
ఎల్‌ఆర్‌ఎస్‌పై నీటిపారుదల, వ్యవసాయ అధికారుల అలసత్వం
తమకు కుదిరినప్పుడే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తామంటూ పేచీలు
అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్‌లో పదేళ్ల క్రితం నాలుగు వందల చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు. 2020లో ఎల్‌ఆర్‌ఎస్ (LRS) కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఫీజు చెల్లించాలని నోటీస్ వచ్చింది. కానీ.. ఆ స్థలం చెరువుకు దగ్గరలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనల ప్రకారం కూడా ఇప్పుడు రెవెన్యూ, నీటిపారుదల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే హెచ్‌ఎండీఏ నుంచి ప్రొసీడింగులు లభిస్తాయి. కానీ.. రెవెన్యూ, నీటిపారుదల అధికారుల కోసం ఎదురుచూస్తూ సదరు వ్యక్తి తన స్థలం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.
ఏదో ఒకరోజు వస్తామని అధికారులు చెబుతున్నారు. ఏ రోజు వస్తారో తెలియక సదరు వ్యక్తి నిత్యం హిమాయత్‌నగర్ (Himayat Nagar) నుంచి కోత్తాపూర్‌కు, సంగారెడ్డికి తిరగాల్సి వస్తోంది. ఇది ఒక్క కోత్లాపూర్‌కు చెందిన బాధితుడి సమస్య మాత్రమే కాదు. చాలామంది దరఖాస్తుదారులు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు పొడిగించినప్పటికీ సాంకేతిక చిక్కులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకాన్ని సద్వియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజులు చెల్లించాలా.. వద్దా..?
చెరువులు, కుంటలు తదితర నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నోటీసు అందుకున్నవారు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. క్షేత్రస్థాయి తనిఖీల్లో ఆ స్థలం నీటి వనరులను ఆనుకొని ఉన్నట్లు తేలితే చెల్లించిన ఫీజును తిరిగి దరఖాస్తుదారుల ఖాతాలో జమ చేస్తారు.
కాగా.. ప్రాసెసింగ్ పేరిట 10 శాతం వసూలు చేస్తారు. దీంతో చాలామంది ముందస్తుగా ఫీజులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన తరువాతనే ఫీజు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల మధ్య సమన్వయ లోపం తదితర కారణాలతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి వర్గాలు శివారు ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారు. అలాగే.. వివిధ జిల్లాలకు చెందినవారు సైతం నగరానికి చేరువలో సొంత స్థలాలను కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఘట్‌కేసర్, పోచారం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో స్థలాలను కొనిపెట్టుకున్నారు.
ఇలా వివిధ చోట్ల కొనుగోలు చేసిన వాళ్లంతా అటు అధికారుల చుట్టూ, ఇటు తమ స్థలాల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ప్రొసీడింగులు లభిస్తాయో లేదోననే సందేహంతో ఫీజులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. హెచ్‌ఎండీఏ (HMDA) కార్యాలయంతో పాటు పలు మున్సిపల్ కార్యాలయాలకు బాధితులు బారులు తీరుతున్నారు. ఎల్–1, ఎల్–2 స్థాయిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.
సర్వర్‌ల డౌన్‌తో అవస్థలు..
సాంకేతిక కష్టాలు అధికారులను సైతం వదలడం లేదు. తరచూ సర్వర్లు డౌన్ కావడంతో అకస్మాత్తుగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ స్తంభించిపోతోంది. తిరిగి ఆన్‌లైన్ (Online) సేవలను పునరుద్ధరించేవరకు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘ఒక్కో జోన్‌లో నలుగురైదుగురు టెక్నికల్ సిబ్బంది పని చేస్తున్నప్పటికీ రోజుకు 40 ఫైళ్లు కూడా పరిష్కరించలేకపోతున్నాం’ అని ఒక అధికారి తెలిపారు.
చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
సర్వర్ డౌన్ (Server Down) కావడంతో గంటకోసారి ‘ఎర్రర్’ వచ్చేసి పనులు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు 40 వేలుకూడా పూర్తి కాకపోవడం గమనార్హం. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల రూపంలో హెచ్‌ఎండీఏకు రూ.1,500 కోట్లు వస్తాయని అంచనా. కాగా.. ఇప్పటి వరకు రూ.120 కోట్ల ఆదాయం కూడా లభించలేదు.