land regularisation scheme
-
ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్‌లో పదేళ్ల క్రితం నాలుగు వందల చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు. 2020లో ఎల్ఆర్ఎస్ (LRS) కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఫీజు చెల్లించాలని నోటీస్ వచ్చింది. కానీ.. ఆ స్థలం చెరువుకు దగ్గరలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం కూడా ఇప్పుడు రెవెన్యూ, నీటిపారుదల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే హెచ్ఎండీఏ నుంచి ప్రొసీడింగులు లభిస్తాయి. కానీ.. రెవెన్యూ, నీటిపారుదల అధికారుల కోసం ఎదురుచూస్తూ సదరు వ్యక్తి తన స్థలం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.ఏదో ఒకరోజు వస్తామని అధికారులు చెబుతున్నారు. ఏ రోజు వస్తారో తెలియక సదరు వ్యక్తి నిత్యం హిమాయత్‌నగర్ (Himayat Nagar) నుంచి కోత్తాపూర్కు, సంగారెడ్డికి తిరగాల్సి వస్తోంది. ఇది ఒక్క కోత్లాపూర్‌కు చెందిన బాధితుడి సమస్య మాత్రమే కాదు. చాలామంది దరఖాస్తుదారులు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగించినప్పటికీ సాంకేతిక చిక్కులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకాన్ని సద్వియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫీజులు చెల్లించాలా.. వద్దా..? చెరువులు, కుంటలు తదితర నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫీజు నోటీసు అందుకున్నవారు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. క్షేత్రస్థాయి తనిఖీల్లో ఆ స్థలం నీటి వనరులను ఆనుకొని ఉన్నట్లు తేలితే చెల్లించిన ఫీజును తిరిగి దరఖాస్తుదారుల ఖాతాలో జమ చేస్తారు. కాగా.. ప్రాసెసింగ్ పేరిట 10 శాతం వసూలు చేస్తారు. దీంతో చాలామంది ముందస్తుగా ఫీజులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన తరువాతనే ఫీజు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల మధ్య సమన్వయ లోపం తదితర కారణాలతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి వర్గాలు శివారు ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారు. అలాగే.. వివిధ జిల్లాలకు చెందినవారు సైతం నగరానికి చేరువలో సొంత స్థలాలను కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఘట్కేసర్, పోచారం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో స్థలాలను కొనిపెట్టుకున్నారు. ఇలా వివిధ చోట్ల కొనుగోలు చేసిన వాళ్లంతా అటు అధికారుల చుట్టూ, ఇటు తమ స్థలాల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ప్రొసీడింగులు లభిస్తాయో లేదోననే సందేహంతో ఫీజులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయంతో పాటు పలు మున్సిపల్ కార్యాలయాలకు బాధితులు బారులు తీరుతున్నారు. ఎల్–1, ఎల్–2 స్థాయిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.సర్వర్ల డౌన్‌తో అవస్థలు.. సాంకేతిక కష్టాలు అధికారులను సైతం వదలడం లేదు. తరచూ సర్వర్లు డౌన్ కావడంతో అకస్మాత్తుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్తంభించిపోతోంది. తిరిగి ఆన్లైన్ (Online) సేవలను పునరుద్ధరించేవరకు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘ఒక్కో జోన్లో నలుగురైదుగురు టెక్నికల్ సిబ్బంది పని చేస్తున్నప్పటికీ రోజుకు 40 ఫైళ్లు కూడా పరిష్కరించలేకపోతున్నాం’ అని ఒక అధికారి తెలిపారు.చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలుసర్వర్ డౌన్ (Server Down) కావడంతో గంటకోసారి ‘ఎర్రర్’ వచ్చేసి పనులు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. హెచ్ఎండీఏలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు 40 వేలుకూడా పూర్తి కాకపోవడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో హెచ్ఎండీఏకు రూ.1,500 కోట్లు వస్తాయని అంచనా. కాగా.. ఇప్పటి వరకు రూ.120 కోట్ల ఆదాయం కూడా లభించలేదు. -
నారాయణ పేట జిల్లాలో విచిత్రం
