్స్ మనీ’ అవసరమవుతుంది. ఒకవేళ వీసా అప్లై చేయడానికి ముందే 5 వేల పౌండ్లు చెల్లిస్తే.. మిగతా 15 వేల పౌండ్లు బ్యాంకు ఖాతాలో 28 రోజుల పాటు ఉండాలి. -
ఖననంలోనూ పర్యావరణహితం
చనిపోకముందే సమాధులు కట్టించుకోవడం గురించి విన్నాం. పిల్లల్లేని వారు, పోయాక ఎవరూ పట్టించుకురని భావించేవారు ముందుచూపుతో అలా చేస్తుంటారు. ఈ ధోరణి బ్రిటన్‌లోనూ ఉంది. కాకపోతే అందులోనూ పర్యావరణ హితానికి వాళ్లు పెద్దపీట వేస్తుండటం విశేషం. యూకే వాసులు తమ అంత్యక్రియల కోసం ఎకో ఫ్రెండ్లీ శవపేటికలను ఎంచుకుంటున్నారు. యూకేలో అంత్యక్రియల్లో 80 శాతం దాకా ఖననాలే ఉంటాయి. అందుకు వాడే శవపేటికలు హానికర రసాయనాలతో తయారవుతున్నాయి. పైగా వాటిలో మృతదేహాల నిల్వకు వాడే ఫార్మాల్డిహైడ్ పర్యావరణానికి హానికారకమే. అది నేరుగా మట్టిలో కలుస్తుంది. కార్బన్ కన్సల్టెన్సీ సంస్థ ప్లానెట్ మార్క్ అధ్యయనం ప్రకారం ఒక్కో శవపేటిక నుంచి ఏకంగా లండన్–పారిస్ విమానం వదిలే కర్బన ఉద్గారాలకు సమానమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. శవపేటికను ఆరడుగుల లోతున పాతేస్తారు. ఇది మట్టిలో కలవడానికి వందేళ్లు పడుతోందట. కళాకృతి నుంచి వ్యాపారం వైపు బతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తరువాత పర్యావరణానికి హాని కలగకుండా ఉండే విధానంపై బ్రిటన్వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఎకోఫ్రెండ్లీ శవపేటికలను ఎంచుకుంటున్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ‘ఎకో ఫ్రెండ్లీ’ అంత్యక్రియలను కోరుకుంటున్నట్లు ఇటీవల యూగవ్ నిర్వహించిన కో–ఆప్ ఫ్యునరల్ కేర్ సర్వేలో తేలింది. స్వతహాగా కళాకారిణి అయిన వెస్ట్ యార్క్‌షైర్‌లోని హెబ్డెన్ బ్రిడ్జికి చెందిన రేచల్ చావు, దుఃఖం, ప్రకృతి ఇతివృత్తంతో క్రియేటివ్‌గా శవపేటికను చేశారు. దాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దారు. స్నేహితుడికోసం ఊలు, చెట్ల ఆకులు, నార, ఇతర పదార్థాలతో పర్యావరణహితమైన శవపేటికను తయారు చేయడంతో అది ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. యూకే అంతటా వ్యాపారం.. ఈ ఎకోఫ్రెండ్లీ శవపేటికలను కేవలం మూడు అడుగుల లోతులో మాత్రమే పాతేస్తారు. అయినా.. భూమి పైపొరల్లో ఉండే క్రిముల వల్ల, శవపేటికల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో శరీరాలు కుళ్లిపోవడానికి 20 నుంచి 30 ఏళ్లు మాత్రమే పడుతుందట. అందుకే మరణానంతరమూ తమవల్ల భూమి కాలుష్యం కాకూడదనుకుంటున్న వ్యక్తులు వీటిని ఎంచుకుంటున్నారు. రేచల్ 2016లో ప్రారంభించిన ఈ వ్యాపారం విస్తరించింది. ఇప్పుడు యూకే అంతటా ఈ ఎకో ఫ్రెండ్లీ స్మశాన వాటికలున్నాయి. భూమికి మేలు చేయాలనుకునేవారు తమను సంప్రదిస్తున్నారని రేచల్ చెప్పారు. ఇతర పర్యావరణ అనుకూల పరిశ్రమల మాదిరిగా, సహజ సమాధులకు ఎక్కువ ఖర్చు అవుతుంది.‘‘ఈ భూమ్మీద నా చివరి చర్య కాలుష్య కారకమైనదిగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. జీవితమంతా పర్యావరణహితంగా జీవించిన తాను.. మరణం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్న’’ అని చెప్పే 50 ఏళ్ల రేచల్ సొంతంగా శ్మశానవాటికను తయారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కొట్టేస్తే కొట్టేశారు గానీ.. పేదలకు పంచండి
లండన్: బ్రిటన్‌లోని యార్క్ నగరంలో క్రిస్మస్ మార్కెట్లో అమ్మడానికి రుచికరమైన పలు రకాల తాజా తినుబండారాలతో వ్యాన్ సిద్ధంగా ఉంది. వ్యాన్‌ను వాణిజ్యసముదాయానికి తరలించేలోపు దానిని ఎవరో దొంగలించారు. విషయం తెల్సుకున్న దాని యజమాని, పాకశాస్త్ర ప్రవీణుడు టామీ బ్యాంక్స్ ఒకింత బాధపడ్డారు. ప్రేమానురాగాలను కలిపి వంటచేసే చెఫ్‌లకు తాము వండిన ఆహార పదార్ధాలను ఇతరులకు వడ్డించడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయి. టామీకి సైతం ఆ ఆనందమే ఎక్కువ. అందుకే తాను తయారుచేసిన పదార్థాలను దొంగలు ఎక్కడ పడేస్తారోననే బాధ ఎక్కువైంది. అందుకే వాటిని నేలపాలు చేయకుండా క్షుద్భాదతో తల్లడిల్లే పేదలకు పంచాలని బహిరంగ ప్రకటన చేశారు. బ్యాంక్స్‌కు యార్క్‌షైర్ కౌంటీలో ఒక పబ్‌తోపాటు రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. స్వతహాగా వంటవాడైన బ్యాంక్స్ తన రెస్టారెంట్లలో కొన్ని ప్రత్యేకమైన ఆహారపదార్థాలను స్వయంగా తయారుచేస్తారు. తమ వ్యాన్ దొంగతనంపై తాజాగా ఆయన ఒక వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ‘‘ చిన్న వ్యాన్‌లో ఖరీదైన తినుబండారాలున్నాయి. స్టీక్, ఏల్, బీర్లు, టర్కీ, బట్టర్‌నట్ స్క్వాష్ పై, కేక్‌లు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ఏకంగా రూ. 27,00,000 పైమాటే. వ్యాను అప్పనంగా దొరికిందన్న ఆనందంలో ఇంత ఖరీదైన ఆహారపదార్ధాలను పోతూపోతూ దారిలో పడేయకండి. పేదలకు పంచి వారి ఆకలి మంటలు తీర్చండి’’ అని వేడుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘ఆహారం విలువ తెలిసిన నిజమైన చెఫ్’ అంటూ బ్యాంక్స్‌ను కొందరు నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తారు. బ్రిటన్‌లో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆహారపదార్ధాల చోరీలో ఇది తాజా ఘటనగా పేరొందింది. రెండు నెలల క్రితం లండన్‌లోని నీల్స్ యార్డ్ పాల ఉత్పత్తుల కేంద్రం వద్ద ఇలాంటి భారీ చోరీ జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక భారీ రిటైర్ సంస్థకు హోల్‌సేల్ పంపిణీదారుగా ప్రకటించుకుంటూ ఒక దొంగ ఈ డైరీకి వచ్చి ఏకంగా 48,488 పౌండ్ల బరువైన చీజ్‌ను దర్జాగా పట్టుకెళ్లిపోయాడు. దీని మార్కెట్ విలువ ఏకంగా రూ.3.30 కోట్లు. బ్రిటిష్, అంతర్జాతీయ పోలీసులు వేట మొదలెట్టి ఆ 63 ఏళ్ల పెద్దాయనను పట్టుకున్నాసరే చీజ్ జాడను మాత్రం కనిపెట్టలేకపోయారు. -
స్నూకర్ దిగ్గజం కన్నుమూత.. బస్ట్ కండక్టర్‌గా, పోస్ట్‌మాన్‌గా పనిచేసి.. ఆఖరికి
వేల్స్: బ్రిటన్‌కు చెందిన ప్రపంచ స్నూకర్ మాజీ చాంపియన్, దిగ్గజం టెర్రీ గ్రిఫిత్(Terry Griffiths) కన్నుమూశారు. వయోభార సంబంధిత అనారోగ్య కారణాలతో 77 ఏళ్ల గ్రిఫిత్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కుమారుడు వేన్ తన తండ్రి మరణ వార్తను ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఓ క్వాలిఫయర్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్‌లోకి అడుగుపెట్టి విజేతగా ఆవిర్భవించిన ఘనత గ్రిఫిత్ సొంతం చేసుకున్నాడు. అదే విధంగా.. 1970 దశకం చివర్లో, 80 దశకంలో మేటి స్నూకర్ చాంపియన్‌గా ఎదిగాడు. 1979లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ‘ట్రిపుల్ క్రౌన్’ గెలిచిన 11 మందిలో గ్రిఫిత్ ఒకడిగా నిలిచాడు. స్నూకర్ క్రీడలో మాస్టర్స్, యూకే చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈ మూడు గెలిస్తే ‘ట్రిపుల్ క్రౌన్’ విజేతగా అభివర్ణిస్తారు. గ్రిఫిత్ ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన మరుసటి ఏడాది 1980లో మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.బస్ కండక్టగా.. పోస్ట్మాన్గారెండేళ్ల తర్వాత 1982లో యూకే చాంపియన్‌షిప్ నెగ్గాడు. సాధారణంగా బిలియర్డ్స్, స్నూకర్ ఆడేవాళ్లంతా సంపన్నులే ఉంటారు. కానీ గ్రిఫిత్ మాత్రం సాధారణ వ్యక్తి. 15 ఏళ్ల వయసులో గనుల్లో పనిచేశాడు. తదనంతరం బస్ కండక్టర్, ఇన్సురెన్స్ ఏజెంట్, పోస్ట్మన్గానూ బతుకుబండి లాగించాడు. 1978లో ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఆ మరుసటి ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతో గ్రిఫిత్ రాత మారిపోయింది. -
లండన్‌లో వెయ్యేళ్ల మార్కెట్ల మూసివేత!
లండన్: బ్రిటన్‌లోని లండన్‌లో దాదాపు వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న రెండు మాంసం దుకాణ వాణిజ్య సముదాయాలు చరిత్రలో కలిసిపోనున్నాయి. లండన్‌లో 11వ శతాబ్దంలో ఏర్పాటైన బిల్లింగ్స్‌గేట్ చేపల మార్కెట్, స్మిత్ఫీల్డ్ మాంసం మార్కెట్ అతి త్వరలో మూతపడనున్నాయి. ఇన్నాళ్లూ హోల్‌సేల్ మార్కెట్లుగా శాసించిన ఈ రెండు వాణిజ్య సముదాయాలు ఇకపై పూర్తిగా తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఇక్కడి దుకాణాలను సమీపంలోని డాగెన్హామ్కు తరలించాలని మొదట్లో భావించారు. అయితే విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయం, ధరల కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ రెండు మార్కెట్లు ఇకపై ఎక్కడా తమ కార్యకలాపాలను కొనసాగించబోవు. ఇక్కడి దుకాణాల యజమానులకు తగు నష్టపరిహారం, వ్యాపార ప్రోత్సాహకాలను అందించనున్నారు. దీంతో హోల్‌సేల్ దుకాణదారులు ఇకపై ఎవరికి వారు వేర్వేరుగా వేర్వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును త్వరలో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు లండన్ సిటీ కార్పొరేషన్ బుధవారం తెలిపింది. బిల్లింగ్స్‌గేట్, స్మిత్ఫీల్డ్లోని వ్యాపారులు ఇప్పటికిప్పుడు ఆయా వాణిజ్య సముదాయాలను ఖాళీచేయాల్సిన పనిలేదు. 2028 సంవత్సరందాకా వారికి గడువు ఇచ్చారు. ఆలోపు నెమ్మదిగా ఎవరిదారి వారు చూసుకోవాల్సి ఉంటుంది. పాత రోమన్ గోడకు అవతల నిర్మించిన స్మిత్‌ఫీల్డ్‌లో ఆ కాలంలో గుర్రాలు, గొర్రెలు, పశువుల అమ్మకానికి వినియోగించేవారు. తరువాత పూలు, పండ్లు, కూరగాయలు, పౌల్ట్రీతోపాటు చేపలు, మాంసం అమ్మకాలు మొదలయ్యాయి. వందల ఏళ్లుగా లండన్ నగర చరిత్రకు ఈ మార్కెట్లు సాక్షిగా నిలిచాయి. స్మిత్ఫీల్డ్ భవనాలు విక్టోరియన్ కాలం నాటివి. తర్వాత కొన్ని మార్పులు జరిగినా దాదాపు ఆకాలంనాటిలాగానే ఉన్నాయి. 1958లో ఒక పెద్ద అగ్నిప్రమాదానికి గురైనా చెక్కు చెదరలేదు. స్మిత్‌ఫీల్డ్‌లో వ్యాపారం రాత్రి పదింటికి మొదలై ఉదయం ఆరింటికల్లా ముగుస్తుంది. బిల్లింగ్స్‌గేట్ 19వ శతాబ్దంలో ప్రపంచంలోనే అతిపెద్ద చేపల మార్కెట్‌గా పసిద్ధి చెందింది. శిథిలావస్థకు చేరడంతో మార్కెట్‌ను 1982లో డాక్లాండ్స్కు మార్చారు. ఇప్పుడు బిల్లింగ్స్‌గేట్ స్థలంలో 4,000 కొత్త గృహాలను నిర్మించే ప్రతిపాదన ఉంది. స్మిత్ఫీల్డ్ ఒక సాంస్కృతిక కేంద్రంగా మారనుంది. ఇక్కడే కొత్త లండన్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. పూర్వం స్మిత్ఫీల్డ్ ప్రాంతం మద్యపానం, రౌడీలతో హింసకు చిరునామాగా ఉండేది. ప్రఖ్యాత బ్రిటిష్ రచయిత చార్లెస్ డికెన్స్ స్మిత్ఫీల్డ్ను అప్పట్లో ‘మురికి, బురద’కు కేంద్రస్థానంగా అభివర్ణించారు. ఆయన రాసిన ఒలివర్ ట్విస్ట్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ రచనల్లోనూ ఈ మార్కెట్ల ప్రస్తావన ఉంది. -
లాటరీలో రూ.1,804 కోట్లు!
లండన్: బ్రిటన్‌లో ఓ వ్యక్తికి అదృష్టం మామూలుగా కలిసిరాలేదు! ఏకంగా 17.7 కోట్ల పౌండ్ల (రూ.1,804 కోట్ల) లాటరీ తగిలింది. ఆ దేశ చరిత్రలోనే మూడో అతి పెద్ద లాటరీ మొత్తంగా నిలిచింది. మంగళవారం జరిగిన యూరోమిలియన్స్ లాటరీ డ్రాలో మనవాడు ఈ జాక్‌పాట్ కొట్టాడు. సదరు అదృష్టవంతుని వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. 2022లో ఓ అజ్ఞాత వ్యక్తి గెలుచుకున్న 19.5 కోట్ల పౌండ్లు బ్రిటన్‌లో ఇప్పటిదాకా అత్యంత భారీ జాక్‌పాట్‌గా నిలిచింది. గత మేలో గ్లోసిస్టర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు గెలిచిన 18.4 కోట్ల పౌండ్లకు రెండో స్థానం దక్కింది. -
ట్రాన్స్జెండర్లూ మహిళలేనా?
మహిళ అంటే ఎవరు? ఒక వ్యక్తి స్త్రీ అని నిర్ధారించేందుకు ప్రాతిపదిక ఏమిటి? జన్మతః సంక్రమించిన లైంగికత మాత్రమేనా? లింగ మార్పిడితో మహిళగా మారిన వాళ్లు కూడా ‘స్త్రీ’అనే నిర్వచనం కిందకు వస్తారా? తద్వారా మహిళలకు వర్తించే హక్కులన్నీ వారికీ వర్తిస్తాయా? అత్యంత సంక్లిష్టమైన ఈ అంశాలను తేల్చాల్సిన బాధ్యత బ్రిటన్ సుప్రీంకోర్టుపై పడింది. అతి వివాదాస్పదమైన ఈ అంశంపై జోరుగా కోర్టులో వాద వివాదాలు జరుగుతున్నాయి. ఒకరకంగా ‘మహిళ వర్సెస్ మహిళ’అని చెప్పదగ్గ న్యాయపోరాటం జరుగుతోంది. స్త్రీగా గుర్తింపు సర్టిఫికెట్ ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని సమానత్వ చట్టాల ప్రకారం మహిళగా పరిగణించవచ్చా, లేదా అన్నది ఈ కేసు. బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు దీనిపై మంగళవారం లోతైన వాదనలు సాగాయి. అవి బుధవారమూ కొనసాగాయి. ఇక న్యాయమూర్తులు తీర్పు వెలువరించడమే మిగిలింది. అందుకు రెండు వారాలు పట్టవచ్చు. రాబోయే తీర్పు బ్రిటన్‌తో పాటు ప్రపంచమంతటా లింగమార్పిడి ద్వారా మహిళలుగా మారిన వారి గుర్తింపును, హక్కులు తదితరాలపై ఎంతగానో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఏమిటీ కేసు? నిజానికి మహిళా హక్కుల ఉద్యమకారులకు, స్కాట్రండ్ ప్రభుత్వానికి దీర్ఘకాలంగా సాగుతున్న వివాదమిది. స్కాట్లాండ్ ప్రభుత్వ రంగ సంస్థళ బోర్డుల్లో 50 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా 2018లో అక్కడి ట్లాండ్ పార్లమెంటు చట్టాన్ని ఆమోదించింది. లింగమారి్పడి ద్వారా మహిళలుగా మారిన వారిని కూడా ఈ చట్టం ప్రకారం ‘స్త్రీ’నిర్వచన పరిధిలో చేర్చారు. దీన్ని స్కాటిష్ మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ‘మహిళ’ను పునరి్నర్వచించే అధికారం పార్లమెంటుకు లేదన్నది వారి వాదన. ‘‘ఈ చట్టం అమలైతే బోర్డుల్లో 50 శాతం మంది పురుషులతో పాటు మిగతా 50 శాతం కూడా మహిళలుగా మారిన పురుషులే ఉంటారు. అది మహిళా ప్రాతినిధ్య లక్ష్యాలకే గొడ్డలిపెట్టు’’అని ‘ఫర్ విమెన్ స్కాట్లాండ్’(ఎఫ్‌డబ్ల్యూఎస్) అనే మహిళ స్వచ్ఛంద సంస్థ అంటోంది. అంతిమంగా ఇది మహిళల రక్షణకూ విఘాతమమేనన్ని వాదిస్తోంది. ఈ చట్టాన్ని స్కాట్లాండ్ కోర్టులో సవాలు చేయగా చుక్కెదురైంది. ఈ కేసును కోర్టు తిరస్కరించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడానికి గతేడాది అనుమతించింది. అలా బంతి బ్రిటన్ సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం: ఆమ్నెస్టీ సమానత్వ చట్టం ప్రకారం లైంగికత తల్లి గర్భంలోనే నిర్ణయమవుతుందని ఎఫ్‌డబ్ల్యూఎస్ తరపు న్యాయవాది అంటున్నారు. పుట్టిన అనంతరం దాన్ని మార్చడం సాధ్యం కాదని వాదిస్తున్నారు. దీనితో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా పలు మానవహక్కుల సంఘాలు విభేదిస్తున్నాయి. ‘‘జెండర్ అనేది శారీరక వ్యక్తీకరణ. లింగ గుర్తింపు సరి్టఫికెటున్న ట్రాన్స్జెండర్లకు మహిళల హక్కులను నిషేధించడం మానవ హక్కుల సూత్రాలకు విరుద్ధం’’అని అవి అంటున్నారు. ట్రాన్స్జెండర్ల హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని బ్రిటన్ సుప్రీంకోర్టును ఆమ్నెస్టీ లిఖితపూర్వకంగా కోరింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.5,900 కోట్ల విలువైన బిట్కాయిన్లు చెత్తకుప్ప పాలు!
