జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మెతో అశోక్‌నగర్ క్రాస్‌రోడ్ వద్ద పేరుకుపోయిన చెత్త
- మున్సిపల్ కార్మికుల సమ్మెతో పేరుకుపోతున్న వేల టన్నుల చెత్త
- వీరికి తోడు వీధిదీపాలు, నీటిసరఫరా తాత్కాలిక సిబ్బందీ సమ్మెలోకి..
- పట్టు వీడని కార్మిక జేఏసీ.. మెట్టు దిగని సర్కారు
- ఇరువర్గాల మధ్య నిలిచిపోయిన చర్చలు
- సమ్మె నుంచి నిష్ర్కమించిన టీఆర్‌ఎస్‌కేవీ
- మరింత ఉద్ధృతం చేసిన మిగతా సంఘాలు
- నేటి నుంచి అత్యవసర సేవలు కూడా బంద్
- నేడు ఇందిరా పార్కు వద్ద భారీ బహిరంగ సభ
- చెత్తాచెదారంతో ప్రజలకు తప్పని సహవాసం
సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె పరిష్కార మార్గాలు మూసుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక ఐక్య సంఘాలు పట్టు విడుపులకు పోవడంతో ఉభయపక్షాల మధ్య గత రెండు రోజులుగా చర్చలు ఆగిపోయాయి. 10వ పీఆర్‌సీ సిఫారసులకు తగ్గట్లు కనీస వేతనాల పెంపుపై నిర్ధిష్ట హామీ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరడంతో గత బుధవారం చివరిసారిగా జరిగిన మూడో దఫా చర్చలు విఫలమయ్యాయి.
ఆర్థికపరమైన ఈ డిమాండ్లపై సీఎం కేసీఆరే నిర్ణయం తీసుకుంటారని, అప్పటి వరకు కొంత సమయం ఇవ్వాలన్న మంత్రుల ప్రతిపాదనలను కార్మిక నేతలు తిరస్కరించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత ప్రభుత్వం, కార్మిక జేఏసీ మధ్య గురు, శుక్రవారాల్లో చర్చలు జరగలేదు. కాగా, అధికార పార్టీ అనుబంధ టీఆర్‌ఎస్‌కేవీ సమ్మె నుంచి నిష్ర్కమించింది. టీఆర్‌ఎస్‌కేవీ-జీహెచ్‌ఎంఈయూ నేతలతో శుక్రవారం మంత్రి నాయిని ప్రత్యేక సమావేశం జరపగా.. సమ్మె విరమణకు యూనియన్ ఒప్పుకుంది.
గురువారమే సమ్మెలోకి దిగిన టీఆర్‌ఎస్‌కేవీ ఒక్క రోజులోనే అస్త్ర సన్యాసం చేసిందని, దీని ప్రభావం సమ్మెపై ఉండదని మిగిలిన కార్మిక సంఘాలు ప్రకటించాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్.. సీఎంను కలసి హైదరాబాద్‌లోని పరిస్థితులను వివరించారు. కార్మికుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా వున్నారని, ఈ నెల 30 లోగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన ఉత్తర్వులు చేస్తామని సీఎం తెలిపినట్లు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ ప్రతిపాదనను కార్మిక సంఘాలు తిరస్కరించాయి.
నేటి నుంచి అత్యవసర సేవలు బంద్...
సమ్మెను ఉధృతం చేసేందుకు శనివారం నుంచి అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తామని కార్మిక జేఏసీ హెచ్చరించింది. జల మండలితో సహా రాష్ట్ర వ్యాప్తంగా నీటి సరఫరా, వీధి దీపాలు, పరిపాలన విభాగాల తాత్కాలిక ఉద్యోగులూ సమ్మెలోకి దిగుతారని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు స్తంభించనున్నాయి.
నేడు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా...
మునిసిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా శనివారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ‘ఏడు కార్మిక సంఘాల ఐక్య వేదిక’ ప్రకటించింది. సీఐటీయు, ఎఐటీయుసీ, టీఐటీయుసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, ఎఐయుటీయూసీ, ఐఎఫ్‌టీయూ సంఘాల ప్రతినిధులు పాలడుగు భాస్కర్, జె.వెంకటేష్, ఎం.కె.బోస్, రెబ్బరామారావు, ఏసురత్నం, సుధీర్, ప్రదీప్, ఎ.శంకర్‌లు శుక్రవారం విలేకరులతో ఈ విషయాన్ని వెల్లడించారు. మహాధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్మిక నేతలు పాల్గొంటారని తెలిపారు.
చెత్తతో జనం సహవాసం...
ఈ నెల 6 నుంచి సాగుతున్న సమ్మెతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 67 చిన్నా పెద్దా నగరాలు, పట్టణాల్లో వేలాది టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. రోడ్లు, వీధులు, జన ఆవాసాల మధ్య చెత్తా చెదారమే కనిపిస్తోంది. దుర్గంధం వెదజల్లుతున్న చెత్తతో ప్రజలు సహవాసం చేయక తప్పడం లేదు. మరో వైపు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
పనులను అడ్డుకున్న కార్మికులు...
గ్రేటర్‌లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోరుుంది. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. ప్రైవే టు వాహనాలు.. తాత్కాలిక(ప్రైవేటు) కార్మికులతో చెత్త తరలింపు పనులు చేపట్టింది. ఈ పనులను కార్మికులు అడ్డుకున్నారు. దాడులు చేశారు. ఇరువర్గాల వారు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. టోలీచౌకి, వూసబ్‌ట్యాంక్, కుత్బుల్లాపూర్, తార్నాక ప్రాంతాల్లో తాత్కాలిక కార్మికులను అడ్డుకున్నారు. జీహెచ్‌ఎంసీలోని గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ మాత్రం సమ్మె విరమించినట్లు ప్రకటించింది. చెత్తకుప్పలతోపాటు వివిధ ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.
ఎస్మా ప్రయోగించే అవకాశం...
కార్మికుల సమ్మె కారణంగా తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా రెండో శనివారమైనప్పటికీ నేడు జీహెచ్‌ఎంసీ పనిచేస్తుందని స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మాను ప్రయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. శనివారం నుంచి విధులకు హాజరయ్యే ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లకు రెట్టింపు వేతనం ఇస్తావుని తెలిపారు. జీహెచ్‌ఎంసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున సమ్మెలోని కార్మికులంతా వెంటనే విధులకు హాజరు కావాల్సిందిగా సోమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.