కోస్గి: ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పిస్తూ అమలుచేస్తున్న ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గందరగోళంగా మారింది. 336 గజాల ప్లాటుకు ఏకంగా రూ.104 కోట్ల ఎల్ఆర్ఎస్ ఫీజు విధించటంతో సదరు ప్లాటు యజమాని బిక్కమొహం వేశాడు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం భోగారం (Bogaram) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తన ప్లాటు క్రమబద్ధీకరణ (Land Regularisation) కోసం గతంలో రూ.1,000 ఫీజు చెల్లించి వివరాలు నమోదు చేసుకున్నాడు.గురువారం తన ప్లాటుకు సంబంధించిన ఫీజు వివరాలు తెలుసుకునేందుకు కోస్గిలోని ఓ ఆన్లైన్ కేంద్రానికి వెళ్లాడు. అయితే 336.9 గజాల ప్లాటుకు రూ.104,35,19,683 ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని ఆన్లైన్లో చూపడంతో అవాక్కయ్యాడు. ఆన్లైన్లో చూపిన వివరాల మేరకు 336.9 గజాల ప్లాటుకు సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన మార్కెట్ విలువ (Market Value) రూ. 2,21,22,016 కుగాను రెగ్యులరైజ్ చార్జీలు రూ.1,12,676,14 ఉండగా.. 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీ రూ.104.34 కోట్లు చూపించారు. ఈ విషయంపై ఎంపీడీఓ శ్రీధర్‌ను వివరణ కోరగా.. సదరు ప్లాటు యజమాని వివరాలు సేకరించి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఆ ప్లాటుకు తగ్గిన ఎల్ఆర్ఎస్ రుసుము!జడ్చర్ల: జడ్చర్లలోని ఓ ప్లాటుకు ఎల్ఆర్ఎస్ రుసుము రూ.27.33 కోట్లుగా నిర్ణయించటంపై గురువారం మీడియాలో వచ్చిన కథనాలపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సంబంధిత దరఖాస్తును మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలించి సరిచేశారు. కిష్టారెడ్డి నగర్‌లోని సర్వే నంబర్ 108లో కె.ఝాన్సీకి చెందిన 200 చదరపు గజాల ప్లాటుకు ఎల్ఆర్ఎస్ ఫీజు (LRS Fee) ఏకంగా రూ.27,33,42,785గా నిర్ణయించిన విషయం విదితమే. ఈ విషయాన్ని మీడియా వెలుగులోకి తేవటంతో అధికారులు తప్పును సరిదిద్దారు. ఆ ప్లాటుకు రూ.30,034లను ఎల్ఆర్ఎస్ ఫీజుగా నిర్ణయించారు. అలాగే తప్పుగా చూపిన ప్లాటు విస్తీర్ణాన్ని కూడా సరిచేశారు.హైదరాబాద్‌లో స్పందన అంతంతే.. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారు 1,07,865 మంది కాగా.. వీరిలో ఇప్పటి వరకు కేవలం 5,505 మంది మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని వినియోగించుకున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.69.62 కోట్లు సమకూరాయి. మొత్తం దరఖాస్తుదారుల్లో 58,523 మందికి ఆటోమేటిక్‌గా ఫీజు లెటర్స్ జారీ కాగా, వారిలో కేవలం 5,505 మంది మాత్రమే 25 శాతం ఫీజు రాయితీని వినియోగించుకున్నారు. వీరిలో 40 మందికి ప్రొసీడింగ్స్ జారీ అయినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుందని, మిగతా వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ సూచించింది.చదవండి: సజ్జనార్‌కు మరో కీలక బాధ్యత? -
ఎల్ఆర్ఎస్తో ముప్పు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) జనానికి చుక్కలు చూపిస్తోంది. గడువులోగా స్థలాలను క్రమబద్ధీకరించుకొనేందుకు దరఖాస్తు చేసుంటున్నవారిని సాంకేతిక చిక్కుముడులు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఫీజుల లెక్కలు సైతం గందరగోళానికి గురిచేస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న నాటి మార్కెట్ విలువతో సంబంధం లేకుండా ఒక్కో ప్లాట్‌కు ఒక్కో విధంగా ఫీజు విధించడంతో దరఖాస్తుదారులు అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. కొంతమంది దరఖాస్తుదారులకు ఎల్ఆర్ఎస్ (LRS) ఫీజు కంటే ఓపెన్ స్పేస్ ఫీజులు ఎక్కువగా వస్తున్నాయి. కొందరికి భూమి మార్పునకు సంబంధించిన ఫీజులు తేలడం లేదు. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు సైతం ఎలాంటి పరిష్కారం చూపలేక చేతులెత్తేస్తున్నారు.మార్చి 31వ తేదీ లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం తగ్గింపు లభిస్తుందనే ఉద్దేశంతో జనం ఆసక్తి చూపుతున్నారు. కానీ ఫీజులు చెల్లించిన వారికి ఇప్పటి వరకు ప్రొసీడింగ్స్ రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఫీజు చెల్లించిన వారికి మార్చి అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ప్రొసీడింగ్స్‌ను ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. దీంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు కనీసం 10 వేల దరఖాస్తులు కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ ప్రకటించిన తర్వాత ఒక్కో జోన్ పరిధిలో కనీసం వెయ్యి దరఖాస్తులను కూడా పరిష్కరించలేకపోయినట్లు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటాడుతున్న సాంకేతిక చిక్కులు.. ఎల్ఆర్ఎస్ పథకానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. దీనిపై హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల్లోని పట్టణ ప్రణాళికా విభాగాలకు అవగాహన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం వెబ్‌సైట్‌తో పాటు అధికారుల పనిని సులభతరం చేసేలా ఓ మొబైల్ యాప్‌ను కూడా రూపొందించారు. కానీ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలులో రకరకాల చిక్కులు ఎదురవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.‘ఒక్కోసారి సేకరించిన డాటా మొత్తం డిలీట్ అవుతోంది. దాంతో మరోసారి డాటా నమోదు చేసుకోవాల్సి వస్తోంది. ఒక పనిని ఒకటికి రెండుసార్లు చేయడంతో జాప్యం జరుగుతోంది’ అని ప్లానింగ్ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో మొబైల్ యాప్ (Mobile App) పని చేయడం లేదు. దీంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణంగా ఎల్ఆర్ఎస్ ఫీజు నమోదైన తర్వాత స్థల మార్పిడికి చెల్లించాల్సిన ఫీజు వివరాలు కూడా నమోదు కావాలి. కానీ ఇందులో ఏదో ఒకటి మాత్రమే నమోదు కావడంతో అలాంటి ఫైళ్లను పెండింగ్ జాబితాలో పెట్టేస్తున్నారు.దరఖాస్తుదారుల్లో గందరగోళం.. ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. ఆ ఏడాది ఆగస్టు వరకు దరఖాస్తు చేసుకున్నవాళ్లకు మాత్రమే ఇప్పుడు క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వం నిర్ణయించిన భూముల మార్కెట్ ధర ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఫీజుల లెక్కల్లోనూ రకరకాల తప్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు. చదవండి: మా గ్రామాలను ఎఫ్‌సీడీఏలో కలపండిఇలా తప్పుడు ఫీజులు నమోదైన దరఖాస్తులను పరిశీలించి సవరించేందుకు సాంకేతికంగా మార్పులు చేయాల్సివస్తోంది. ఈ సవరణలు అధికారులు స్వయంగా చేసేందుకు అవకాశం లేదు. సీజీజీలోనే సవరణ జరగాలి. ఆ విధంగా మరికొంత జాప్యం జరుగుతోంది. హెచ్ఎండీఏలోని శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ (Ghatkesar) జోన్ల పరిధిలో ఇలాంటి తప్పులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. కేవలం రూ.4000 చొప్పున ఓపెన్ స్పేస్ ఫీజు నమోదు కావాల్సి ఉండగా.. కందుకూరు మండలం పులిమామిడిలో ఒక స్థలంలో ఓపెన్ స్పేస్ ఫీజు ఏకంగా రూ.లక్షకు పైగా రావడంతో అధికారులే విస్మయానికి గురయ్యారు.ఒత్తిడి పెంచడంతోనే.. సీజీజీ రూపొందించిన టెక్నాలజీలో తరచూ మార్పులు, చేర్పులు చేయడంతోనే ఈ ఇబ్బందులు, పొరపాట్లు జరుగుతున్నట్లు టెక్నికల్ సిబ్బంది చెబుతున్నారు. మొదట్లో హెచ్ఎండీకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని తర్వాత నీటిపారుదల, రెవిన్యూ శాఖలకు కూడా విస్తరించాల్సి వచ్చింది. ఆ తర్వాత చెరువులు, కుంటలు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలను మరోసారి మార్పు చేయాల్సి వచ్చింది. ఇలా తరచూ టెక్నాలజీలో మార్పుల వల్ల కూడా తప్పులు చోటుచేసుకుంటున్నాయని సీజీజీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చడీచప్పుడు లేకుండా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అనుమతుల్లేని లేఅవుట్లు, వెంచర్ల క్రమబద్ధీకరణను ఇప్పటికే ప్రారంభించిన మున్సిపల్ శాఖ..గప్‌చుప్‌గా తన పని తాను చేసుకుపోతోంది. క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించాలంటూ డెవలపర్లకు నోటీసులు పంపుతోంది. ఈ నోటీసులు అందుకున్న డెవలపర్లు భూముల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద ఫీజు చెల్లిస్తే రిజిస్ట్రేషన్‌కు వీలుగా సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో జరుగుతుండగా, త్వరలోనే రాష్ట్రమంతా విస్తరింపజేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 2020లో ఎల్ఆర్ఎస్ కింద రూ.10 వేల దరఖాస్తు ఫీజు చెల్లించినవారికే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కోర్టు కేసుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు విడుదల చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ సమయంలో డెవలప్మెంట్ చార్జీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో 1,337 లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ లేఅవుట్లలో మొత్తం 1.32 లక్షల ప్లాట్లు ఉండగా, 40,389 ప్లాట్లు అమ్ముడుపోలేదు. ఈ ప్లాట్లను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయని డెవలపర్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకున్న వాటిలో 688 లేఅవుట్లు ఎల్ఆర్ఎస్కు అర్హమైనవిగా మున్సిపల్ యంత్రాంగం గుర్తించింది. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోనూ 304 లేఅవుట్లకు గాను 140 లేఅవుట్లను అర్హమైనవిగా గుర్తించింది. ఫీజు చెల్లించి అమ్ముడుపోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి పొందాల్సిందిగా ఆయా లేఅవుట్ల డెవలపర్లకు నోటీసులిచ్చింది. ఈ నోటీసులు అందుకున్నవారు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తే వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇస్తోంది. ఈ సర్టిఫికెట్లో ఫలానా సర్వే నంబర్లో చేసిన ఫలానా వెంచర్లో ఫలానా నంబర్ నుంచి ఫలానా నంబర్ వరకు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చెల్లించారని, ప్రస్తుతానికి ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవచ్చని, ఆయా ప్లాట్లలో నిర్మాణాలకు వెళ్లినప్పుడు మిగిలిన డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలని పేర్కొంటోంది. ఈ సర్టిఫికెట్లు ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. వారం, పదిరోజుల్లో మోక్షం! ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏం చేస్తే ఏమవుతుందోనన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి ఉండాలని, తీర్పు ఎలా వస్తుందో చూసి అప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయిద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొందరు చెపుతుండగా, వారం నుంచి పదిరోజుల్లోపు వ్యక్తిగత ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు కూడా మోక్షం కలుగుతుందని, ఏదోరకంగా ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తుందని మరికొందరు అధికారులు చెపుతుండడం గమనార్హం. లక్షల దరఖాస్తులను ఏం చేద్దాం? వెంచర్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణతో హైదరాబాద్ నగర శివార్లతో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లోని చాలా వరకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయి. అయితే వ్యక్తిగతంగా ఎల్ఆర్ఎస్ కోసం లక్షల్లో దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితేంటన్నది అటు మున్సిపల్, ఇటు రిజిస్ట్రేషన్ వర్గాలకు అంతు పట్టడం లేదు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తుండటంతో వ్యక్తిగత దరఖాస్తుల జోలికి వెళితే ఏం జరుగుతుందనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఇదే విషయమై అటు మున్సిపల్, ఇటు రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ గత రెండు నెలలుగా చర్చిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లాట్ల క్రమబద్ధీకరణను ఎలా చేయాలన్న దానిపై కొన్ని ప్రణాళికలు కూడా రూపొందించినట్టు సమాచారం. ఇదీ చదవండి: మాంద్యం ముప్పు ఎవరికి? -
సర్కారు స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ సర్వే షురూ..
సాక్షి, హైదరాబాద్: సర్కారు స్థలాల్లో నిర్మాణాలు చేపట్టి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇప్పుడు ఈ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. ఆక్రమిత ప్రభుత్వ స్థలాలపై క్షేత్ర స్థాయి విచారణకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గత రెండు నెలల క్రితం జీవో 58, 59 అనుబంధంగా విడుదలైన జీవో కింద వచ్చిన దరఖాస్తులపై విచారణ ప్రారంభమైంది. ప్రతి 250 దరఖాస్తులకు ఒక బృందం చొప్పున క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తి వివరాలను సేకరిస్తోంది. ప్రతి మండల స్థాయి కమిటీకి జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. సమగ్ర వివరాల సేకరణ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి నివాసం డోర్ టూ డోర్ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, తదితర ఆధారాలు సేకరించి అక్కడికక్కడే ‘జీవో 58, 59 మొబైల్ యాప్’లో నమోదు చేస్తున్నారు. అనంతరం వాటిని కలెక్టర్ లాగిన్‌కు సిఫార్సు చేస్తారు. మరోమారు వాస్తవ పరిస్థితిని పరిశీలించిన అనంతరం క్రమబద్ధీకరణ దరఖాస్తు ఆమోదం లేదా తిరస్కరించే విధంగా చర్యలు చేపట్టారు. 1.14 లక్షలపైనే.. గ్రేటర్లో క్రమబద్ధీకరణ కోసం సుమారు 1.14 లక్షల పైన కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. నాలుగేళ్ల క్రితం నాటితో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ పరిధిలో జిల్లా వారిగా పరిశీలిస్తే అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 71,316, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దరఖాస్తులు ఇలా కుత్బుల్లాపూర్ –23,878, కాప్రా– 15,848, శేరిలింగంపల్లి– 9,854, కూకట్పల్లి– 9,014, అబ్దుల్లాపూర్‌మెట్–5,990,బాలాపూర్– 4,494, ఉప్పల్–4,231, సరూర్‌నగర్– 3,669, దుండిగల్–3,112, షేక్‌పేట– 2,980, బాచుపల్లి–2,739 హయత్‌నగర్– 2471, మేడిపల్లి– 2,011, ఖైరతాబాద్–1,987, గండిపేట–1,741, ఆసిఫ్‌నగర్– 1,732, రాజేంద్రనగర్– 1,527, సైదాబాద్– 1,147, శంకర్పల్లి– 883, ముషీరాబాద్– 751. (క్లిక్: పాతబస్తీ మెట్రోపై మళ్లీ కదలిక!) -
టాప్‌లో శేరిలింగంపల్లి.. గతంతో పోల్చితే తగ్గిన దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: సర్కారు ఆక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మహానగర పరిధిలో దాదాపు 58 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడేళ్ల క్రితం విడుదల చేసిన జీవోలు 58, 59లకు అనుబంధంగా తాజాగా జీవో 14 విడుదల చేసి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో క్రమబద్ధీకరణకు నోచుకొని అక్రమిత నివాస స్ధలాల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. గతంతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. అందులో సైతం నగర శివార్లు శేరిలింగంపల్లి, అబ్దుల్లాపూర్మేట్, బాలపూర్, సరూర్‌నగర్, షేక్‌పేట, హయత్‌నగర్ మండలాల్లో అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం మీద గతంలో 1.66 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి అందులో 35 శాతానికి పడిపోయాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డిలో 31,830, ఆ తర్వాత మేడ్చల్‌లో 14,500కు పైగా, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో జీవో 58, 59 కింద దరఖాస్తులు ఇలా: శేరిలింగంపల్లి 9854, అబ్దుల్లాపూర్‌మెట్ 5990, బాలాపూర్ 4494, సరూర్‌నగర్ 3669, షేక్‌పేట 2980, హయత్‌నగర్ 2471, ఖైరతాబాద్ 1987, గండిపేట 1741, ఆసీఫ్‌నగర్ 1732, రాజేంద్రనగర్ 1527, సైదాబాద్ 1147, శంకర్పల్లి 883, ముషీరాబాద్ 751, మారేడుపల్లి 706, సికింద్రాబాద్ 458, ఇబ్రహీంపట్నం 354, అంబర్‌పేట 265, మహేశ్వరం 246, బండ్లగూడ 236, హిమాయత్‌నగర్ 202, శంషాబాద్ 166, గోల్కొండ 114, నాంపల్లి 113, బహదూర్‌పురా 87, ఆమన్‌గల్ 87, అమీర్‌పేట 86, మొయినాబాద్ 67. -
125 గజాల వరకు ఉచితం... ఆపై పైకం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను 125 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయనున్నారు. అందు కోసం గత నెల 21 నుంచి మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మార్చి 31తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆయితే అధికారులు ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం.. పేదలకు క్రమబద్ధీకరణ జీఓ పై సరైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. జవహర్‌నగర్ కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం జీఓ.58, 59 దరఖాస్తు అవగాహన కోసం మేయర్ మేకల కావ్య అధ్యక్షతన కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం కీసర ఆర్డీవో రవి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్‌లో కార్పొరేషన్, రెవెన్యూ సంయుక్తంగా చేయాల్సిన పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాప్రా తహసీల్దార్ అనిత, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కేవలం వీరికే వర్తిస్తుంది.. 2014 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 30న ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓల్లోని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గత నెల 14వ తేదీన కొత్త జీఓ జారీ చేసింది. 250 గజాలు దాటితే మార్కెట్ విలువ చెల్లించాల్సిందే.. ప్రభుత్వం తాజాగా తెచ్చిన జీఓ ప్రకారం 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువలో 50శాతం, 250 నుంచి 300 చదరపు గజాలు దాటితే 75శాతం, 500 నుంచి 1000 గజాల్లో నిర్మాణాలు చేసుకుంటే 100 శాతం మార్కెట్ విలువ చెల్లించాలి. ఈసారైనా ముందుకొచ్చేనా? జవహర్‌నగర్ కార్పొరేషన్లో దాదాపు 2 లక్షల మంది పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్నారు. 2014 క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినా చాలా మంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా వివరాలు లేకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. (క్లిక్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు తప్పని నిరాశ) అడ్డదారుల్లో వెళ్తే క్రిమినల్ కేసులు: ఆర్డీవో జీఓ.58, 59 దరఖాస్తుల కోసం అడ్డదారుల్లో వెళ్లి నకిలీ ధ్రువపత్రాలు అందజేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కీసర ఆర్డీవో రవి హెచ్చరించారు. గ్రామపంచాయితీ పేరున గతంలో తీసుకున్నట్లు బిల్లులు తీసుకువస్తే వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లక్రమబద్ధీకరణ కోసం కొన్ని చోట్ల 2014 సంవత్సారానికి ముందు తేదీలలో నకిలీ ధ్రువపత్రాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని గుర్తించి వాటిపై దర్యాప్తు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జవహర్‌గనర్‌లో గతంలో జీఓ.58 ప్రకారం 5,546, జీఓ 59 ప్రకారం 1,666 మంది దరఖాస్తులు చేసుకున్నారని వీటికి సంబంధించి మరో 10 రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈనెల 31 వరకు మీ–సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు కావాల్సినవి.. ► 2014 జూన్ 2వ తేదీకి ముందున్న నిర్మాణాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేస్తారు. ► ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేసిన వారు మీ సేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► రూ. వెయ్యి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. ► ఆధార్‌కార్డు, రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్, నీటి బిల్లులు దరఖాస్తులతో సమర్పించాలి. ► ఎంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారన్న వివరాలు తెలియజేయాలి. ► గతంలో అధికారులు ఏదైనా నోటీస్ జారీ చేస్తే అది కూడా జత చేయాలి. ► కోర్టు కేసులు ఉంటే వివరాలు తెలియజేయాలి. -
‘ఎల్ఆర్ఎస్’ ఆధారంగా ఇకపై పన్నుల వడ్డన
సాక్షి, హైదరాబాద్: లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులపై ఖాళీ స్థలాల పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) పడబోతోంది. యజమానులు ఎవరో, వారి చిరునామా తెలియక ఇంతకాలం పాటు అత్యధిక శాతం ఖాళీ స్థలాలపై ప్రభుత్వం పన్నులు విధిం చలేకపోయింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి ప్లాటు విస్తీర్ణం, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను సేకరించింది. ప్లాట్ల క్రమబద్ధీకరణతో పాటు వీటిపై ఖాళీ స్థలాల పన్ను మదింపునకు ఈ డేటా బేస్‌ను ప్రభుత్వం రెండు విధాలుగా వినియోగించుకోబో తోంది. గతేడాది ఆగస్ట్ 31న ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ట ణాలు, గ్రామ పంచాయతీల పరిధిలోని 25.59 లక్షల అనధికార ప్లాట్లు, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులొచ్చాయి. ఈ ప్లాట్లు, లే–అవుట్లు సమీప భవిష్యత్‌లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పరిధిలోకి రానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే వీటిపై సంబంధిత పురపాలికలు, గ్రామ పంచాయతీలు ఈ మేరకు పన్నులు విధించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని కోసం ఎల్ఆర్ఎస్–2020 డేటా బేస్‌ను త్వరలో ఆయా పురపాలికలు, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అందజేయనుందని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నా యి. ఈ వివరాల ఆధారంగా ఖాళీ స్థలా లపై విధించే పన్నును స్థానిక పురపాలికలు/గ్రామ పంచాయతీలు మదించి దరఖాస్తుదారుల చిరునామాకు డిమాండ్ నోటీసులు పంపించే అవకాశముంది. 100% పన్నులు వసూలే లక్ష్యం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 శాతం వ్యవసాయేతర ఆస్తులపై ఆస్తి పన్నులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, పన్నేతర చార్జీల వసూళ్లను 100 శాతం జరపాలని, దీంతో అన్ని పురపాలికలు, గ్రామ పంచాయతీలు ఆదాయపరంగా స్వయం సంవృద్ధి సాధిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల్లో పన్నులు, చార్జీలను ఆయా సేవల కల్పనకు అవుతున్న వాస్తవ వ్యయం మేరకు ఎప్పటికప్పుడు పెంచి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్ధేశిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పరిధిలోకి రాకుండా మిగిలిన పోయిన గృహాలు, ఖాళీ స్థలాలను పన్నుల పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో సైతం డేటాబేస్‌తో పన్నులు ధరణి పోర్టల్ రూపకల్పన కోసం గతేడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నిర్వహించిన సర్వేలో ఆస్తి పన్నుల పరిధిలోకి రాని 1,09,735 గృహాలను పురపాలకశాఖ గుర్తించింది. వీటిపై ఆస్తి పన్ను విధించాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా 2015లో ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టినప్పుడు సైతం దరఖాస్తుదారుల వివరాల ఆధారంగా ప్లాట్లపై ఖాళీ స్థలాల పన్నులను స్థానిక పురపాలికలు విధించాయి. అనుమతి లేకుండా/అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై.. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను అధికంగా జరిమానాలుగా వసూలు చేయాలని పురపాలక శాఖ నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే అక్రమ కట్టడాలు, ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు లేక గతంలో జరిమానాలు విధించలేకపోయారు. బీఆర్ఎస్–2015 కింద అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, అందులో ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండటంతో, ఆయా కట్టడాలపై జరిమానాలను విధించడానికి సమాచారాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంది. బీఆర్ఎస్–2015 అమలుపై హైకోర్టు స్టే విధించడంతో దరఖాస్తులు పరిష్కారమయ్యే వరకు జరిమానాలు చెల్లించక తప్పట్లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టైం.. టైం.. టైం.. ప్లీజ్!
