
బర్మింగ్‌హామ్‌కు ‘చెత్త’ సమస్య
పారిశుద్ధ్యకార్మికుల సమ్మెతో విలవిల
బర్మింగ్‌హామ్: బ్రిటన్‌లో రెండో అతిపెద్ద నగరంగా ఘన కీర్తులందుకుంటున్న బర్మింగ్‌హామ్ నగరం ఇప్పడు చెత్తకంపు కొడుతోంది. నగరంలో ఏ మూలన చూసినా వ్యర్థ్యాల వరద పారుతోంది. పారిశుద్ధ్యకార్మికుల సమ్మెతో నగరవ్యాప్తంగా చెత్తమూటలు గుట్టలు పేరుకుపోయాయి. వాటి కంపుతో నగరవాసుల ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. దీంతో పురుగుల భరతం పట్టే విల్ టిమ్స్ లాంటి వాళ్లకు రోజూ చేతినిండా పని దొరుకుతోంది. చెత్తకుప్పల నుంచి ఇళ్లలోకి దూసుకొచ్చే పేద్ద ఎలుకలు, బొద్దింకలు, పురుగులను చంపేయడంలో ఇలాంటి పెస్ట్‌కంట్రోల్ కార్మికులు ఇప్పుడు చాలా బిజీగా మారిపోయారు. మా ప్రాంతంలో ఎలుకల్ని పట్టండి మహాప్రభో అంటూ రోజూ వాళ్లకు ఫోన్‌చేసే స్థానికుల సంఖ్య పెరిగిపోయింది.
సమ్మెతో మొదలైన సమస్య
అధిక చెల్లింపులు చేయాలన్న డిమాండ్లతో గార్బేజ్ కలెక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో 12 లక్షల జనాభా ఉన్న నగరంలో వ్యర్థాల బ్యాగులను తరలించేవాళ్లులేక రోడ్లన్నీ చెత్తకుప్పలకు చిరునామాగా మారాయి. బల్సాల్ హెల్త్ అనే ప్రాంతంలో అయితే చెత్తకుప్పలు ఎన్నో అడుగుల ఎత్తులో పేరుకుపోయి గబ్బు వాసనతో జనాల గుండెల్లో వ్యాధుల గుబులు పుట్టిస్తున్నాయి. చిన్న పిల్లి సైజులో ఉన్న ఎలుకలు అక్కడ సంచరిస్తున్నాయని స్థానికుడు అబిడ్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. డస్ట్‌బిన్‌ల నుంచి సమీప ఇళ్లల్లో దూరుతున్న ఎలుకల సంఖ్య ఏకాఎకి పెరిగిపోయింది. దీంతో వీటిని అదుపుచేయడం స్థానిక పెస్ట్‌కంట్రోలర్ల తలకు మించిన భారమైంది. దీంతో సమీప నగరాల్లో తోటి వర్కర్లను ఇక్కడికి రప్పించి సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నంచేస్తున్నారు.
కోతే కారణమా?
గార్బేజ్ కలెక్టర్లకు అందించాల్సిన జీతభత్యాల్లో కోత పెట్టాలని సిటీ పాలకమండలి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 400 మంది గార్బేజ్ కలెక్టర్లు సమ్మెబాట పట్టారు. జీతభత్యాలు తగ్గించడం, కొంద మందిని తొలగించడం, మరికొందరి ర్యాంక్‌ను కుదించడం వంటి నిర్ణయాలతో వీళ్లంతా ఆగ్రహంతో ఉన్నారు. సిటీ కౌన్సిల్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఒక్కో వ్యక్తి గరిష్టంగా రూ.8.88 లక్షల వార్షిక వేతనం నష్టపోయే ప్రమాదముంది. దీంతో వీళ్లంతా విధులకు గైర్హాజరై తమ నిరసనను ఇలా వ్యక్తంచేస్తున్నారు.
మూలాలు 2023లో
ఈ సంక్షోభానికి 2023లోనే బీజం పడింది. ఆదాయం తగ్గిపోయి తాము దివాళా తీశామని సిటీ కౌన్సిల్ 114 నోటీస్‌ను దాఖలుచేసింది. విద్య, వ్యర్థాల సేకరణ వంటివి మినహా అన్నిరకాల సేవలను కౌన్సిల్ నిలిపేసింది. అయితే ఈ సమస్య ఇటీవల మరింత ముదిరింది. మాజీ ఉద్యోగులకు సమానంగా పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. మాజీ ఉద్యోగుల్లో మహిళలతో పోలిస్తే పురుషులకు అధిక పరిహారం అందిందని వార్తలొచ్చాయి. విషయం బయటకు పొక్కడంతో కార్మికుల ఆందోళనలు ఎక్కువయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సిల్‌కు రావాల్సిన నిధులు, గ్రాంట్లుల్లో కోత పెరిగింది. దీంతో కౌన్సిల్ మరింత సమస్యల వలయంలో చిక్కుకుంది. ఇంగ్లండ్‌లో 2010 ఏడాది సగటుతో పోలిస్తే కౌన్సిళ్లకు ఇచ్చే నిధులు, గ్రాంట్లు, పన్ను చెల్లింపుల్లో 18 శాతం కోత పెట్టినట్లు 2024 జూన్ నివేదిక వెల్లడించింది. దీంతో ‘చెత్త’సమస్య ఎప్పుడు తీరుతుందోనని స్థానికులు వాసనలకు ముక్కు మూసుకుని మరీ దిగాలుగా ఆలోచిస్తున్నారు.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
బర్మింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ వాదన వేరేలా ఉంది. ‘‘కార్మికుల వేతనాల్లో కోతలు ఉండబోవు. ప్రతిపాదనల ప్రభావానికి గురయ్యే వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కలి్పస్తాం. కొత్త ఉద్యోగానికి కావాల్సిన శిక్షణను అందిస్తాం. వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని మరింత ఆధునీకరించి, నగరంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను బలోపేతం చేస్తాం’’అని సిటీ కౌన్సిల్ స్పష్టంచేసింది. ఫిబ్రవరి వరకు కొందరు పనిచేసినా మార్చి రెండో వారం నుంచి పరిస్థితి అధ్వానంగా తయారైంది. చెత్తసేకరణ, తరలింపు దాదాపు ఆగిపోయింది. స్వల్పస్థాయిలో కొందరు పనిచేసేందుకు ముందుకొచి్చనా మిగతా వాళ్లు అడ్డుకుంటున్నారు. దీంతో ఇళ్ల మధ్యలో చెత్తకుప్పలున్నాయా? చెత్తకుప్పల పక్కన ఇళ్లు కట్టుకున్నారా? అనే పరిస్థితి దాపురించిందని ఒక స్థానికుడు వ్యాఖ్యానించారు. ‘‘మేం చేసేది చెత్తపనే. కానీ అత్యంత ముఖ్యమైన పని. చేస్తున్న పనికిగాను కార్మికులకు సరైన గౌరవవేతనం దక్కాల్సిందే’’అని కార్మికుల సంఘం నేషనల్ లీడ్ ఆఫీసర్ ఒనే కసబ్ డిమాండ్‌చేశారు.