యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం | Direction singer Liam Payne dies in Argentina after fall from balcony | Sakshi
Sakshi News home page

యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం

Published Fri, Oct 18 2024 5:39 AM | Last Updated on Fri, Oct 18 2024 5:39 AM

Direction singer Liam Payne dies in Argentina after fall from balcony

బ్యూనస్‌ ఎయిర్‌(అర్జెంటీనా): బ్రిటన్‌ సంగీత సంచలనం, పాప్‌ గాయకుడు, గేయ రచయిత 31 ఏళ్ల లియాం పెనీ కన్నుమూశారు. బుధవారం సాయంత్రం అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్‌ సిటీలోని ఒక విలాసవంత హోటల్‌ మూడో అంతస్థు బాల్కనీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మద్యం, మత్తుపదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల హోటల్‌ గది అంతా చిందరవందర చేసి కిందపడి చనిపోయారని వార్తలొచ్చాయి. 

పోస్ట్‌మార్టమ్‌ నివేదిక తర్వాతే మరణానికి కారణాలు తెలిసే వీలుంది. ఆయన బస చేసిన కాసాసర్‌ హోటల్‌ గదిలో మద్యంతోపాటు బెంజోడైజీపైన్‌ అనే ఔషధంను కనుగొన్నారు. బెంజోడైజీపైన్‌ను ఉద్రేకాన్ని తగ్గించేందుకు, మూర్ఛ, నరాల సంబంధ చికిత్సల్లో వాడతారు. పెనీ తన గది బాల్కనీ నుంచి దూకి ఉంటారని నగర భద్రతా మంత్రి కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పాబ్లో పోలీసీచియో మీడియాతో చెప్పారు.  

14 ఏళ్లకే సంచలనం 
2010లో బ్రిటన్‌ ప్రఖ్యాత టాలెంట్‌ రియాలిటీ షో ‘ది ఎక్స్‌ ఫ్యాక్టర్‌’లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి అద్భుతంగా పాటి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. మరో నలుగురితో కలిసి ‘వన్‌ డైరెక్షన్‌’పేరిట బాయ్‌బ్యాండ్‌ను నెలకొల్పాడు. ఈ బ్యాండ్‌ నుంచి వెలువడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యాయి. 7 కోట్ల ‘రికార్డ్‌’లు అమ్ముడుపోయాయి. 2016లో బ్యాండ్‌ నుంచి విడిపోయాక సోలోగా కెరీర్‌ను మొదలుపెట్టి సంచలనాలు సృష్టించారు.

 ఈయన చేసిన సంగీత విభావరిలు సైతం పెద్ద హిట్‌ అయ్యా యి. సొంత ఆల్బమ్స్‌ లక్షల్లో అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో వీటిని దాదాపు 390 కోట్ల సార్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మద్యపానంతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక ‘టియర్‌డ్రాప్స్‌’ పాట అందర్నీ నిరాశపరిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement