
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన అనుకున్న గడువులోగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రక్రియ ప్రారంభమై ఆదివారం నాటికి నెల రోజులవుతున్నా.. ఇప్పటివరకు కేవలం 16 శాతం రికార్డుల ప్రక్షాళన మాత్రమే పూర్తయింది. దీంతో ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం అసాధ్యమనే భావన రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కలిపి మొత్తం 1,78,27,308 సర్వే నంబర్లలో 2,40,68,290 ఎకరాల భూమి ఉండగా.. అందులో శనివారం నాటికి 29,56,357 సర్వే నంబర్లలోని 41,28,955 ఎకరాలకు సంబంధించిన భూరికార్డులను మాత్రమే పరిశీలించారు. ఇంకా దాదాపు 1.30 కోట్ల సర్వే నంబర్లలోని 2 కోట్ల ఎకరాల భూ రికార్డుల పరిశీలించి ప్రక్షాళన చేయడం మిగిలిన 75 రోజుల్లో పూర్తయ్యేది కాదని, కనీసం మరో నెల రోజుల గడువు పొడగించాల్సి ఉంటుందన్న అభిప్రాయం క్షేత్రస్థాయి రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
రోజుకు 1.20 లక్షలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సెప్టెంబర్ 15 నుంచి భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమైంది. తొలి పది రోజుల్లో రెవెన్యూ యంత్రాంగం 5 లక్షల సర్వే నంబర్లలో రికార్డుల పరిశీలనను పూర్తి చేసింది. ఆ తర్వాత 10 రోజుల్లో కొంచెం ఊపందుకుని 14 లక్షలకు చేరింది. చివరి 10 రోజుల్లో ఆ సంఖ్య 29 లక్షలకు చేరింది. తొలి పది రోజుల్లో ప్రక్షాళన కాస్త మందకొడిగా సాగినా.. ఆ తర్వాత ఊపందుకుంది. ఈ నెల 13 నాటికి 28,32,121 సర్వే నంబర్లలో పరి«శీలన పూర్తి కాగా.. మరుసటి రోజు అది 29,56,357కు చేరింది. ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే రోజుకు 1.20 లక్షల సర్వే నంబర్లలో భూరికార్డుల పరిశీలన పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత కన్నా వేగం పెరిగే పరిస్థితులు లేవని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
ఒకవేళ ఇంకొంచెం ఊపందుకున్నా 1.50 లక్షల వరకు చేరుతుందని, ఈ లెక్కన చూసినా మిగిలిన భూరికార్డులు పరిశీలించేందుకు కనీసం 100 రోజులు పడుతుందని అంటున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంకా 75 రోజులే మిగిలాయి. ఇక పరిశీలన తర్వాత ప్రక్షాళనకు కనీసం మరో 15 రోజులు పడుతుందని, మొత్తం కలిపి మరో నెల రోజుల గడువు కచ్చితంగా అవసరమవుతుందని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పామని, గడువు పెంచితేనే పారదర్శకంగా రికార్డుల పరిశీలన పూర్తవుతుందని వివరించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే మేజర్ గ్రామ పంచాయతీల్లో 10 రోజుల్లో రికార్డుల పరిశీలన సాధ్యం కావడం లేదని సమాచారం. ప్రతి పంచాయతీలో 10 రోజుల్లో ప్రక్షాళన పూర్తి చేయాలని ఆదేశాలున్నాయని, వీటిని సవరించకుంటే చాలాచోట్ల కష్టమవుతుందని ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి అధికారులు తేల్చిచెప్పినట్టు సమాచారం.
దూసుకుపోతున్న రంగారెడ్డి
ప్రస్తుతం జరుగుతున్న భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు దూసుకెళుతున్నాయి. మొత్తం 31 జిల్లాల్లో 12 జిల్లాల్లో ఇప్పటివరకు లక్షకు పైగా సర్వే నంబర్ల పరిశీలన పూర్తి కాగా, ఈ రెండు జిల్లాల్లో మాత్రం 2 లక్షలు దాటింది. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డిలో 2,58,470 సర్వే నంబర్లలోని 3,15,831 ఎకరాలకు సంబంధించిన భూరికార్డుల పరిశీలన పూర్తయింది. నల్లగొండ జిల్లాలో 2,30,140 సర్వే నంబర్లలోని 3,09,976 ఎకరాల రికార్డుల పరిశీలన పూర్తయింది. లక్షకు పైగా సర్వే పూర్తయిన జిల్లాల్లో నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేవలం 31,947 సర్వే నంబర్లలోని భూరికార్డుల పరిశీలనతో చివరి స్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా 32,928 సర్వే నంబర్లతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. అటవీప్రాంతం ఎక్కువగా ఉండే ఆసిఫాబాద్, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా సర్వే నత్తనడకన సాగుతోంది.
భూరికార్డుల ప్రక్షాళన గణాంకాలివే..
రాష్ట్రంలోని మొత్తం సర్వే నంబర్లు: 1,78,27,308
మొత్తం భూవిస్తీర్ణం: 2,40,68,290 (ఎకరాల్లో)
ఇప్పటివరకు పరిశీలించిన సర్వే నంబర్లు: 29,56,357
భూ విస్తీర్ణం:41,28,955 (ఎకరాల్లో)
ఇంకా పరిశీలించాల్సిన సర్వే నంబర్లు: 1.30 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment