
ఆశలన్నీ భూమి పాలు!
చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ లేనట్లే
2.5 లక్షల కుటుంబాలకు నిరాశే.. సాంకేతిక కారణాలే అడ్డు
కేటగిరీ మార్పునకు రెవెన్యూ అధికారులు ససేమిరా
సర్కారు భారీ ఆదాయ అంచనాలన్నీ తలకిందులు
పంపిణీకి సిద్ధంగా ఉన్న ‘ఉచిత’ పట్టాలు 95,034 మాత్రమే
ముగిసిన గడువు.. జూన్ 2న పట్టాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణను టీఆర్‌ఎస్ సర్కారు మధ్యలోనే వదిలేయనుందా?.. ఎలాంటి అభ్యంతరం లేని కొన్ని స్థలాలనే క్రమబద్ధీకరించి చేతులు దులిపేసుకోనుందా? వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనాలన్నీ తలకిందులవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందా? ఈ ప్రశ్నలన్నింటికీ దాదాపు అవుననే సమాధానాలే వస్తున్నాయి. అభ్యంతరకర భూములను నిరభ్యంతర కేటగిరీకి మార్చేం దుకు వీలుకాదని రెవెన్యూ శాఖ తెగేసి చెప్పడం, తొలుత ఎంతో హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు దీనిని పట్టించుకోపోవడం, ముగింపు గడువు ముగిసినా ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగకపోవడం వంటివన్నీ భూముల క్రమబద్ధీకరణను ప్రభుత్వం పక్కనపెడుతుందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.
ప్రతిష్టాత్మకంగా..: భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి డిసెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 125 గజాల్లోపు స్థలాలను పేదలకు ఉచితంగానే క్రమబద్ధీకరిస్తామని జీవో నంబర్ 58లో పేర్కొంది. ఇక జీవో నంబర్ 59 ద్వారా (చెల్లింపు కేటగిరీలో) అధికాదాయ వర్గాలకు కూడా భూములను రిజిస్ట్రేషన్ ధర చెల్లింపు మేరకు క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమబద్ధీకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,66,150 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఉచిత కేటగిరీ కింద 3,36,869 దరఖాస్తులు, చెల్లింపు కేటగిరీలో 29,281 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఏప్రిల్ 30కల్లా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సాంకేతిక కారణాలు: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సాంకేతిక కారణాలు ఆటంకంగా మారాయి. శిఖం, శ్మశాన, మిలటరీ, రైల్వే తదితర ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో గత మూడు నెలలుగా కొనసాగుతున్న ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఎలాంటి అభ్యంతరాలు లేని భూములకు సంబంధించిన 95 వేల దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. మిగతా రెండున్నర లక్షల దరఖాస్తులను అటకెక్కించేస్తున్నారు.
ముగిసిన గడువు: క్రమబద్ధీకరణ ప్రక్రియకు గురువారంతోనే గడువు ముగిసిపోయింది. చెల్లింపు కేటగిరీలోని 29 వేల దరఖాస్తులతోపాటు రిజిస్ట్రేషన్ ధర (తొలి వాయిదా 12.5 శాతం) సుమారు రూ.133.5 కోట్లను దరఖాస్తుదారులు చెల్లించారు. నెలలు గడుస్తున్నా వాటికి మోక్షం లభించలేదు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర నగరాలు, ముఖ్య పట్టణాల్లో దరఖాస్తుదారులు క్లెయిమ్ చేసిన స్థలాల రిజిస్ట్రేషన్ ధర మార్కెట్ ధర కన్నా ఎక్కువగా ఉండడం ఇబ్బందిగా మారింది. కొన్ని ప్రదేశాల్లో ప్రధాన రహదారి వెంట ఉన్న భూముల రిజిస్ట్రేషన్ ధర లెక్కన మురికివాడల్లోని స్థలాలకు కూడా చెల్లించాలనడంతో దరఖాస్తుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఎలాంటి అభ్యంతరం లేని కొన్ని స్థలాలను క్రమబద్ధీకరించనున్న ప్రభుత్వం జూన్ 2 రోజున పట్టాలను పంపిణీ చేయాలని సంకల్పించింది. ముందుగా జగ్జీవన్‌రామ్, బీఆర్ అంబేద్కర్ జయంతి రోజునే పట్టాల పంపిణీ చేపట్టాలనుకున్నా అది సాధ్యపడలేదు.
‘క్రమబద్ధీకరణ’ వ్యవహారం ఇదీ
మొత్తం దరఖాస్తులు 3,66,150
ఉచిత కేటగిరీ 3,36,869
చెల్లింపు కేటగిరీ 29,281
సిద్ధంగా ఉన్న పట్టాలు (ఉచితం) 95,034
చెల్లింపు కేటగిరీలో పట్టాలు.. 0
దరఖాస్తులు వచ్చిన స్థలాల వివరాలు
అభ్యంతరకర భూములున్నవి 2,41,835
కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివి 93,770
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి 1,48,065