-
టైం.. టైం.. టైం.. ప్లీజ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన అనుకున్న గడువులోగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రక్రియ ప్రారంభమై ఆదివారం నాటికి నెల రోజులవుతున్నా.. ఇప్పటివరకు కేవలం 16 శాతం రికార్డుల ప్రక్షాళన మాత్రమే పూర్తయింది. దీంతో ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం అసాధ్యమనే భావన రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కలిపి మొత్తం 1,78,27,308 సర్వే నంబర్లలో 2,40,68,290 ఎకరాల భూమి ఉండగా.. అందులో శనివారం నాటికి 29,56,357 సర్వే నంబర్లలోని 41,28,955 ఎకరాలకు సంబంధించిన భూరికార్డులను మాత్రమే పరిశీలించారు. ఇంకా దాదాపు 1.30 కోట్ల సర్వే నంబర్లలోని 2 కోట్ల ఎకరాల భూ రికార్డుల పరిశీలించి ప్రక్షాళన చేయడం మిగిలిన 75 రోజుల్లో పూర్తయ్యేది కాదని, కనీసం మరో నెల రోజుల గడువు పొడగించాల్సి ఉంటుందన్న అభిప్రాయం క్షేత్రస్థాయి రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రోజుకు 1.20 లక్షలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెప్టెంబర్ 15 నుంచి భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమైంది. తొలి పది రోజుల్లో రెవెన్యూ యంత్రాంగం 5 లక్షల సర్వే నంబర్లలో రికార్డుల పరిశీలనను పూర్తి చేసింది. ఆ తర్వాత 10 రోజుల్లో కొంచెం ఊపందుకుని 14 లక్షలకు చేరింది. చివరి 10 రోజుల్లో ఆ సంఖ్య 29 లక్షలకు చేరింది. తొలి పది రోజుల్లో ప్రక్షాళన కాస్త మందకొడిగా సాగినా.. ఆ తర్వాత ఊపందుకుంది. ఈ నెల 13 నాటికి 28,32,121 సర్వే నంబర్లలో పరి«శీలన పూర్తి కాగా.. మరుసటి రోజు అది 29,56,357కు చేరింది. ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే రోజుకు 1.20 లక్షల సర్వే నంబర్లలో భూరికార్డుల పరిశీలన పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత కన్నా వేగం పెరిగే పరిస్థితులు లేవని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ఒకవేళ ఇంకొంచెం ఊపందుకున్నా 1.50 లక్షల వరకు చేరుతుందని, ఈ లెక్కన చూసినా మిగిలిన భూరికార్డులు పరిశీలించేందుకు కనీసం 100 రోజులు పడుతుందని అంటున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంకా 75 రోజులే మిగిలాయి. ఇక పరిశీలన తర్వాత ప్రక్షాళనకు కనీసం మరో 15 రోజులు పడుతుందని, మొత్తం కలిపి మరో నెల రోజుల గడువు కచ్చితంగా అవసరమవుతుందని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పామని, గడువు పెంచితేనే పారదర్శకంగా రికార్డుల పరిశీలన పూర్తవుతుందని వివరించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే మేజర్ గ్రామ పంచాయతీల్లో 10 రోజుల్లో రికార్డుల పరిశీలన సాధ్యం కావడం లేదని సమాచారం. ప్రతి పంచాయతీలో 10 రోజుల్లో ప్రక్షాళన పూర్తి చేయాలని ఆదేశాలున్నాయని, వీటిని సవరించకుంటే చాలాచోట్ల కష్టమవుతుందని ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి అధికారులు తేల్చిచెప్పినట్టు సమాచారం. దూసుకుపోతున్న రంగారెడ్డి ప్రస్తుతం జరుగుతున్న భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు దూసుకెళుతున్నాయి. మొత్తం 31 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఇప్పటివరకు లక్షకు పైగా సర్వే నంబర్ల పరిశీలన పూర్తి కాగా, ఈ రెండు జిల్లాల్లో మాత్రం 2 లక్షలు దాటింది. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డిలో 2,58,470 సర్వే నంబర్లలోని 3,15,831 ఎకరాలకు సంబంధించిన భూరికార్డుల పరిశీలన పూర్తయింది. నల్లగొండ జిల్లాలో 2,30,140 సర్వే నంబర్లలోని 3,09,976 ఎకరాల రికార్డుల పరిశీలన పూర్తయింది. లక్షకు పైగా సర్వే పూర్తయిన జిల్లాల్లో నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేవలం 31,947 సర్వే నంబర్లలోని భూరికార్డుల పరిశీలనతో చివరి స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా 32,928 సర్వే నంబర్లతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. అటవీప్రాంతం ఎక్కువగా ఉండే ఆసిఫాబాద్, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా సర్వే నత్తనడకన సాగుతోంది. భూరికార్డుల ప్రక్షాళన గణాంకాలివే.. రాష్ట్రంలోని మొత్తం సర్వే నంబర్లు: 1,78,27,308 మొత్తం భూవిస్తీర్ణం: 2,40,68,290 (ఎకరాల్లో) ఇప్పటివరకు పరిశీలించిన సర్వే నంబర్లు: 29,56,357 భూ విస్తీర్ణం:41,28,955 (ఎకరాల్లో) ఇంకా పరిశీలించాల్సిన సర్వే నంబర్లు: 1.30 కోట్లు -
ఆశలన్నీ భూమి పాలు!
చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ లేనట్లే 2.5 లక్షల కుటుంబాలకు నిరాశే.. సాంకేతిక కారణాలే అడ్డు కేటగిరీ మార్పునకు రెవెన్యూ అధికారులు ససేమిరా సర్కారు భారీ ఆదాయ అంచనాలన్నీ తలకిందులు పంపిణీకి సిద్ధంగా ఉన్న ‘ఉచిత’ పట్టాలు 95,034 మాత్రమే ముగిసిన గడువు.. జూన్ 2న పట్టాల పంపిణీ సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణను టీఆర్ఎస్ సర్కారు మధ్యలోనే వదిలేయనుందా?.. ఎలాంటి అభ్యంతరం లేని కొన్ని స్థలాలనే క్రమబద్ధీకరించి చేతులు దులిపేసుకోనుందా? వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాలన్నీ తలకిందులవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందా? ఈ ప్రశ్నలన్నింటికీ దాదాపు అవుననే సమాధానాలే వస్తున్నాయి. అభ్యంతరకర భూములను నిరభ్యంతర కేటగిరీకి మార్చేం దుకు వీలుకాదని రెవెన్యూ శాఖ తెగేసి చెప్పడం, తొలుత ఎంతో హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు దీనిని పట్టించుకోపోవడం, ముగింపు గడువు ముగిసినా ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగకపోవడం వంటివన్నీ భూముల క్రమబద్ధీకరణను ప్రభుత్వం పక్కనపెడుతుందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా..: భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి డిసెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 125 గజాల్లోపు స్థలాలను పేదలకు ఉచితంగానే క్రమబద్ధీకరిస్తామని జీవో నంబర్ 58లో పేర్కొంది. ఇక జీవో నంబర్ 59 ద్వారా (చెల్లింపు కేటగిరీలో) అధికాదాయ వర్గాలకు కూడా భూములను రిజిస్ట్రేషన్ ధర చెల్లింపు మేరకు క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమబద్ధీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,66,150 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఉచిత కేటగిరీ కింద 3,36,869 దరఖాస్తులు, చెల్లింపు కేటగిరీలో 29,281 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఏప్రిల్ 30కల్లా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాంకేతిక కారణాలు: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సాంకేతిక కారణాలు ఆటంకంగా మారాయి. శిఖం, శ్మశాన, మిలటరీ, రైల్వే తదితర ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఎలాంటి అభ్యంతరాలు లేని భూములకు సంబంధించిన 95 వేల దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. మిగతా రెండున్నర లక్షల దరఖాస్తులను అటకెక్కించేస్తున్నారు. ముగిసిన గడువు: క్రమబద్ధీకరణ ప్రక్రియకు గురువారంతోనే గడువు ముగిసిపోయింది. చెల్లింపు కేటగిరీలోని 29 వేల దరఖాస్తులతోపాటు రిజిస్ట్రేషన్ ధర (తొలి వాయిదా 12.5 శాతం) సుమారు రూ.133.5 కోట్లను దరఖాస్తుదారులు చెల్లించారు. నెలలు గడుస్తున్నా వాటికి మోక్షం లభించలేదు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర నగరాలు, ముఖ్య పట్టణాల్లో దరఖాస్తుదారులు క్లెయిమ్ చేసిన స్థలాల రిజిస్ట్రేషన్ ధర మార్కెట్ ధర కన్నా ఎక్కువగా ఉండడం ఇబ్బందిగా మారింది. కొన్ని ప్రదేశాల్లో ప్రధాన రహదారి వెంట ఉన్న భూముల రిజిస్ట్రేషన్ ధర లెక్కన మురికివాడల్లోని స్థలాలకు కూడా చెల్లించాలనడంతో దరఖాస్తుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎలాంటి అభ్యంతరం లేని కొన్ని స్థలాలను క్రమబద్ధీకరించనున్న ప్రభుత్వం జూన్ 2 రోజున పట్టాలను పంపిణీ చేయాలని సంకల్పించింది. ముందుగా జగ్జీవన్‌రామ్, బీఆర్ అంబేద్కర్ జయంతి రోజునే పట్టాల పంపిణీ చేపట్టాలనుకున్నా అది సాధ్యపడలేదు. ‘క్రమబద్ధీకరణ’ వ్యవహారం ఇదీ మొత్తం దరఖాస్తులు 3,66,150 ఉచిత కేటగిరీ 3,36,869 చెల్లింపు కేటగిరీ 29,281 సిద్ధంగా ఉన్న పట్టాలు (ఉచితం) 95,034 చెల్లింపు కేటగిరీలో పట్టాలు.. 0 దరఖాస్తులు వచ్చిన స్థలాల వివరాలు అభ్యంతరకర భూములున్నవి 2,41,835 కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి 93,770 రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి 1,48,065 -
భూముల క్రమబద్ధీకరణపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం భూముల క్రమబద్ధీకరణపై సచివాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవో 58,59లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ఈ సమీక్ష జరుగుతున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని, దీనిని దరఖాస్తుదారులందరికీ పత్రికాముఖంగా తెలియచేయాలన్న తమ ఆదేశాలను ఇప్పటివరకు అమలు కాకపోవటంపై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.