
బహిరంగ ప్రదేశాల్లో తగ్గుతున్న ‘చెత్త’ సమస్యలు
మరిన్ని ఉల్లంఘనలపై చర్యలకు సిద్ధం
సత్ఫలితాలిస్తున్న జీహెచ్‌ఎంసీ ప్రత్యేక యాప్
ఈ– చలాన్లతో పెరుగుతున్న ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఓవైపు చెత్త సమస్యల పరిష్కారం.. మరో వైపు జీహెచ్‌ఎంసీ ఖజానాకు గండి పడకుండా రెండు రకాలుగా ఉపకరించేందుకు జీహెచ్‌ఎంసీ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ‘చెత్త వేస్తే ఈ–చలాన్’ విధానం మంచి ఫలితాలిస్తోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విధానం కోసం జీహెచ్‌ఎంసీ (GHMC) ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చి క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సంబంధిత అధికారులకు శిక్షణ నిచ్చింది. వాటిని వినియోగిస్తూ ప్రస్తుతం వారు మూడు రకాల ఉల్లంఘనలకు పెనాల్టీలు (Penalties) విధిస్తున్నారు.
సొమ్ము పక్కదారి పట్టకుండా..
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారెవరో గుర్తించేందుకు ప్రస్తుతం అన్నిప్రాంతాల్లో తగిన సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో.. తొలుత దుకాణాల ముందు చెత్త వేసేందుకు ప్రత్యేకంగా చెత్త డబ్బాలు ఏర్పాటు చేయని దుకాణదారులకు, దుకాణాల ముందు వ్యర్థాలు వేస్తున్న వారికి, ఎక్కడ పడితే అక్కడ సీఅండ్‌డీ (నిర్మాణ, కూల్చివేతల) వ్యర్థాలు వేసినట్లు గుర్తించిన వారికి ఈ–చలానాలు (E Challan) విధిస్తున్నారు. దీంతో పాటు పెనాల్టీలను సైతం యూపీఐ (UPI) ద్వారానే చెల్లించాల్సి ఉండటంతో పెనాల్టీల సొమ్ము పక్కదారి పట్టకుండా జీహెచ్‌ఎంసీ ఖజానాలోకే చేరేందుకు మార్గం ఏర్పడింది.
పెనాల్టీల వివరాలు అందుబాటులోకి..
గతంలో పెనాల్టీలకు పుస్తకాల్లోని రసీదులిచ్చినప్పుడు ఎవరికి ఎంత మేర పెనాల్టీ విధించారో, ఎంత వసూలు చేశారో, ఎంత జీహెచ్‌ఎంసీ ఖజానాలో చెల్లించారో, అసలు చెల్లించారో లేదో తెలిసేది కాదు. ప్రస్తుతం ఈ–చలానా కావడంతో ఎంతమందికి చలానాలు విధించింది, వాటిలో ఎంతమంది చెల్లించింది, ఎంత మొత్తం చెల్లించింది తదితర వివరాలు యాప్‌లోనే ఎప్పుడైనా ఉన్నతాధికారులు సైతం చూడవచ్చని అడిషనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్ (శానిటేషన్) తెలిపారు.
చదవండి: అసలు హెచ్‌సీయూ భూములు ఎన్ని.. వివాదం ఏంటి?
అంతేకాకుండా పెనాల్టీలు విధిస్తారని తెలిసి యజమానులు తమ దుకాణాల ముందు బిన్లు ఏర్పాటు చేసుకుంటారని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త, సీఅండ్‌డీ వ్యర్థాలు వేసేవారు కూడా క్రమేపీ తగ్గుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి యాప్‌తో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని ఉల్లంఘనలకు సైతం ఈ యాప్‌ను వినియోగించుకొని ఈ–చలానాలను విధించనున్నట్లు రఘు ప్రసాద్ తెలిపారు.
గత వారం రోజుల్లో దుకాణాల ముందు చెత్త డబ్బాలు ఉంచని 189 మంది దుకాణాల నిర్వాహకులకు విధించిన పెనాల్టీలు రూ.4,10,300.
→ ఇందులో మంగళవారం 19 మందికి రూ. 55,400 పెనాల్టీలు విధించారు.
→ వారం రోజుల్లో యూసుఫ్‌గూడ సర్కిల్‌లో అత్యధికంగా 33 మందికి రూ.1,36,000 పెనాల్టీ విధించారు.
→ మెహిదీపట్నం, ముషీరాబాద్, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, బేగంపేట, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్ సర్కిళ్లలో మాత్రం ఇంకా ఈ–చలానాలు ఇంకా ప్రారంభించనట్లు తెలిసింది. ఈ సర్కిళ్లలో ఇంతవరకు ఎలాంటి పెనాల్టీలు విధించలేదు.
Comments
Please login to add a commentAdd a comment