లండన్: అనగనగా ఒక పాత హార్డ్‌డ్రైవ్. బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల జేమ్స్ హావెల్స్ అనే వ్యక్తి క్రిప్టోకరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్‌డ్రైవ్‌లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. తన ప్రియురాలు హఫీనా ఎడీ ఎవాన్స్‌తో కలిసి ఈ హార్డ్‌డ్రైవ్ కోసం వేట మొదలెట్టాడు. అది కనిపించట్లేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది 2013 ఏడాదిదాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హఫీనా శుభ్రంచేస్తుండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా? అని జేమ్స్‌ను హఫీనా అడగ్గా అవసరం లేదు పడేసెయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్తకుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరూ దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో.. ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్‌వేర్ ఉందని తాజాగా వెల్లడైంది. హార్డ్‌వేర్‌లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.5,900 కోట్లు కావడం గమనార్హం. విషయం తెల్సి హఫీనా హుతాశురాలైంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడిపోయారు. ‘‘జేమ్స్ సంపదను తెలీకుండా చెత్తపాలు చేశాను. దాని కోసం అతను పడుతున్న వేదనను చూడలేకపోతున్నా’’అని తాజాగా హఫీనా వాపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థ్యాలు సాధారణంగా వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న డాక్స్వే భారీ డంపింగ్ యార్డ్‌కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14,00,000 టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది. అందులో ఎలాగైనా తన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయల్దేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటోంది. యార్డ్‌లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్‌డ్రైవ్ దొరికితే కుబేరుడినయ్యాక సంపదలో 10 శాతాన్ని న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశాన్ని డిసెంబర్లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదావేసింది. -
ట్రయాథ్లాన్ దిగ్గజం అలిస్టర్ బ్రౌన్లీ వీడ్కోలు
లండన్: మూడు క్రీడాంశాల సమాహారమైన ట్రయాథ్లాన్లో (1500 మీటర్ల స్విమ్మింగ్, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల రన్నింగ్) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న బ్రిటన్ స్టార్, రెండు వరుస ఒలింపిక్స్ చాంపియన్ అలిస్టర్ బ్రౌన్లీ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అతను లండన్ (2012), రియో (2016) ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు గెలుపొందాడు.అంతకుముందు ఈ స్టార్ 2009, 2011లలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ల్లోనూ చాంపియన్‌గా నిలిచాడు. మరో నాలుగుసార్లు యూరోపియన్ చాంపియన్‌గా ఘనత వహించాడు. తన విజయవంతమైన కెరీర్‌కు బైబై చెప్పేందుకు ఇదే సరైన సమయమన్నాడు. ‘ఎక్స్’లో తన రిటైర్మెంట్ను ప్రకటించిన అతను ‘ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రొఫెషనల్ కెరీర్లో ఎన్నో విజయాలు చవిచూసిన నాకు ఇప్పుడీ క్షణాలు ఓ వైపు ఉత్సాహాన్ని.. మరోవైపు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి’ అని ట్వీట్ చేశాడు.ఇప్పుడు సరికొత్త సవాళ్లపై దృష్టి పెడతానని చెప్పాడు. 36 ఏళ్ల వయసులో మళ్లీ స్టార్ట్ లైన్ వద్ద నిల్చొలేనని, ఇందుకోసం శ్రమించలేనని అన్నాడు. 2012, 2016... ఈ రెండు సార్లు అతని సోదరుడు జొనాథన్ (జానీ) బ్రౌన్లీ కూడా పతకాలు నెగ్గడం మరో విశేషం! లండన్‌లో కాంస్యం నెగ్గిన జానీ... రియోలో రజతం గెలిచాడు. ‘బిల్లీ జీన్ కింగ్ కప్’ చాంపియన్ ఇటలీ మలాగా (స్పెయిన్): మహిళల ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ ‘బిల్లీ జీన్ కింగ్ కప్’లో ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇటలీ 2–0తో స్లొవేకియా జట్టును ఓడించింది. తొలి మ్యాచ్‌లో లూసియా బ్రాంజెట్టి 6–2, 6–4తో విక్టోరియా రుంకకోవాను ఓడించగా... రెండో మ్యాచ్‌లో జాస్మిన్ పావోలిని 6–2, 6–1తో రెబెకా స్రామ్కోవాపై నెగ్గడంతో ఇటలీ విజయం ఖరారైంది.ఓవరాల్‌గా ఇటలీకిది ఐదో బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్. ఆ జట్టు చివరి సారి 2013లో ఈ టైటిల్‌ను సాధించింది. 2013లో విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్న సారా ఎరాని ఈసారీ జట్టులో ఉండటం విశేషం. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జాస్మిన్ ప్రదర్శన ఇటలీ విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ ఏడాది జాస్మిన్ అద్భుతంగా రాణించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో... వింబుల్డన్ టోర్నీలో సింగిల్స్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. -
G20 Summit: మళ్లీ ఎఫ్‌టీఏ చర్చలు
రియో డి జనిరో: బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. దీనిపై చర్చలను పునఃప్రారంభిస్తామని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నేతలిద్దరూ సమావేశమయ్యారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ గెలుపుతో ఎఫ్‌టీఏ భవితవ్యం అయోమయంలో పడటం తెలిసిందే. దానికి నేతలిద్దరూ తాజాగా తెర దించారు. పరస్పరం లాభసాటిగా ఉండేలా ఎఫ్‌టీఏ విధివిధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బెల్ఫాస్ట్, మాంచెస్టర్ నగరాల్లో నూతన కాన్సులేట్లు తెరవాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు.మెరుగైన భవితకు కృషి మెరుగైన భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టాల్సిందిగా జీ20 సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సదస్సులో రెండో రోజు సుస్థిరాభివృద్ధి, ఇంధన రంగంలో మార్పులపై ఆయన ప్రసంగించారు. అభవృద్ధి చెందుతున్న దేశాలకు ఇచి్చన హామీలను అమలు చేయడం సంపన్న దేశాల బాధ్యత అని గుర్తు చేశారు. పర్యావరణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవడం మానవాళి మనుగడకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. గాజాకు మరింత మాన వతా సాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడాలంటూ సదస్సు డిక్లరేషన్ విడుదల చేసింది. వీటితో పాటు పలు అంశాలపై బుధవారం సదస్సు చివరి రోజు ఉమ్మడి తీర్మానం చేసే అవకాశముంది. దేశాధినేతలతో మోదీ భేటీలుఆతిథ్య దేశం బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ వరుస భేటీలు జరిపారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్), గాబ్రియెల్ బోరిక్ ఫోంట్ (చిలీ), జేవియర్ మెయిలీ (అర్జెంటీనా), జార్జియా మెలోనీ (ఇటలీ), ప్రబోవో సుబియాంటో (ఇండొనేసియా), పెడ్రో శాంచెజ్ (స్పెయిన్), అబ్దెల్ ఫతా ఎల్ సిసీ (ఈజిప్ట్), యూన్ సుక్ యోల్ (దక్షిణ కొరియా), జోనాస్ గర్ స్టోర్ (నార్వే), లూయీస్ మాంటెనెగ్రో (పోర్చుగీస్), లారెన్స్ వాంగ్ (సింగపూర్), యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ తదితరులు వీరిలో ఉన్నారు. -
విలువ తెలియక డోర్‌స్టాప్‌గా వాడేశారు.. ఆ పాలరాతి శిల్పం ఖరీదు 27 కోట్లు!
హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభువు మహబూబ్ అలీఖాన్ గతంలో కొనుగోలుచేసి దురదృష్టంగా భావించి షూలోపల పడేసిన ప్రపంచ ప్రఖ్యాత జాకబ్ వజ్రాన్ని ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చాన్నాళ్లు తన టేబుల్‌పై పేపర్‌వెయిట్‌గా వాడారని చరిత్ర చెబుతోంది. అది వందల కోట్ల విలువచేస్తుందని ఆయన తెలీదు. అచ్చం అలాగే కోట్లుపలికే పాలరాతి ప్రతిమను చాలా సంవత్సరాలపాటు బ్రిటన్‌లో ఒక పారిశ్రామికవాడలోని షెడ్డు తలుపు మూసుకుపోకుండా అడ్డుగా వాడారు. చివరకు అది ప్రముఖ శిల్పకారుడు ఎడ్మీ బౌచర్డన్ చెక్కిన అద్భుత ప్రతిమ అని తెల్సి ఇప్పుడు ఔత్సాహిక కుబేరుడు కోట్లు పెట్టి కొనేందుకు ముందుకొస్తున్నారు. ఒకాయన ఏకంగా రూ.27 కోట్లు చెల్లించేందుకు సుముఖత చూపడంతో ఈ శిల్పం కథాకమామిషు తెల్సుకునేందుకు అంతా గూగుల్ తల్లి వద్ద సెర్చింగ్లు మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన 15వ లూయిస్ రాజు వద్ద ఆస్థాన శిల్పకారుడైన ఎడ్మీ చౌడర్డన్ 18వ శతాబ్దంలో ఈ ప్రతిమను చెక్కారు. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్లోని హైల్యాండ్స్ కౌన్సిల్ ప్రాంతంలో ఆనాటి భూస్వామి, రాజకీయనాయకుడు జాన్ గార్డన్.. ఎడ్మీతో తన స్వీయ ప్రతిమను చెక్కించుకున్నాడు. తర్వాతి కాలంలో ఆయన ఈ ప్రాంతంలో ఇన్వర్గార్డన్ పట్టణానికి రూపకల్పనచేశారు. తర్వాత 19వ శతాబ్దంలో ఒక కోట తగలబడిన ఘటనలోనూ ఇది చెక్కుచెదరలేదు. ఆ సంఘటన తర్వాత 1930వ సంవత్సరంలో అదే ఇన్వర్గార్డన్ పట్టణ కౌన్సిల్ కేవలం ఐదు పౌండ్లకు కొనుగోలుచేసింది. అయితే తర్వాత అది అదృశ్యమైంది. కేవలం ఐదు పౌండ్ల విలువచేసే శిల్పం ఎక్కడో శిథిలమై ఉంటుందని కౌన్సిల్ సభ్యులు భావించారు. అంతా దానిని మర్చిపోయారు.దశాబ్దాల తర్వాత అంటే 1998లో హైల్యాండ్స్ పారిశ్రామికవాడలోని కర్మాగారం గేటు వద్ద దానిని కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ చూశారు. తలుపు మూసుకుపోకుండా అప్పుడు అడ్డుగా దానిని వాడుతున్నారు. మిలమిల మెరిసిపోతున్న ఈ ప్రతిమకు ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుందని భావించి దానిని హైల్యాండ్ కౌన్సిల్ స్థానిక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ప్రభుత్వాధికారులు దానిని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. తర్వాత దానిని పారిస్ నగరంలోని ‘ది లారీస్’, లాస్ఏంజిల్స్లోని ‘ది గెట్టీ మ్యూజియం’లోనూ ప్రదర్శించారు. ఆనోటా ఈనోట విన్నాక అది ప్రఖ్యాత శిల్పకారుడు చెక్కిన శిల్పమని స్పష్టమైంది. అరుదైనదికావడంతో అది చాలా విలువైనదని గ్రహించి దానిని స్థానిక ప్రభుత్వం అపహరణకు గురికాకుండా లోపల భద్రపరిచింది.సహాయక నిధుల కోసం వేలానికి.. విలువైన వస్తువును దగ్గర పెట్టుకోవడం కంటే దానిని విక్రయిస్తే వచ్చే సొమ్ముతో స్థానికుల సంక్షేమ పథకాలను అమలుచేయొచ్చని స్థానిక ప్రభుత్వం భావించింది. అమ్మడానికి సిద్ధమైంది. వచ్చే నిధులను ఇన్వర్గార్డన్ కామన్‌గుడ్ ఫండ్ కింద ఖర్చుచేస్తామని చాటింపు వేయించింది. చారిత్రక వస్తువును సొంత ఆస్తిగా భావించి వేలం ఎలా వేస్తారని కొందరు కోర్టుకెక్కారు. దీనిపై హైల్యాండ్స్ టెయిన్ షరీఫ్ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అది వారసత్వ ఆస్తి కాదని తేల్చిచెప్పింది. చదవండి: వెదురుగొట్టం తూనీగ.. పశ్చిమ కనుమల్లో సరికొత్త జాతిఈలోపే గత ఏడాది అక్టోబర్‌లోనే దానిని రూ.27 కోట్లకు కొంటానని ఒక కుబేరుడు ఆసక్తి చూపించారు. తాజాగా కోర్టు తీర్పుతో ప్రతిమ వేలానికి రంగం సిద్ధమైంది. నవంబర్ ఏడోతేదీన తొలిసారిగా వేలానికి పెట్టారు. రోజు రోజుకూ దీనికి బిడ్డింగ్ ధర పెరుగుతోంది. విషయం తెల్సుకున్న ఆనాటి కౌన్సిల్సభ్యురాలు మాక్సిన్ స్మిత్ మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు తొలిసారి చూసినప్పుడే దానిని మూడో కంటికి తెలీకుండా ఇంటికి పట్టుకుపోతే బాగుండేది. కోటీశ్వరురాలివి అయ్యేదానివి అని నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ఆటపట్టిస్తారు’’అని ఆమె అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ
బెంగళూరు: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులో పర్యటించారు. కార్తీక మాసం పవిత్రమైన మాసం కావడంతో గురురాఘవేంద్ర స్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ దంపతులు మఠాన్ని సందర్శించారు. జయనగర్‌లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు సునక్ అత్తమామలు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయ పూజల్లో వారు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాలపై తన విశ్వాసం గురించి బహిరంగంగానే ప్రకటించే రిషి సునాక్.. గతంలో దేశంలో పర్యటించినప్పుడు అనేక దేవాలయాలను సందర్శించారు. ఈ ఏడాది జనవరిలో సునాక్ లండన్‌లోని ప్రఖ్యాత బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్‌ను సందర్శించారు. ‘‘నేను హిందువును. అందరిలాగే, నేనూ నా విశ్వాసం నుంచి ప్రేరణను, ఓదార్పును పొందుతాను. పార్లమెంటు సభ్యుడిగా ‘భగవద్గీత’పై ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
రిషి సునాక్ స్థానంలో టోరీల సారథిగా బేడ్‌నాక్.. తొలి నల్లజాతి మహిళగా రికార్డు
లండన్: బ్రిటన్ విపక్ష నేతగా, కన్జర్వేటివ్ పార్టీ సారథిగా కేమీ బేడ్‌నాక్ ఎన్నికయ్యారు. నైజీరియా మూలాలున్న 44 ఏళ్ల కేమీ ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా రికార్డు సృష్టించారు. మూడు నెలల పాటు జరిగిన పార్టీపరమైన ఎన్నికల్లో మాజీ మంత్రి రాబర్ట్ జెన్రిక్ను బేడ్‌నాక్ ఓడించారు. ఆమెకు 53,806 ఓట్లు రాగానే జెన్నిక్కు 41,388 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో రాజీనామా చేసిన మాజీ ప్రధాని రిషి సునాక్ స్థానంలో ఆమె పార్టీ పగ్గాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సునాక్‌కు బేడ్‌నాక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్థానంలో ఇంకెవరున్నా ఈ కష్టకాలంలో పార్టీ కోసం అంతగా కష్టపడేవారు కాదంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. సునాక్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పార్టీ సారథిగా గొప్పగా రాణిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధాని కియర్ స్టార్మర్ కూడా బేడ్నాక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక నల్లజాతి మహిళ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు స్వీకరించడాన్ని చరిత్రాత్మక పరిణామంగా అభివర్ణించారు. బేడ్‌నాక్ నార్త్‌వెస్ట్ ఎసెక్స్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
విపక్ష నేత పదవికి సునాక్ గుడ్‌బై
లండన్: బ్రిటన్ విపక్ష నేత పదవి నుంచి రిషి సునాక్ (44) బుధవారం తప్పుకున్నారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా రెండేళ్ల క్రితం ఆయన చరిత్ర సృష్టించడం తెలిసిందే. ఆయన సారథ్యంలో కన్జర్వేటివ్ పార్టీ గత జూలైలో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయం పాలైంది. నాటినుంచి సునాక్ తాత్కాలికంగా విపక్ష నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ‘రెండేళ్ల నాడు దీపావళి సంబరాల సందర్భంగానే నా పార్టీ నాయకునిగా ఎన్నికయ్యా. మళ్లీ అవే సంబరాల వేళ తప్పుకుంటున్నా’ అంటూ హాస్యం చిలికించారు. ‘‘ఈ గొప్ప దేశానికి తొలి బ్రిటిష్ ఏషియన్ ప్రధాని కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. బ్రిటన్ అనుసరించే గొప్ప విలువలకు ఇది తార్కాణంగా నిలిచింది’’ అన్నారు. తన చివరి ప్రైమ్‌మినిస్టర్స్ క్వశ్చన్స్ (పీఎంక్యూస్)లో భాగంగా ప్రధాని కియర్ స్టార్మర్‌కు సునాక్ పలు సరదా ప్రశ్నలు వేసి అందరినీ నవ్వించారు. వెనక బెంచీల్లో కూచుంటాఅమెరికాలో స్థిరపడాలని తాను భావిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను ఈ సందర్భంగా సునాక్ తోసిపుచ్చారు. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ ఎంపీగా పారల్మెంటులో వెనక బెంచీల్లో కూర్చుని కనిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. దాంతో సహచర ఎంపీలంతా నవ్వుల్లో మునిగిపోయారు. -
బెంగళూరులో కింగ్ చార్లెస్–3
బెంగళూరు: బ్రిటన్ రాజు చార్లెస్–3 సతీసమేతంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో రహస్యంగా పర్యటించారు. రాజదంపతులు సమోవా దేశంలో కామన్వెల్త్ సమావేశంలో పాల్గొన్న తర్వాత యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు వెళ్తూ మధ్యలో బెంగళూరులో ఆగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధ్రువీకరించాయి. వారిద్దరూ నగరంలోని ప్రముఖ వెల్నెస్ కేంద్రంలో చికిత్స పొందినట్లు తెలిసింది. వైట్‌ఫీల్డ్ సమీపంలోని సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్లో రాజు చార్లెస్–3, రాణి కెమిల్లా మూడు రోజులపాటు బస చేశారు. యోగా, ధ్యానంతోపాటు ఇతర థెరపీలకు ఈ హెల్త్ సెంటర్ పేరుగాంచింది. శరీరం, మనసు అలసిపోయినప్పుడు పునరుత్తేజం పొందడానికి ఇక్కడ నిపుణులు ప్రకృతిసిద్ధమైన చికిత్స అందిస్తుంటారు. డాక్టర్ ఐజాక్ మథాయ్ నిర్వహిస్తున్న ఈ హెల్త్ సెంటర్‌కు చార్లెస్–3 రావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఆయన ఇక్కడే 71వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ‘మనసుకు స్వాంతన లభించే యోగా క్రియల్లో బ్రిటన్ రాజ దంపతులు పాల్గొన్నారు. కోడిగుడ్లతోపాటు కేవలం శాకాహారం తీసుకున్నారు. ధ్యానం చేశారు. చార్లెస్–3 ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతితో కూడిన వెల్‌నెట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు’’ అని సౌఖ్య హెల్త్ సెంటర్ ప్రతినిధులు చెప్పారు. రాజదంపతులకు ప్రత్యేక మర్యాదలేవీ చేయలేదని, ఇతర అతిథుల తరహాలోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. హెల్త్ సెంటర్లో మూడు రోజులపాటు ఉన్న చార్లెస్–3 దంపతులు ఇక్కడ సాగవుతున్న ఆర్గానిక్ పంటలను పరిశీలించారు. ఔషధాల గార్డెన్‌ను సందర్శించారు. గోవుల మధ్య కలియతిరిగారు. ప్రకృతికి దగ్గరగా జీవించారు. పర్యావరణ హిత పద్ధతులు పాటించారు. రాజదంపతులు బుధవారం ఉదయమే హెల్త్‌సెంటర్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. -
యువ భారత్‌కు రెండో విజయం
జోహర్ బహ్రు (మలేసియా): సుల్తాన్ జోహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో భారత కుర్రాళ్లు 6–4 గోల్స్ తేడాతో బ్రిటన్ జట్టును కంగుతినిపించారు. మ్యాచ్ ఆరంభమైన కొన్ని నిమిషాలకే ఆటగాళ్ల దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో బోణీ బ్రిటన్ 2వ నిమిషంలో కొడితే... ఆఖరుదాకా భారత్ అదరగొట్టింది. మొహ్మద్ కొనయిన్ దాద్ ఏడో నిమిషంలో భారత్ ఖాతా తెలిచాడు. మొదటి పది నిమిషాల్లోపే ఒకసారి 1–1తో... తర్వాత 20వ నిమిషంలో రెండో సారి 2–2తో స్కోరు సమమైంది. ఇక అక్కడి నుంచి భారత్ ప్రతాపానికి పైమెట్టుగా సాగింది. దిల్‌రాజ్ సింగ్ (17వ, 50వ నిమిషాల్లో), శారదానంద్ తివారీ (20వ, 50వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయడంతో బ్రిటన్ ఇక మ్యాచ్‌లో తేరుకోలేకపోయింది. మధ్యలో మన్మీత్ సింగ్ (26వ ని.లో) గోల్ సాధించడంతో ఒక దశలో భారత్ 4–2తో ఆధిక్యాన్ని అమాంతం పెంచుకుంది. ప్రత్యర్థి జట్టులో రోరి పెన్రోజ్ (2వ, 15వ ని.లో), మైకేల్ రాయ్‌డెన్ (46వ, 59వ ని.లో) చెరో రెండు గోల్స్‌లో చేసి అంతరాన్ని అయితే తగ్గించగలిగారు కానీ... భారత్ ధాటి నుంచి పరాజయాన్ని తప్పించలేకపోయారు. ఆరంభంలోనే బ్రిటన్ శిబిరం గోల్ చేయడంతో భారత రక్షణ పంక్తి తమ లోపాలను వెంటనే సరిదిద్దుకుంది. దీనికితోడు స్ట్రయికర్లు కూడా క్రమం తప్పకుండా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై విజయవంతంగా లక్ష్యంపై గురిపెట్టడంతో భారత్ విజయం సులువైంది. తొలిమ్యాచ్‌లో భారత్ 4–2తో జపాన్ను చిత్తు చేసింది. -
యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం
బ్యూనస్ ఎయిర్(అర్జెంటీనా): బ్రిటన్ సంగీత సంచలనం, పాప్ గాయకుడు, గేయ రచయిత 31 ఏళ్ల లియాం పెనీ కన్నుమూశారు. బుధవారం సాయంత్రం అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ సిటీలోని ఒక విలాసవంత హోటల్ మూడో అంతస్థు బాల్కనీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మద్యం, మత్తుపదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల హోటల్ గది అంతా చిందరవందర చేసి కిందపడి చనిపోయారని వార్తలొచ్చాయి. పోస్ట్‌మార్టమ్ నివేదిక తర్వాతే మరణానికి కారణాలు తెలిసే వీలుంది. ఆయన బస చేసిన కాసాసర్ హోటల్ గదిలో మద్యంతోపాటు బెంజోడైజీపైన్ అనే ఔషధంను కనుగొన్నారు. బెంజోడైజీపైన్ను ఉద్రేకాన్ని తగ్గించేందుకు, మూర్ఛ, నరాల సంబంధ చికిత్సల్లో వాడతారు. పెనీ తన గది బాల్కనీ నుంచి దూకి ఉంటారని నగర భద్రతా మంత్రి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాబ్లో పోలీసీచియో మీడియాతో చెప్పారు. 14 ఏళ్లకే సంచలనం 2010లో బ్రిటన్ ప్రఖ్యాత టాలెంట్ రియాలిటీ షో ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి అద్భుతంగా పాటి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. మరో నలుగురితో కలిసి ‘వన్ డైరెక్షన్’పేరిట బాయ్బ్యాండ్ను నెలకొల్పాడు. ఈ బ్యాండ్ నుంచి వెలువడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. 7 కోట్ల ‘రికార్డ్’లు అమ్ముడుపోయాయి. 2016లో బ్యాండ్ నుంచి విడిపోయాక సోలోగా కెరీర్‌ను మొదలుపెట్టి సంచలనాలు సృష్టించారు. ఈయన చేసిన సంగీత విభావరిలు సైతం పెద్ద హిట్ అయ్యా యి. సొంత ఆల్బమ్స్ లక్షల్లో అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో వీటిని దాదాపు 390 కోట్ల సార్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మద్యపానంతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక ‘టియర్‌డ్రాప్స్’ పాట అందర్నీ నిరాశపరిచింది. -
6జీ రేసులో భారత్
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతల ప్రయోజనాలను అందిపుచ్చుకునే దిశగా భారత్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ బాటలో 6జీ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే గణనీయంగా పేటెంట్లు దాఖలు చేసింది. ఈ విషయంలో వివిధ అధ్యయనాల ప్రకారం భారత్ నాలుగు, ఆరు స్థానాల్లో ఉంది. బ్రిటన్‌కి చెందిన యూ స్విచ్ ప్లాట్‌ఫాం ప్రకారం గతేడాది ఏప్రిల్ నాటికి 265 పేటెంట్లతో (6జీ) భారత్ నాలుగో స్థానంలో ఉంది. చైనా (4,604), అమెరికా (2,229), దక్షిణ కొరియా (760) తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. ఇక గ్లోబల్ ఐపీ మేనేజ్మెంట్ సంస్థ మ్యాక్స్‌వాల్ ప్రకారం 188 పేటెంట్లతో భారత్ ఆరో స్థానంలో ఉంది. (ప్రభుత్వ డేటా ప్రకారం ఈ సంఖ్య ఈ ఏడాది 200 దాటేసింది). ఈ విషయంలో బ్రిటన్ (151), జర్మనీ (84), స్వీడన్ (74), ఫ్రాన్స్ (73) కన్నా ముందుండటం గమనార్హం. 6,001 పేటెంట్లతో చైనా అగ్రస్థానంలో ఉండగా, అమెరికా (3,909), దక్షిణ కొరియా (1,417), జపాన్ (584), యూరోపియన్ యూనియన్ (214) వరుసగా టాప్ 5 ర్యాంకుల్లో ఉన్నాయి. భారత్ ప్రధానంగా బ్లాక్‌చెయిన్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ), 6జీ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎనర్జీ హార్వెస్టింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో ఎక్కువగా పేటెంట్లు దాఖలు చేసినట్లు ఫ్రాన్స్‌కి చెందిన ఐపీ సొల్యూషన్స్ సంస్థ క్వెస్టెల్ తెలిపింది. 10 శాతం వాటా లక్ష్యం.. 6జీ సాంకేతికతకు సంబంధించి భారత్ భారీ లక్ష్యాలనే పెట్టుకుంది. వచ్చే మూడేళ్లలో అంతర్జాతీయంగా 6జీ పేటెంట్లలో 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా భారత్ 6జీ అలయెన్స్ ఆవిష్కరణ, 6జీ ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్స్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంది. పేటెంట్ల దాఖలుకే పరిమితం కాకుండా 6జీ ప్రమాణాలను ప్రభావితం చేసే దిశగా కూడా భారత్ కృషి చేస్తోంది. 160 పైగా దేశాల ప్రమాణాల సంస్థలకు సభ్యత్వం ఉన్న ఐఎస్‌వోలోని (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) టెక్నికల్ కమిటీలు, సబ్‌కమిటీల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అక్టోబర్ 15 నుండి 24 వరకు భారత్‌లో వరల్డ్ టెలీకమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటీఎస్ఏ) జరగనున్న నేపథ్యంలో ఈ విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 6జీ, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాలాంటి కీలక టెక్నాలజీల భవిష్యత్ ప్రమాణాల గురించి చర్చించేందుకు 190 పైగా దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. -
Britain: రిషి వారసుడెవరో?!
బ్రిటన్‌లో రిషి సునాక్ వారసునిగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సూటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేడ్‌నాక్ మొదలుకుని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్ క్లెవర్లీ దాకా నలుగురు నేతలు రేసులో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరన్న దానిపై బహుశా బుధవారం స్పష్టత వచ్చే అవకాశముంది.గత జూలైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయంతో కన్జర్వేటివ్ (టోరీ) పార్టీ కకావికలైంది. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న అనంతరం టోరీలు ఘోర ఓటమి చవిచూశారు. పార్టీ 190 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిగా అది రికార్డులకెక్కింది. పార్లమెంటులో టోరీ ఎంపీల సంఖ్య 365 నుంచి ఎకాయెకి 121కి పడిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి జనాదరణ పొందేందుకు ఏం చేయాలన్న దానిపై నాయకులంతా వర్గాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీకి నూతన దిశానిర్దేశం చేయడం కొత్త నాయకునికి పెను సవాలే కానుంది. భారత మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్, మెల్ స్ట్రైడ్ తొలి రౌండ్లలోనే వైదొలిగి రేసులో నలుగురు మిగిలారు. వారిలో క్లెవర్లీకే మొగ్గున్నట్టు పలు సర్వేలు తేల్చినా టోరీ ఎంపీలు, నేతలు జెన్రిక్ వైపే మొగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.కేమీ బేడ్‌నాక్ (44)నైజీరియా తల్లిదండ్రులకు లండన్‌లో జన్మించారు. 2017, 2022ల్లో ఎంపీగా గెలిచారు. బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక పార్టీ నేత పదవికి తొలిసారి పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచారు. ముక్కుసూటి నాయకురాలిగా పేరు. దివంగత ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు ఆదర్శమంటారు. ట్రాన్స్జెండర్ల హక్కులు మొదలుకుని ప్రతి అంశంపైనా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమర్థులకు కీలక బాధ్యతలివ్వడం ద్వారా పార్టీలో సమూల ప్రక్షాళనే లక్ష్యమని చెబుతున్నారు.జేమ్స్ క్లెవర్లీ (54)పార్టీకి అత్యంత నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం సైన్యంలో పని చేశారు. పార్టీలో చేరి ఎంపీగా అయ్యాక హోం, విదేశాంగ మంత్రిగా చేశారు. బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు. పార్టీకి బ్రిటన్‌లోని నల్లజాతీయుల మద్దతు సాధించి పెట్టే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీలో ఇటు వామపక్ష, అటు రైట్‌వింగ్ నేతల ఆదరణ సాధించేందుకు సెంట్రిస్ట్ ఇమేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత. పలు సర్వేల్లో ముందంజలో ఉన్నారు.రాబర్ట్ జెన్రిక్ (42)పార్టీలో అతివాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వలసలపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటి కట్టడికి ఉద్దేశించిన రువాండా స్కీం ఆశించిన ఫలితాలివ్వడం లేదంటూ గత డిసెంబర్లో వలసల మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మిగతా నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు.టామ్ టూగన్హాట్ (51)మాజీ సైనికుడు. ఇరాక్‌లో పని చేశారు. అరబిక్‌లో ధారాళంగా మాట్లాడగలరు. సెంట్రిస్ట్ నాయకుడు. 2022లో పార్టీ నేత పదవికి జరిగిన పోరులో లిజ్ ట్రస్ చేతిలో ఓడారు. ఎంపిక ఇలా...టోరీల సారథి ఎంపిక ప్రక్రియ కాస్ల సంక్లిష్టంగా ఉంటుంది. తుది రేసులో ఉన్న నలుగురు నేతలు పార్టీ ఎంపీలు, ముఖ్య నేతల మద్దతు గెలుచుకోవడం కీలకం. అందుకోసం పలు అంశాలపై తమ వైఖరిని వారి ముందుంచాలి. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. టోరీ ఎంపీలు, నేతల 4 రోజుల కీలక సదస్సు బర్మింగ్‌హాంలో ఆదివారం మొదలైంది. అభ్యర్థులను వారు మంగళవారం దాకా ఇంటర్వ్యూ చేస్తారు. చివరి రోజైన బుధవారం అభ్యర్థులకు ప్రధాన పరీక్ష ఎదురవుతుంది. ఒక్కొక్కరు 20 నిమిషాల పాటు చేసే ప్రసంగం కీలకం కానుంది. ఎంపీలు, నేతలను ఆకట్టుకునే వారి ఎన్నిక దాదాపు లాంఛనమే అవుతుంది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే టోరీ ఎంపీల ఓటింగ్ ప్రక్రియ అనంతరం చివరికి ఇద్దరు అభ్యర్థులు రేసులో మిగులుతారు. వారి నుంచి తమ నాయకున్ని ఎన్నుకునేందుకు 1.7 లక్షల పై చిలుకు టోరీ సభ్యులు అక్టోబర్ 15 నుంచి 31 దాకా ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. విజేత ఎవరన్నది నవంబర్ 2న తేలుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్